Magazines

నీళ్లున్నా తడవని పొలాలు.. కరెంటు కోతలతో రైతుల గోస!

1 గంట క్రితం

Fields that are not wet even with water.. Farmers are upset with power cuts!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 2 నిమిషాల చదవడం

- కాళేశ్వరం జలాలున్నా సాగునీటికి ఇబ్బందులే..

- చెక్కపల్లి రోడ్డు సబ్‌స్టేషన్‌ వద్ద బీఆర్ఎస్‌ నిరసన

- రైతుల సమస్యలపై ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ స్పందించాలి: చల్మెడ

నవతెలంగాణ - వేములవాడ

కాళేశ్వరం జలాలు అందుబాటులో ఉన్నా సాగునీరు అందక, విద్యుత్‌ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్‌ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు విమర్శించారు. పంటలు చేతికొచ్చే దశలో నిరంతర విద్యుత్‌ సరఫరా చేయకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం వేములవాడలోని చెక్కపల్లి రోడ్డు సబ్‌స్టేషన్‌ వద్ద బీఆర్ఎస్‌ నాయకులు నిరసన తెలిపారు.


రుద్రంగి, కోనరావుపేట తదితర మండలాల్లో పొలాల్లో నీరు ఉన్నప్పటికీ మోటార్లు నడిపేందుకు సరిపడా విద్యుత్‌ సరఫరా కావడం లేదని చల్మెడ అన్నారు. ఉదయం నాలుగైదు గంటలు కేటాయిస్తున్న విద్యుత్‌లోనూ కోతలు విధిస్తుండటంతో పంటలకు నీరందించడం కష్టమవుతోందని పేర్కొన్నారు. సన్నరకం వరి పంటలు పక్వానికి వస్తున్న సమయంలో విద్యుత్‌ అంతరాయాలు రైతులకు నష్టం కలిగిస్తాయని తెలిపారు.


కాళేశ్వరం జలాలను వినియోగించాలి

కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని సమర్థంగా వినియోగించి చెరువులు, కుంటలు నింపి ఉంటే సాగునీటి సమస్యలు తగ్గేవని చల్మెడ అన్నారు. జూలై 5న కన్నెపల్లి పంప్‌హౌస్‌ వద్ద కేటీఆర్‌ చేసిన సూచనలను ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు నిల్వలు, సరఫరాపై ముందస్తు ప్రణాళిక ఎందుకు రూపొందించలేదని ప్రశ్నించారు. కిందిస్థాయి అధికారులపై చర్యలు తీసుకోవడం కాకుండా విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలోని లోపాలను సరిదిద్దాలని డిమాండ్‌ చేశారు.

గత బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్‌గఢ్‌ నుంచి యూనిట్‌కు రూ.3.90 చొప్పున విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చేసుకున్నామని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్‌ కొనుగోళ్లు, సరఫరాపై వాస్తవ గణాంకాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు.


ఎమ్మెల్యే స్పందించాలి

వేములవాడ నియోజకవర్గంలో రైతులు విద్యుత్‌ కోతలతో ఇబ్బందులు పడుతున్నా స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ ఎందుకు స్పందించడం లేదని చల్మెడ ప్రశ్నించారు. ఎమ్మెల్యే సొంత గ్రామమైన రుద్రంగిలోనూ రైతులు విద్యుత్‌ సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

పంటలు దెబ్బతింటే రైతులతో పాటు వ్యవసాయ కూలీలు, వినియోగదారులపైనా ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బోనస్‌లు ప్రకటించడం కంటే ముందుగా పంటలు పండించేందుకు అవసరమైన సాగునీరు, నాణ్యమైన విద్యుత్‌ అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్