చర్యలకు బదులు సీఈసీ కార్యాలయానికి లేఖలు
మెజారిటీ అభ్యంతరాలనూ వ్యక్తిగత ఫిర్యాదులుగా పరిగణించిన క్యాబినెట్ సెక్రెటేరియట్
ఎన్నికల సంఘంలో అధికారాలపై వివాదం
ఆర్టీఐతో వెలుగులోకి వచ్చిన కీలక విషయాలు
న్యూఢిల్లీ: దేశంలో ఎన్నికల నిర్వహణకు బాధ్యత వహించే భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)లో అధికారుల పని విభజనపై తలెత్తిన వివాదం.. ఉన్నత స్థాయిలో నెలకొన్న విభేదాలను బయటపెట్టింది. ఇద్దరు ఎన్నికల కమిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలపై నేరుగా చర్యలు తీసుకోకుండా, వారి లేఖలను ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) కార్యాలయానికి పంపినట్టు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వెల్లడైంది. ఎన్నికల సంఘంలో సీఈసీ, ఇతర కమిషనర్లు సమాన హోదా కలిగి ఉంటారని గుర్తించిన క్యాబినెట్ సెక్రెటేరియట్.. ఇద్దరు కమిషనర్లు ఒకే అంశంపై అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, వాటిని వ్యక్తిగత హోదాలో చేసిన ఫిర్యాదులుగా పరిగణించడం చర్చనీయాంశమైంది.జులై 29న ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి క్యాబినెట్ కార్యదర్శి టి.వి. సోమనాథన్‌కు వేర్వేరుగా లేఖలు రాశారు. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ మనీష్ గార్గ్ అధికారుల మధ్య పని బాధ్యతలను మార్చడంపై వారు అభ్యంతరం తెలిపారు.
ఎన్నికల సంఘంతో చర్చించకుండా, దాని అనుమతి తీసుకోకుండా ఈ మార్పులు చేశారని పేర్కొన్నారు. గతంలోనూ ఇలాంటి ఆదేశాలు జారీ చేశారని సంధు తన లేఖలో ప్రస్తావించారు. జులై 27 నుంచి ఆగస్టు 9 వరకు పరిపాలనా విభాగం బాధ్యతలు నిర్వహించాల్సిన అధికారి సెలవులో ఉండటంతో గార్గ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆ బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల్లోనే ఆయన పని విభజనపై ఆదేశాలు జారీ చేశారని కమిషనర్లు వివరించారు. ఈ చర్యలు ఎన్నికల సంఘం గత విధానాలకు, 2023 ఎన్నికల కమిషనర్ల సేవా నిబంధనల చట్టంలోని సెక్షన్ 18కు విరుద్ధమని అభ్యంతరం వ్యక్తం చేశారు. సంబంధిత ఫైల్ అడిగినా తనకు అందించలేదని జోషి పేర్కొన్నారు.
సమాచార హక్కు కార్యకర్త, నౌకాదళ మాజీ అధికారి లోకేశ్ బాత్రా దాఖలు చేసిన దరఖాస్తుకు ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలు బయటపడ్డాయి. ఆగస్టు 5న రెండు లేఖలు అందినట్టు క్యాబినెట్ సెక్రెటేరియట్ ధ్రువీకరించింది.
అయితే, అవి మొత్తం ఎన్నికల సంఘం తరఫున వచ్చిన అధికారిక లేఖలు కావని పేర్కొంటూ.. వాటిని సీఈసీ కార్యాలయానికి పంపాలని నిర్ణయించింది.
చట్టంలోని సెక్షన్ 18 ప్రకారం, సాధ్యమైనంతవరకు ఎన్నికల సంఘం నిర్ణయాలు ఏకాభిప్రాయంతో తీసుకోవాలి. విభేదాలు ఉంటే మెజారిటీ అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకోవాలి. ఈ నేపథ్యంలో ఇద్దరు కమిషనర్లు ఒకే అంశంపై అభ్యంతరం వ్యక్తం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఓటర్ల జాబితాల నిర్వహణకు సంబంధించిన ఈసీఐనెట్ సాంకేతిక వ్యవస్థ పర్యవేక్షణలో కీలక మార్పులు జరిగాయన్న అంశం కూడా ఈ వివాదంలో ఉంది. అయితే, పని విభజన మార్పులు అమలు కాలేదనీ, ఐటీ విభాగం పర్యవేక్షణ తొలగించలేదని ఎన్నికల సంఘం గతంలో వివరణ ఇచ్చింది. మరోవైపు, సంబంధిత అధికారుల ఫైళ్లను గార్గ్ ద్వారా కమిషనర్లకు పంపిన్ఉ కొన్ని వార్తా కథనాలు పేర్కొన్నాయి. ఈ పరిణామాలు ఎన్నికల సంఘం అంతర్గత నిర్ణయాల ప్రక్రియ, ఓటర్ల జాబితాల నిర్వహణలో పారదర్శకత, స్వతంత్రతపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఇద్దరు కమిషనర్ల అభ్యంతరాలపై తదుపరి చర్యలు ఏమిటన్నది ఇంకా స్పష్టతకు రాలేదు.






కామెంట్లు (0)