Magazines

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్, బీజేపీ అలయ్ బ‌లయ్

58 నిమిషాల క్రితం

MLC elections
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 24, 2026 | 2 నిమిషాల చదవడం

మన‌ల్ని దొంగదెబ్బ తీసే ప్రయత్నం

అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాలి : కాంగ్రెస్ 
ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు సీఎం దిశానిర్దేశం


న‌వ‌తెలంగాణ బ్యూరో - హైద‌రాబాద్
త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు సంబంధించి కాంగ్రెస్ ను దెబ్బ‌తీసేందుకు బీఆర్ ఎస్‌, బీజేపీ ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి హెచ్చ‌రించారు. ఆ రెండు పార్టీలూ తెర‌వెనుక లోపాయికారీ ఒప్పందాలు, అలయ్ బ‌లయ్ చేసుకుంటున్నాయ‌ని ఆయ‌న విమ‌ర్శించారు. అందువ‌ల్ల కాంగ్రెస్ కు చెందిన ఎంపీ ద‌గ్గ‌ర నుంచి గ్రామ‌స్థాయి కార్య‌క‌ర్త వరకు అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని దిశా నిర్దేశం చేశారు. త‌ద్వారా పార్టీ అభ్య‌ర్థులు సామా రామ్మోహన్ రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని అత్య‌ధిక మెజార్టీతో గెలిపించాల‌ని పిలుపునిచ్చారు. శుక్ర‌వారం హైద‌రాబాద్‌లోని ప్ర‌జా భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన ప్ర‌త్యేక స‌మావేశంలో సీఎం మాట్లాడుతూ...పట్టభద్రుల ఎన్నికల్లో ప్రతిసారీ ఓటు హక్కును నమోదు చేసుకోవాల్సి ఉంటుంద‌ని గుర్తు చేశారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గాల్లో గతంతో పోల్చితే ఇప్పటివరకు 36 శాతం ఓట్లు మాత్రమే నమోదయ్యాయ‌ని వివ‌రించారు. ఇంకా 64 శాతం ఓట్లు నమోదు కావాల‌ని అన్నారు. అందువ‌ల్ల ప్ర‌తీ ఓట‌రునూ క‌ల‌వాలనీ, ప్ర‌తీ ఓటునూ న‌మోదు చేయించాల‌ని సూచించారు.

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానానిదే తుది నిర్ణ‌య‌మ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. యువ‌కులు, పార్టీ కోసం ప‌ని చేసే వారిని గుర్తించిన హైక‌మాండ్ రామ్మోహ‌న్ రెడ్డి, స‌ర్వోత్త‌మ్ రెడ్డిని ఎంపిక చేసింద‌ని వివ‌రించారు. అందువ‌ల్ల వారిద్ద‌రినీ గెలిపించాల్సిన బాధ్య‌త ప్ర‌తీ నాయ‌కుడు, కార్య‌క‌ర్త‌పై ఉంద‌ని తెలిపారు. సర్పంచ్ ఎన్నిక‌ల్లో 66 శాతం మంది పార్టీ పేరు మీద గెలిచార‌ని, మున్సిపల్ ఎన్నికల్లో 85 శాతం మంది పార్టీ సింబల్‌పైనే గెలిచార‌ని వివ‌రించారు. కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ప్ర‌త్యేక దృష్టి సారించి, క‌ష్ట‌ప‌డ‌టం వ‌ల్లే ఇది సాధ్య‌మైందని వివ‌రించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు మాత్రం కేవ‌లం అభ్యర్థులకు మాత్రమే సంబంధించినవి కావని, పార్టీకి కూడా సంబంధించినవనే విష‌యాన్ని గుర్తించాల‌ని సూచించారు. ఎన్నికలు లేని జిల్లాలకు చెందిన నాయకులకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు.

​మోడీపై తీవ్ర‌ వ్య‌తిరేక‌త...

స‌ర్ ప్ర‌క్రియ‌పై సీఎం మాట్లాడుతూ... కేంద్ర ప్ర‌భుత్వంపై, ప్ర‌ధాని మోడీపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. దేశంలో నిరుద్యోగ సమస్య విలయ తాండవం చేస్తోందన్నారు. దీంతో జెన్ జీ త‌రం ఉవ్వెత్తున ఉద్యమం చేస్తోంద‌ని గుర్తు చేశారు. వాట్సాప్ యూని వర్సిటీలో చేసిన తప్పుడు ప్రచారంతో జెన్ జీ వీధుల్లోకి వచ్చిందని వివ‌రించారు. ఫ‌లితంగా ప్ర‌ధాని మోడీపై తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేక‌త పెరిగింద‌న్నారు. ఈ క్ర‌మంలో స‌ర్ ప్రక్రియతో ఓట్ల‌ను తొల‌గించటం ద్వారా మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చేందుకు మోడీ ప్ర‌య‌త్ని స్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. దేశంలో ప్ర‌స్తుతం ఆగ‌ర్భ శ్రీమంతులు, ఓటు హ‌క్కు లేని నిరుపేద‌ల‌నే రెండు ర‌కాల పౌరులను బీజేపీ త‌యారు చేస్తోందని విమ‌ర్శిం చారు. ఓటు లేని వారికి విలువ ఉండదు.. వారిని ఎవరూ పలకరించబోర‌ని హెచ్చ‌రించారు. ఇలాంటి చ‌ర్య‌ల ద్వారా మోడీ మ‌న దేశాన్ని రాజ‌రికం వైపు తీసుకెళ్తున్నార‌ని ఆక్షే పించారు. ఈ నేప‌థ్యంలో నాటి సైమ‌న్ గో బ్యాక్ ఉద్య‌మం త‌ర‌హాలో నేడు జ్ఞానేశ్ గో బ్యాక్ అనే ఉద్య‌మానికి కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చార‌ని గుర్తు చేశారు. ఇందులో భాగంగా న‌వంబ‌రు 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వ‌హించ‌బోయే ఉద్య‌మంలో తెలంగాణ కాంగ్రెస్ నేత‌లంతా భాగస్వాములు కావాల‌ని సీఎం పిలుపునిచ్చారు. రాష్ట్రం నుంచి 10 వేల నుంచి 15 వేల మంది దాకా ఆ కార్య‌క్ర‌మంలో పాల్గొనాలంటూ ఆదేశించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్