ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధిచెప్పడం ఖాయం
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి యువత బుద్ధిచెప్పడం ఖాయమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో అంబర్‌పేట నియోజకవర్గ బీఆర్‌ఎస్ నేతల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా తమను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. రాష్ట్రంలో సాగునీరు లేక, కరెంటు రాక రైతులు గోస పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పది నెలల ముందే ఎల్‌నినో ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమైందని విమర్శించారు. నీళ్లను ఎత్తి ప్రాజెక్టులను నింపాల్సి ఉన్నా కిందికి వదిలిపెట్టిందని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలు పనిచేయడం లేదన్నారు. ప్రధాని మోడీ వల్ల ఏం జరిగిందో ప్రజలు చూస్తున్నారని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ విఫలమైనందునే సీజేపీ పేరుతో యువత పోరాడుతోందని చెప్పారు.
దేశ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలు ఏకమవుతాయని అన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి హడావుడి కొన్ని రోజులేననీ, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లోనూ కేసీఆర్ కీలకమయ్యే రోజులు వస్తాయని చెప్పారు. కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని వివరించారు. అడ్డగోలు హామీలు, అబద్ధాఆలు ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. అన్ని వర్గాలనూ కాంగ్రెస్ పార్టీ నిండా ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలన చాతకాక ప్రజలకు ఏమీ చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారని అన్నారు.
రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేషన్ ఎన్నికలు పెట్టే ధైర్యం సీఎం రేవంత్ రెడ్డికి లేదన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల నమోదు నుంచి మొదలుకుని పోలింగ్ దాకా అందరూ కలిసి పనిచేయాలని చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ధన బలాన్ని మాత్రమే నమ్ముకున్నదని అన్నారు. విద్యార్థులను, నిరుద్యోగ యువతీయువకులను యూత్ డిక్లరేషన్ పేరుతో దారుణంగా మోసం చేసిందన్నారు.





కామెంట్‌లు (0)