Magazines

దద్దరిల్లిన ఢిల్లీ

1 గంట క్రితం

‘Stop the theft of votes’
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 24, 2026 | 4 నిమిషాల చదవడం

‘​సర్‌’కు వ్యతిరేకంగా వేలాది మందితో మార్చ్‌

జాతీయ పతాకాలతో క‌దంతొక్కిన నిర‌స‌న‌కారులు

‘సర్‌’ రద్దు , సీఈసీ రాజీనామాకు డిమాండ్‌

​ఈసీ కార్యాలయం వద్ద వంద‌లాది మంది అరెస్టు


​ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలో వేలాది మంది జాతీయ పతాకాలతో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ‘పీపుల్స్‌ ఎగ్నెస్ట్ సర్‌’ ప్రజా వేదిక ఢిల్లీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రధాన కార్యాలయానికి మార్చ్ కొనసాగింది. ఎన్నికల కమిషన్‌ ప్రధాన కార్యాలయం (నిర్వాచన్‌ సదన్‌) వద్దకు చేరుకున్న నిరసనకారులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.


​నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ శుక్రవారం దద్దరిల్లింది. గోల్‌ డాక్‌ఖానా సమీపంలో కాళీబారి మార్గ్‌, భాయ్‌ వీర్‌ సింగ్‌ మార్గ్‌ నుంచి ప్రజాసంఘాల మార్చ్‌ ప్రారంభమైంది. ఈ ప్రదర్శనలో పాల్గొన్న రైతులు, కార్మికులు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు జాతీయ జెండాలు ప‌ట్టుకుని ‘సర్‌ను రద్దు చేయాలి’, ‘ఓట్ల చోరీని ఆపాలి’, ‘సర్‌తో ఎన్నికలు వద్దు’ అనే బ్యానర్లతో నినాదాల హోరెత్తించారు. ఎన్నికల కమిషన్‌, సీఈసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు చెట్లు ఎక్కి జాతీయ జెండాను ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. జ్ఞానేశ్‌ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యంగ్య వ్యాఖ్యలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. అశోకా రోడ్డులోని ఎన్నికల కమిషన్‌ కార్యాలయానికి సమీపంలో బంగ్లా సాహిబ్‌ గురుద్వారా వద్ద బహుళ అంచెల బారికేడ్లను దాటి ముందుకు వెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా 100 మందికి పైగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.సీపీఐ(ఎం), సీఐటీయూ, ఏఐకేఎస్‌, ఎఐఏడ‌బ్ల్యూ యూ, డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా, సంయుక్త కిసాన్‌ మోర్చా, సీపీఐ, ఏఐవైఎఫ్‌, ఎఐఎస్‌ఎఫ్‌, ఎఐఎస్ఎ, దిశ, కెవైఎస్‌, ఆర్‌డబ్ల్యూ పీఐ తదితర సంఘాల కార్యకర్తలు ప్రదర్శనలో పాల్గొన్నారు. ఢిల్లీతోపాటు హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ నుంచి రైతులు, కార్మికులు, విద్యార్థులు తరలివచ్చారు. ఎన్నికల కమిషన్‌ కార్యాలయం వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళనకారులు రోడ్డుపైనే బైటాయించి ‘పీపుల్స్‌ పార్లమెంట్‌’ నిర్వహించారు.

రోడ్డుపైనే పీపుల్స్‌ పార్లమెంట్‌

ఎన్నికల కమిషన్‌ కార్యాలయం వైపు సాగుతున్న మార్చ్‌ను పోలీసులు అడ్డుకోవడంతో నాయకులు, కార్యకర్తలు రోడ్డుపైనే ఆందోళ‌న‌ కొనసాగించారు. ఈ సందర్భంగా ‘పీపుల్స్‌ పార్లమెంట్‌’ను నిర్వహించి, సర్‌ ప్రక్రియను రద్దు చేయాలని, 2023 నాటి ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని సవరించాలని డిమాండ్‌ చేశారు. జ్ఞానేశ్‌ కుమార్‌ను కాపాడేందుకు ఎవరూ ముందుకు వచ్చినా తమ ఆందోళన ఆగదని, రానున్న రోజుల్లో నిరసనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్‌ కార్యాలయం సమీపంలో నిరసనకారులు అక్కడి నుంచి కదలడానికి నిరాకరించడంతో పోలీసులు విద్యార్థులు సహా పలువురిని బలవంతంగా ఈడ్చుకెళ్లి వ్యాన‌ల్లో కుక్కారు. ఓటుహక్కు పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని ఆందోళనకారులు స్పష్టం చేశారు. ​

