Magazines

సర్‌ను రద్దు చేయాలి

1 గంట క్రితం

CITU
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 2 నిమిషాల చదవడం

సీఈసీ జ్ఞానేశ్‌‌కుమార్‌ను తొలగించాలి :
రైతు, వ్యవసాయ కార్మిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన

సీఈసీ దిష్టిబొమ్మ దహనం


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్‌)ను రద్దు చేయాలి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానే‌శ్‌‌కుమార్‌ను తొలగించాలి. ఆందోళనకారులపై నిర్బంధాన్ని ఆపాలి’ అని పలువురు వక్తలు డిమాండ్‌ ‌చేశారు. ఇదే అంశంపై కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌‌లోని నారాయణగూడ చౌరస్తాలో సీఈసీ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నగర అధ్యక్షులు ఎం. దశరథ్ అధ్యక్షతన జరిగిన సభలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ అర్హత కలిగిన ఓట్లను సైతం తొలగించేందుకు ఉపయోగపడుతున్న ‘సర్‌’ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌‌ను తొలగించాలన్నారు. ఈ విషయమై ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువతపై ఢిల్లీ పోలీసులు అక్రమ కేసులు బనాయించడం అన్యాయమన్నారు.

ఎలాంటి పారదర్శకత లేకుండా ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 13.41 కోట్ల పౌరులందరికీ ఓటు హక్కును పునరుద్ధరించాలని డిమాండ్‌ ‌చేశారు. ఏఐకెఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ విద్యార్థినులు, మహిళలతో సహా నిరసనకారులపై జరుగుతున్న క్రూరమైన దాడులు, హింసలను అరికట్టాలన్నారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమంలో పాల్గొంటున్న విద్యార్థులు, యువత, ప్రగతిశీల వాదుల మద్దతుగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, విద్యార్థి, యువజన, మహిళా, సామాజిక, గిరిజన, మైనారిటీ, వృత్తి, సంఘాలు, విద్యావంతులు, మేధావులు, భాగస్వాములు కావాల్సిన అవసరముందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతున్న నాయకులు, కార్యకర్తల విచ్చలవిడి గృహ నిర్బంధ చర్యలు ఆపాలని డిమాండ్‌ ‌చేశారు. దేశాన్ని పోలీసు రాజ్యంగా మార్చడాన్ని వ్యతిరేకించాలన్నారు. పౌరుల గోప్యతపై ప్రభుత్వం మితిమీరిన జోక్యాన్ని అరికట్టాలన్నారు.

ఢిల్లీ రాజధానిలో విస్తృతంగా జరుగుతున్న నేరాలను సుప్రీంకోర్టుతో సహా న్యాయవ్యవస్థ సుమోటోగా స్వీకరించకపోవడం ఆందోళన కలిగిస్తున్నదన్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించడానికి అన్ని తరగతుల ప్రజలు క్రియాశీలంగా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐకెఎంఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జెవి. చలపతిరావు, ఐఎఫ్ టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాస్, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.డి. చంద్రశేఖర్, ఏఐకెఎస్ రాష్ట్ర నాయకులు నరేంద్ర ప్రసాద్, టీయూసీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రవీణ్, బీఆర్‌‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీరాం నాయక్,

రైతు సంఘం నాయకులు జక్కుల వెంకటయ్య, విజయ్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట రమేష్‌, అనగంటి వెంకటేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రజనీకాంత్, సహాయ కార్యదర్శి అశోక్ రెడ్డి, ఎన్‌‌పీఆర్‌‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. స్కైలాబ్ బాబు, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. ఆశయ్య తదితరులు ప్రసంగించారు. వీరితో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు భూపాల్, పి జయలక్ష్మి, జె. వెంకటేష్, వంగూరు రాములు, ఎం. పద్మశ్రీ, పి. శ్రీకాంత్, పి. సుధాకర్, వై. సోమన్న, ఎ. సునీత, రొయ్యల రాజు, జె. కుమారస్వామి, నరేష్, ఎం. మహేందర్ , ఐఎన్‌‌టీయూసీ నాయకులు విజయ్‌‌కుమార్ యాదవ్, ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ అరుణజ్యోతి, అనురాధ, ఐఎఫ్‌‌టీయూ నాయకులు అనూరాధ , శివబాబు, తెలంగాణ రైతు సంఘం కోశాధికారి శోభన్ నాయక్ , టీజీఎస్‌ అధ్యక్షులు ఎం. ధర్మానాయక్, టీయూసీఐ నాయకులు ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్