Magazines

సైడ్ డ్రైన్ ఉన్నా ప్రయోజనం సున్నా

7 నిమిషాల క్రితం

side drain
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 05, 2026 | 3 నిమిషాల చదవడం

- డ్రైన్ నిర్మాణంలో పాటించని నిబంధనలు

- రోడ్డుపైనే పారుతున్న వర్షపు వరద

- రూ.23.50 కోట్ల పనుల నాణ్యతపై అనుమానాలు 

నవతెలంగాణ - అశ్వారావుపేట

అశ్వారావుపేట పట్టణ సుందరీకరణ పేరుతో నిర్మించిన సైడ్ డ్రైన్లు, సెంట్రల్ లైటింగ్, డివైడర్లు మురసు తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు అసలు పనితీరును బయటపెట్టాయి. డ్రైన్లు నిర్మించినప్పటికీ వర్షపు నీరు వాటిలోకి వెళ్లకుండా రహదారులపైనే ప్రవహించడం నిర్మాణ ప్రణాళిక, ఇంజనీరింగ్ ప్రమాణాలు, నీటి ప్రవాహ మార్గాల అనుసంధానంపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది.

రోడ్లు మరియు భవనాల శాఖ ఆధ్వర్యంలో అశ్వారావుపేట పట్టణ పరిధిలో ఖమ్మం–దేవరపల్లి రహదారిపై కిలోమీటర్ 119/0 నుంచి 121/0 వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర సెంట్రల్ లైటింగ్, సీసీ డివైడర్లు, సీసీ డ్రైన్ల నిర్మాణం చేపట్టారు.

అదేవిధంగా అశ్వారావుపేట–బూర్గంపహాడ్ రహదారిపై 0/0 నుంచి 1/500 వరకు ఉన్న రహదారిని రెండు వరుసల నుంచి నాలుగు వరుసల రహదారిగా విస్తరించి పటిష్టపరిచే పనులు నిర్వహించారు. ఈ అభివృద్ధి పనులకు మొత్తం రూ.23.50 కోట్ల అంచనా వ్యయం చేసినట్లు సమాచారం. ఈ పనులను అక్టోబర్ 10న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు.

డివైడర్‌పై ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ అశ్వారావుపేట పట్టణానికి నూతన శోభను తీసుకొచ్చిందన్నది ఎంత వాస్తవమో, భారీ వర్షాల సమయంలో డ్రైనేజీ వ్యవస్థ ఆశించిన స్థాయిలో పనిచేయలేదన్నది కూడా అంతే వాస్తవమని మంగళ, బుధవారాల్లో సంభవించిన వరద పరిస్థితులు స్పష్టం చేశాయి. సైడ్ డ్రైన్లు పక్కనే ఉండగా వర్షపు వరద రోడ్డుపైనే ప్రవహించడం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది.


నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలు:

డ్రైన్ నిర్మాణ సమయంలో సమర్థవంతమైన ఇంజనీరింగ్ పర్యవేక్షణ కంటే కాంట్రాక్టర్ ప్రతినిధులదే పైచేయిగా ఉందన్న విమర్శలు అప్పట్లోనే వినిపించాయి. తాజాగా కురిసిన భారీ వర్షాలతో ఆ విమర్శలకు బలం చేకూరినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. “నీరు పల్లమెరుగు – నిజం నిలకడెరుగు” అన్న సామెతకు ప్రస్తుత పరిస్థితులు సాక్ష్యంగా నిలిచాయని వారు అంటున్నారు.

సైడ్ డ్రైన్లలోకి రహదారిపై చేరే వర్షపు నీరు సులభంగా వెళ్లేందుకు తగిన ఇన్‌లెట్లు, జాలీలు, నీటి ప్రవేశ మార్గాలు సమర్థవంతంగా ఏర్పాటు చేయకపోవడం ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. డ్రైన్లకు అక్కడక్కడా సరైన పరిమాణంలో నీటి ప్రవేశ రంధ్రాలు ఏర్పాటు చేసి, జాలీల ద్వారా రహదారిపై చేరే వర్షపు నీటిని డ్రైన్లలోకి మళ్లించేలా చర్యలు తీసుకుని ఉంటే రోడ్డుపై నీరు నిలిచే పరిస్థితి ఉండేది కాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.


