Magazines

లింబాద్రిగుట్ట గెస్ట్‌హౌస్‌కు భూమి పూజ 

21 నిమిషాల క్రితం

Guesthouse
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 20, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - భీంగల్ 

జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. శుక్రవారం లింబాద్రిగుట్ట స్వామి వారిని మంత్రి సీతక్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్‌గౌడ్‌ దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ ప్రాంగణంలో రూ. 4 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన అతిథి గృహం (గెస్ట్ హౌస్) పనులకు వారు స్థానిక నాయకులతో కలిసి భూమిపూజ చేశారు.


ఈ సందర్భంగా మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. కొండలు, అడవుల మధ్య కొలువైన లింబాద్రి స్వామిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ ఆలయ అభివృద్దికి పంచాయతీరాజ్ శాఖ నుంచి రూ. 4 కోట్ల నిధులను గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం మంజూరు చేశామని తెలిపారు. రాబోయే రోజుల్లో మహేష్ కుమార్ గౌడ్ సహకారంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మరిన్ని నిధులు తీసుకొచ్చి సంక్షేమం, అభివృద్ధిని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.


అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. లింబాద్రి గుట్ట వెనుక ఉన్న రహత్ నగర్ నా స్వగ్రామమని తెలిపారు. గత 58 ఏళ్లుగా నేను ఈ స్వామివారిని దర్శించుకుంటూ వస్తున్నాననీ, ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఒక మంచి గెస్ట్ హౌస్ నిర్మించాలనే ఆలోచన ఉండేదని చెప్పారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగానే, ఆయన మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు తో మాట్లాడి వెంటనే రూ. 4 కోట్లు మంజూరు చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్, ఈరవత్రి అనిల్, మోహన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, మండల, పట్టణ అధ్యక్షులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్