Magazines

త్వరలో తుమ్మిడిహెట్టి పై మహారాష్ట్రతో చర్చలు

1 గంట క్రితం

Thummidihetti
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 24, 2026 | 3 నిమిషాల చదవడం

ఆ రాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ అంగీకారం

152 మీటర్ల ఎత్తులో నిర్మాణానికి ఒప్పించేలా వాదనలు

ఏదుల నుంచే డిండి, అచ్చంపేట ఎత్తిపోతలకు నీళ్లు

పాలమూరుకు గండి పడకుండా అదనంగా తరలింపు : ప్రాజెక్టుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి


నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో త్వరలో జరిగే చర్చలకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 23 తర్వాత చర్చలకు ఆహ్వానిస్తానని ఆ రాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఇటీవలే సూచనప్రాయంగా తెలియజేశారని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌‌లోని బోధి పెవిలియన్‌లో సీఎం రేవంత్ రెడ్డి సాగునీటి శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌తో పాటు డిండి, అచ్చంపేట ఎత్తిపోతల ప్రాజెక్టులపై పీటముడిగా ఉన్న అంశాలన్నింటినీ చర్చించారు. తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మిస్తే ఎంత నీటిని తెచ్చుకునే వీలుంది.. 150 మీటర్ల ఎత్తున ఎంత నీటిని ఎల్లంపల్లి వరకు తెచ్చుకునే అవకాశముందనే వివరాలను ఇరిగేషన్ ఇంజినీర్లు సీఎంకు వివరించారు.

తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంతో మహారాష్ట్ర పరిధిలో ఎక్కడా ముంపు ప్రమాదం లేదని వివరించారు. 152 మీటర్ల ఎత్తున నిర్మిస్తే దాదాపు 2300 ఎకరాల భూములు ముంపునకు గురవుతాయనీ, 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే వెయ్యి ఎకరాల లోపే ముంపు ప్రభావం ఉంటుందని తెలిపారు. మహారాష్ట్రలో ముంపు ప్రభావాన్ని అంచనా వేసుకుని సాధ్యమైనంత నీటిని తెచ్చుకునేందుకు వీలుగా ఈ బ్యారేజీ నిర్మించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన రెండు రాష్ట్రాల అధికారుల సమావేశంలో జరిగిన వివరాలన్నీ సిద్ధంగా ఉంచుకోవాలనీ, సీడబ్ల్యూసీ కోరిన సమాచారాన్ని అందజేయాలని సీఎం అధికారులకు సూచించారు. అటవీ, గిరిజన ప్రాంతం, అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మిస్తున్నామని సీఎం వివరించారు. అదే లక్ష్యాన్ని సాధించే సంకల్పంతో మహారాష్ట్ర ప్రభుత్వంతో సానుకూల చర్చలు, సంప్రదింపులు జరగాలని సీఎం తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. జల్ జంగిల్ జమీన్ నినాదంతో ఏండ్లకేండ్లు పోరాడిన అటవీ ప్రాంతవాసులందరికీ ఈ ప్రాజెక్టు ద్వారా మేలు జరగాలన్నారు. అందుకే తుమ్మడిహెట్టి ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

బ్యారేజీ ఎత్తుపై స్పష్టత వచ్చిన తర్వాత.. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు నీటిని తెచ్చే ప్రాజెక్టు రూట్ డిజైన్లు, భూసేకరణపై దృష్టి సారించాలని ఇరిగేషన్ ఇంజినీర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. గతంలోనే 148 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర అంగీకరించిందనీ, అంత తక్కువ ఎత్తున బ్యారేజీ నిర్మిస్తే ఆశించినంత నీటిని తెచ్చుకునే అవకాశం లేదని సీఎం తెలిపారు. అందుకే 152 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు అవసరమైన సాంకేతిక నివేదికలు, నీటి లభ్యత, ముంపు విస్తీర్ణం, ఇతర అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను సిద్ధంగా ఉంచాలన్నారు. మహారాష్ట్రతో చర్చల సందర్భంగా తెలంగాణ నీటి అవసరాలను తెలియజేసి, మన వాదనను సమర్థంగా వినిపించాలని మంత్రులకు సీఎం సూచించారు. డిండి ప్రాజెక్టుకు ఏదుల రిజర్వాయర్ నుంచి 0.5 టీఎంసీల నీరు, అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి 0.1 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ రెండు ప్రాజెక్టులకు అవసరమయ్యే 0.6 టీఎంసీల నీటిని శ్రీశైలం నుంచి అదనంగా సమకూర్చుకునే ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.

శ్రీశైలం, నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు ఈ అదనపు నీటిని లిఫ్ట్ చేసుకునేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఎక్కడెక్కడ పంపులు, పంప్ హౌజులు అమర్చాలి, ఇప్పుడున్న కెనాళ్లు, టన్నెల్ సిస్టమ్ సామర్థ్యం సరిపోతుందా.. లేదా ఎక్కడ కాల్వల సామర్థ్యం పెంచుకోవాలనేది సాగునీటి విభాగం వెంటనే అధ్యయనం చేసి.. అందుకు వీలైన డిజైన్లు తయారు చేసుకోవాలని సీఎం ఆదేశించారు. దీంతో పాలమూరు ప్రాజెక్టు నీటి అవసరాలకు ఎలాంటి కోత పడదని సీఎం స్పష్టం చేశారు. పాలమూరు నీటి కేటాయింపులకు ఆటంకం లేకుండా ఏదుల నుంచి డిండి, అచ్చంపేట ప్రాజెక్టులకు నీటిని అందించేలా ఈ పనులు చేపట్టాలని ఆదేశించారు. నార్లాపూర్ నుంచి డిండికి నీటిని తీసుకోవాలా ? ఏదుల నుంచి డిండికి నీటిని తరలించాలనే విషయంలో మహబూబ్‌‌నగర్‌, నల్లగొండ జిల్లాల ప్రతినిధుల అభ్యంతరాలు, విజ్ఞప్తులపై సమావేశంలో చర్చ జరిగింది.

ఈ సందర్భంగా నార్లాపూర్ నుంచి నీటిని తరలిస్తే ఎంత ఖర్చవుతుంది, ఏదుల నుంచి నీటిని తీసుకుంటే ఎంత అంచనా వ్యయమవుతుందనే వివరాలన్నీ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎం దృష్టికి తెచ్చారు. అలాగే అనుకూలతలు, ప్రతికూలతలన్నింటినీ వివరించారు. మధ్యేమార్గంగా పాలమూరు ప్రాజెక్టు నీటికి ఢోకా లేకుండా డిండి, అచ్చంపేట ఎత్తిపోతలకు నీటిని లిఫ్ట్ చేసేందుకు వీలుగా అదనపు నీటిని తెచ్చుకునే పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి చేసిన సూచనకు మంత్రులు మద్దతు తెలిపారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్, సీఎంవో కార్యదర్శితో పాటు సెక్రెటరీ (టన్నెల్) కల్నల్ పరీక్షిత్ మెహ్ర తో పాటు ఇరిగేషన్ జాయింట్ సెక్రెటరీ శ్రీనివాస్, అన్ని ప్రాజెక్టుల సీఈలు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్