ఈ ఆందోళ‌న‌లో సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకురాలు బృందాకారత్‌, సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు విజ్జూ కృష్ణన్‌, రాజ్యసభ సభ్యులు వి.శివదాసన్‌, ఐద్వా జాతీయ నాయ‌కురాలు ఎస్‌.పుణ్య‌వ‌తి, ఎఐకెఎస్ సభ ఆర్థిక కార్యదర్శి పి.కృష్ణ ప్రసాద్‌, డీవైఎఫ్‌ఐ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి అమన్‌ సైనీ, ఎస్‌ఎఫ్‌ఐ ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి సూరజ్‌ ఇళమన్‌, అధ్యక్షురాలు నాదియా, సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యురాలు అన్నీ రాజా, సీపీఐ ఎంపీ పి.సంతోష్‌ కుమార్‌, ఎఐఎస్‌ఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు విరాజ్‌ దేవాంక్‌, ఎఐఎస్ఏ నాయకురాలు అంజలి, కెవైఎస్‌ నాయకురాలు ముదిత, ఆర్థిక వేత్త‌లు సీపీ చంద్ర‌శేఖ‌ర్‌, జ‌య‌తీ ఘోష్, సామాజిక కార్యకర్తలు అంజలి భరద్వాజ్‌, యోగేంద్ర యాదవ్‌ తదితరులు నిరసనకు నాయకత్వం వహించారు.

18 రాష్ట్రాల్లో 88 నగరాల్లో ఆందోళ‌న‌

​ ‘పీపుల్‌ ఎగైనెస్ట్‌ ఎస్‌ఐఆర్‌’ వేదిక ఆధ్వ‌ర్యంలో 18 రాష్ట్రాల్లోని 88 నగరాల్లో 145 సంస్థల భాగస్వామ్యంతో నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. శుక్రవారం నుంచి నవంబరు 1వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. విస్తృత స్థాయిలో సాగుతున్న ఈ ప్రచారంలో 300కు పైగా సంస్థలు భాగస్వాములయ్యాయని నిర్వాహకులు తెలిపారు. సర్‌‌ను రద్దు చేయడం, ఓటర్ల జాబితా నుంచి తొలగించిన అర్హులైన పౌరుల ఓటుహక్కును పునరుద్ధరించడం, జ్ఞానేశ్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించి ఆయనపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం ఈ ఉద్యమ ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. ఎన్నికల జాబితాల సవరణ ప్రక్రియపై ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, రైతు సంఘాలు, పౌర సమాజ సంస్థలు చేపట్టిన విస్తృత ఆందోళనల్లో భాగంగా ఢిల్లీలో ఈ మార్చ్‌ జరిగింది.

జ్ఞానేశ్ కుమార్‌ను ఎవరూ కాపాడలేరు :సీపీఐ(ఎం) సీనియర్‌ ‌నేత బృందాకరత్‌

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను ఎవ‌రూ కాపాడ‌లేర‌ని ‌సీపీఐ(ఎం) సీనియ‌ర్ నేత బృందా క‌ర‌త్ అన్నారు. ‘‘ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు మా పోరాటం కొనసాగుతుంది’’ అని పేర్కొన్నారు. సర్‌ ద్వారా లక్షలాది ఓట్లు తొలగించారని, తరతరాలుగా భారత్‌లో నివసిస్తున్న ప్రజల పౌరసత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారన్నారు. ముఖ్యంగా ముస్లింలు, దళితులు, ఆదివాసీలు వంటి వర్గాల ప్రజలు ప్రభావితమవుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. సర్‌ పేరుతో ప్రజల గుర్తింపు, స్వయంప్రతిపత్తి దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. సర్‌పై ఉద్యమాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదన్నారు. జంతర్‌మంతర్‌ను నిరసన ప్రదర్శనలకు నిర్దేశిత ప్రాంతంగా తొలగించినంత మాత్రాన ప్రజా ఉద్యమాన్ని నిలువరించలేరని తెలిపారు.

ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం

​జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాల్సిందేనని, రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సీపీఐ(ఎం), సీపీఐ రాజ్యసభ సభ్యులు వి.శివ‌దాస‌న్‌, పి.సంతోష్‌ కుమార్‌ అన్నారు. అర్హులైన పౌరుల పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించబడే ప్రమాదంపై నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఓటుహక్కు ప్రజాస్వామ్యానికి ప్రాథమికమని ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి ఒకరు పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత ఉండాలని, అక్రమంగా తొలగించిన పేర్లకు బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. పోలీసు బారికేడ్లు తమ ఉద్యమాన్ని అడ్డుకోలేవని స్పష్టం చేశారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి యుధ్‌వీర్‌ సింగ్‌ మాట్లాడుతూ సర్‌ను వెనక్కి తీసుకోవాలని, జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దాలని, ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్