Magazines

మాట‌ల్లో కాదు...!

1 గంట క్రితం

Path of Struggle
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 2 నిమిషాల చదవడం

‘‘స‌మ‌ర్థ‌వంతంగా, నిష్ప‌క్ష‌పాతంతో ప‌నిచేసే పోలీసు వ్య‌వ‌స్థ‌ను ప్ర‌జ‌ల‌కు అందిస్తున్నాం.. ఆ వ్య‌వ‌స్థ మెరుగైన స‌మాజ నిర్మాణానికి, పౌరుల భ‌ద్ర‌త‌కు పెట్టుబ‌డిగా ప్ర‌భుత్వం భావిస్తోంది...’’ తాజాగా హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన ద‌క్షిణాది రాష్ట్రాల పోలీసు ఉన్న‌తాధికారుల స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లివి. గ‌త బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ ర‌క‌ర‌కాల క‌బుర్లు చెప్పింది. వాస్త‌వానికి ఉమ్మ‌డి రాష్ట్రంలోగానీ, ఆ త‌ర్వాత తెలంగాణలోగానీ ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త క‌ల్పించాల్సిన పోలీస్ వ్య‌వ‌స్థ.. అదే రీతిన ప‌నిచేస్తోందా? లేక పాల‌క ప‌క్షాలకు వ‌త్తాసు ప‌లుకుతూ పౌర హ‌క్కుల‌ను కాల‌రాస్తోందా? అనేది త‌ర‌చి చూడాల్సిన అంశం. వాస్త‌వానికి మెరుగైన స‌మాజ నిర్మాణంలో పోలీసుల పాత్ర అంతా ఇంతా కాదు. సైబ‌ర్ నేరాల నియం త్ర‌ణ‌, మాద‌క ద్ర‌వ్యాల ర‌వాణాను అరిక‌ట్ట‌టం, ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌టంలో వారి పాత్ర‌ను మ‌రువ‌లేం. ప్ర‌తీ విభాగం అధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగించు కుని నేరాలకు అడ్డుక‌ట్ట వేస్తోంద‌ న‌టంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇందుకోసం ప్ర‌భుత్వం విరివిగా నిధులు కేటాయించి, ఖ‌ర్చు చేయ‌ ట‌మూ త‌ప్పు కాదు.

కానీ ఈ పేరిట ప్ర‌జ‌ల‌పై జులూం కూడా స‌రికాదు క‌దా... ఉమ్మ‌డి ఆంధ్రప్ర‌దేశ్‌లో విద్యుత్ ఉద్య‌మం, ఆ త‌ర్వాత భూ పోరాటం, అంగ‌న్ వాడీల పోరుబాట త‌దిత‌ర సంద‌ర్భాల్లో ప్ర‌భుత్వ క‌నుస‌న్న‌ల్లో న‌డిచిన నాటి పోలీసు బాసులు ప్ర‌జ‌ల‌పై ద‌మ‌న‌కాండ కొన‌సాగించారు. ఆయా ఘ‌ట‌న‌ల్లో అనేక మంది అసువులు బాసారు. తెలంగాణ ఏర్ప‌డ్డాక త‌మ‌ది ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్య‌వ‌స్థ అని చెప్పిన గులాబీ పార్టీ అధినేత హ‌యాంలోనే నేరెళ్ల ఘ‌ట‌న‌ను చూశాం. అప్పుడు థ‌ర్డ్ డిగ్రీ బారినప‌డ్డ అమాయ‌కులు నేటికీ సాధార‌ణ స్థితికి రాలేక‌పో తున్నారు. ఉమ్మ‌డి ఏపీలో విద్యుత్ ఉద్య‌మంలో క‌లిసొచ్చిన కాంగ్రెస్సే నేడు తెలంగాణ‌లో అధికారంలో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌కు వ్య‌తి రేకంగా ప్ర‌స్తుతం ఉద్య‌మాలు ఊపం దుకుంటున్నాయి. విద్యార్థులు ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌, స్కాల‌ర్‌ షిప్పుల కోసం, యువ‌త ఉద్యోగాల కోసం, మ‌హిళ‌లు త‌మ‌కు స‌మాజంలో భ‌ద్ర‌త కోసం, రైతులు గిట్టుబాటు ధ‌ర‌ల కోసం, సామాన్యుడు ధ‌రాభారం నుంచి ర‌క్షించాలంటూ వీధుల్లోకి వ‌స్తున్నారు. వారంద‌రి కోర్కెలు, డిమాండ్ల‌ను ప‌రిశీలించి, ప‌రిష్క‌రిం చాల్సిన బాధ్య‌త పాల‌కుల‌దే. కానీ అందుకు భిన్నంగా ప‌రిస్థితి కొన‌సాగుతుండ‌టం ఆందోళ‌న‌క‌రం.

నేతల‌ను గృహ నిర్బంధం చేయ‌టం, ఆందోళ‌న‌ల‌ను అణచివేయ‌జూడ‌టం, నిర‌స‌న‌ల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌టం తెలంగాణ‌కు ఎంత‌మాత్ర‌మూ మంచిది కాదు. ప్ర‌స్తుతం కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వం రాజ్యాంగంపైన‌, ప్ర‌జాస్వామ్యంపైన‌, ప్ర‌జ‌ల హ‌క్కుల‌పైనా తీవ్ర‌మైన దాడికి పాల్ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో పార్ల‌మెంటులో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా, ఇండియా కూట‌మిలోని అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్ ఒక గురుత‌ర బాధ్య‌త‌ను పోషించాలి. మేధావులు, ప్ర‌జాస్వామికవాదులు, ప్ర‌జ‌ల‌ను క‌లుపుకుని పెద్ద ఎత్తున కేంద్రంపై పోరాడాలి. ఆ క్ర‌తువులో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూడా త‌న వంతు పాత్ర‌ను పోషించాలి. అందుక‌నుగుణంగా ఒక ప్ర‌జాస్వామిక వాతావ‌ర‌ణాన్ని అది పాదుకొల్పాలి. ప్ర‌తిప‌క్షాలు ఎంత బ‌లంగా ఉంటే ప్ర‌జాస్వామ్యం అంత బ‌లంగా ఉంటుంద‌నే వాస్త‌వాన్ని అంగీక‌రించి, ఒక స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణానికి బీజాలు వేయాలి. అంతే త‌ప్ప ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌ల సంద‌ర్భంగా జిల్లాల్లో నేత‌ల‌ను దిగ్బంధించ‌టం, కార్మిక నేత‌ల‌ను ఇండ్ల నుంచి క‌ద‌ల‌నీయ‌క‌ పోవ‌టం అనేవి ప్ర‌జా ప్ర‌భుత్వ‌మ‌నే మాట‌కు అర్థం లేకుండా చేస్తాయి. అందుకే క‌మిటీలు, స‌మావేశాల్లో ప‌లు అంశాలు చెప్ప‌టానికే ప‌రిమితం కాకుండా వాటిని ఆచ‌ర‌ణ‌లో చేసి చూపించాలి. అప్పుడే ప్ర‌జ‌లు... ప్ర‌భుత్వాన్ని విశ్వ‌సిస్తారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్