కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీపీఐ(ఎం) ఎంపీ ఎ.ఎ. రహీం లేఖ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతా దారుల వ్యక్తిగత సమాచారం చోరీకి గురై డార్క్ వెబ్‌లో అందుబాటులోకి వచ్చిన ఘటనపై వేగంగా సమగ్ర విచారణ జరపాలని సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యుడు ఎ.ఎ. రహీం డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన లేఖ రాశారు. ఖాతాదారుల సమాచార భద్రతకు తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎస్‌బీఐ ఖాతాదారుల మొబైల్ నెంబర్లు, ఇ-మెయిల్ చిరునామాలు, బ్యాంకు శాఖల వివరాలు, రుణాలకు సంబంధించిన రికార్డులు సహా వ్యక్తిగత సమాచారం చోరీకి గురవడం అత్యంత తీవ్రమైన విషయమని రహీం పేర్కొన్నారు. ఎంతమంది ఖాతాదారుల సమాచారం చోరీకి గురైంది? ఈ సమాచారం ఎలా బయటకు వచ్చింది? అనే అంశాలపై స్పష్టత లేదని తెలిపారు. కూలీలు, కార్మికులు, రైతులు, మధ్యతరహా వ్యాపారులు సహా కోట్లాది మంది సామాన్య ప్రజలు ఎస్‌బీఐపై ఆధారపడుతున్నారని పేర్కొన్నారు. ప్రభావిత ఖాతాదారులకు అవసరమైన సహాయాన్ని తక్షణమే అందించాలని, వారి బ్యాంకు ఖాతాల భద్రతకు భరోసా కల్పించాలని కోరారు.
మోసపూరిత లావాదేవీలు జరగకుండా చర్యలు తీసుకోవాలి
చోరీకి గురైన సమాచారాన్ని ఉపయోగించి రానున్న రోజుల్లో నకిలీ లావాదేవీలు, ఆర్థిక మోసాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రహీం కోరారు. ఎంతమంది ఖాతాదారులపై ప్రభావం పడింది? చోరీకి గురైన సమాచారాన్ని ఇప్పటివరకు ఏయే విధాలుగా ఉపయోగించారు? అనే అంశాలపై కచ్చితమైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలోని ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలన్నింటిలోనూ ఖాతాదారుల వ్యక్తిగత సమాచార పరిరక్షణకు కఠినమైన భద్రతా చర్యలు అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటిలో పటిష్టమైన సైబర్ సెక్యూరిటీ రక్షణ చర్యలు చేపట్టాలని, ఏదైనా నిర్లక్ష్యం లేదా భద్రతా లోపాలు జరిగితే కఠినమైన జవాబుదారీతనం వహించాలని అన్నారు.







కామెంట్‌లు (0)