అప్రోచ్ కాలువల అనుసంధానంలో లోపాలు?

డ్రైనేజీ వ్యవస్థ ప్రారంభం నుంచి చివరి వరకు సహజ నీటి ప్రవాహ మార్గాలకు సక్రమ అనుసంధానం లేకపోవడం కూడా ముంపు సమస్యకు కారణమవుతోందనే విమర్శలు వస్తున్నాయి. అప్రోచ్ కాలువలు, ప్రధాన డ్రైన్లు, వరద నీటి బయటకు వెళ్లే మార్గాల మధ్య సరైన సమన్వయం లేకపోతే ఎంత పెద్ద డ్రైన్లు నిర్మించినా ప్రయోజనం ఉండదని స్థానికులు పేర్కొంటున్నారు.

భారీ వర్షాల సమయంలో అశ్వారావుపేట పట్టణంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురికావడం, రహదారులపై వరద నీరు ప్రవహించడం వల్ల వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సమగ్ర పునరుద్ధరణ చేపట్టాలి:


- ప్రజాధనానికి జవాబుదారీతనం ఎక్కడ?

రూ.23.50 కోట్ల ప్రజాధనంతో చేపట్టిన పనులు భారీ వర్షానికి నిలబడలేకపోతే దానికి బాధ్యత ఎవరిది అన్న ప్రశ్నకు అధికారులు, ఇంజనీరింగ్ విభాగం, కాంట్రాక్టర్ సమాధానం చెప్పాల్సిందే. పనులు పూర్తయ్యాయా లేదా అన్నది ప్రారంభోత్సవాలతో తేలదు.. వాటి నాణ్యత, ఉపయోగకరత, ప్రజలకు అందుతున్న ప్రయోజనంతోనే తేలాలి. డ్రైన్లు నిర్మించినా నీరు రోడ్డుపైనే పారుతుంటే అది కేవలం ప్రకృతి వైపరీత్యం కాదు.. 

ప్రణాళికలోపమా? 

నిర్మాణ లోపమా? 

లేక పర్యవేక్షణ వైఫల్యమా? 

అన్న అంశాలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్టర్ పని చేసి వెళ్లిపోవడం, అధికారులు బిల్లులకు ఆమోదం తెలపడం వరకే బాధ్యత పరిమితం కాకూడదు. ప్రజాధనంతో నిర్మించిన ప్రతి నిర్మాణం నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో నిర్ధారించే బాధ్యత సంబంధిత ఇంజనీరింగ్ అధికారులదే. భారీ వర్షం ఒక సహజ పరీక్ష లాంటిది. ఆ పరీక్షలో డ్రైనేజీ వ్యవస్థ విఫలమైతే ప్రజలే ఎందుకు మూల్యం చెల్లించాలి? 


పనుల నాణ్యతపై స్వతంత్ర సాంకేతిక పరిశీలన నిర్వహించి, లోపాలు ఉన్నట్లయితే వాటిని కాంట్రాక్టర్‌తోనే సరిదిద్దించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పురపౌరులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజాధనం ఖర్చయిన తర్వాత ప్రశ్నించడం కాదు.. ఖర్చు చేసిన ప్రతి

రూపాయికి ఫలితం ఉందా లేదా అనేది ప్రభుత్వం, అధికారులు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది.

కేవలం సుందరీకరణకే పరిమితం కాకుండా పట్టణ భౌగోళిక పరిస్థితులు, సహజ నీటి ప్రవాహ మార్గాలు, భవిష్యత్‌లో సంభవించే భారీ వర్షాలను పరిగణనలోకి తీసుకుని డ్రైనేజీ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని పురపౌరులు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న డ్రైన్లను పునరుద్ధరించి, అవసరమైన చోట అదనపు వరద డ్రైన్లు నిర్మించి, రహదారులపై చేరే వర్షపు నీరు వెంటనే డ్రైన్లలోకి వెళ్లేలా శాస్త్రీయ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


రూ.23.50 కోట్ల ప్రజాధనంతో చేపట్టిన అభివృద్ధి పనులు కేవలం రాత్రివేళ వెలుగులు నింపడానికే కాకుండా, భారీ వర్షాల సమయంలో పట్టణ ప్రజలను ముంపు నుంచి రక్షించేలా కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని పురపౌరులు స్పష్టం చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్