Magazines

డా. హోమీ జే. బాబా సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే

1 గంట క్రితం

Dr. Homi J. Baba
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – నాచారం

భారత అణు విజ్ఞాన రంగ పితామహుడు, పద్మభూషణ్ డాక్టర్ హోమీ జే. బాబా సేవలు చిరస్మరణీయమని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. బాబా 117వ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో శుక్రవారం డాక్టర్ ఈఎస్ రావు నగర్‌లోని హోమీ జే. బాబా ఫంక్షన్ హాల్ ఆవరణలో సంస్మరణ సభ నిర్వహించారు. స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు గొడుగు యాదగిరిరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎన్ఎఫ్‌సీ సీనియర్ నాయకులు ఉదయ భాస్కర్‌లు హోమీ జే. బాబా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారతదేశంలో అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకు వినియోగించేందుకు హోమీ జే. బాబా విశేష కృషి చేశారని, దేశ స్వావలంబన కోసం జీవితాంతం శ్రమించారని కొనియాడారు. అణుశక్తితో పాటు ఎలక్ట్రానిక్స్, భౌతిక శాస్త్ర రంగాల్లో అనేక పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు చేశారని తెలిపారు. ఆయన కృషి ఫలితంగా ఏర్పాటైన ఎన్ఎఫ్‌సీ, ఈసీఐఎల్ సంస్థలతో ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందన్నారు.


స్ఫూర్తి గ్రూప్ సీనియర్ నాయకులు శ్రీమన్నారాయణ మాట్లాడుతూ.. ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ దేశ అభివృద్ధి, సామాన్య ప్రజలకు విజ్ఞాన ఫలాలు అందించడమే లక్ష్యంగా హోమీ జే. బాబా పనిచేశారని పేర్కొన్నారు. అనంతరం ప్రముఖులు, పాఠశాల విద్యార్థులు హోమీ జే. బాబా విగ్రహానికి పూలు సమర్పించి నివాళులర్పించారు. అమర్ రహే హోమీ జే. బాబా అంటూ నినాదాలు చేశారు. స్ఫూర్తి గ్రూప్ నాయకులు జి. శివరామకృష్ణ వందన సమర్పణతో సభ ముగిసింది.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కొత్త రామారావు, కాసం మహిపాల్ రెడ్డి, చల్లా లీలావతి, శారద, శ్రావణ్ కుమార్, బాలు, ప్రభాకర్, వెంకటేశ్వరరావు, శ్రీమన్నారాయణ, పాషా, సత్యనారాయణ, సదాశివ హైస్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్