ఒకప్పుడు బొగ్గుతో రైళ్లను నడిపేవారు. వాటి స్థానంలో డీజిల్ వచ్చింది. క్రమంగా అదీ తగ్గిపోయింది. ఇప్పుడు పూర్తిగా విద్యుత్ ద్వారానే ట్రైన్స్ నడుస్తున్నాయి. ప్రస్తుతం రైల్ నెట్‌వర్క్‌లో 99 శాతం మేర విద్యుదీకరణ జరిగింది. దీని వల్ల కాలుష్యం తగ్గినప్పటికీ పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చవుతోంది. అలాగే ఎక్కువ మొత్తంలో విద్యుదుత్పత్తి చేయాల్సి వస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఖర్చు తగ్గించుకోవడం కోసం భారతీయ రైల్వే సరికొత్త ఆలోచన చేసింది. హైడ్రోజన్, ఎల్ఎన్జీతో నడిచే రైళ్లను ప్రారంభించింది. ఇవే భవిష్యత్తు రైళ్ల ఇంధనంగా ఉంటాయని చెబుతోంది.
జులై 17న ఉత్తర రైల్వేలోని జింద్- సోనిపట్ మార్గంలో హైడ్రోజన్ రైలు ప్రారంభమైంది. ఇందులో పది కోచ్‌లు ఉన్నాయి. విద్యుత్‌ను రైలులోనే ఉత్పత్తి చేసుకోవడం ఈ ట్రైన్ ప్రత్యేకత. ఇందులో ఉండే ఫ్యూయల్ సెల్స్ విద్యుత్‌ను తయారుచేస్తాయి. సెల్‌లోని హైడ్రోజన్, గాలిలో ఉండే ఆక్సిజన్‌తో రసాయనిక చర్య జరపడం ద్వారా కరెంటు ఉత్పత్తవుతుంది. హైడ్రోజన్ రైలుకు రెండు డ్రైవింగ్ పవర్ కార్లు ఉంటాయి. ఉత్పత్తి అయ్యే కరెంటు బ్యాటరీ ద్వారా ట్రాక్షన్ మోటార్లకు చేరి రైలు చక్రాలను తిప్పుతుంది. ఈ ట్రైన్‌ను మొదట వాడిన దేశం జర్మనీ. ఇది గంటకు 75 కిలోమీటర్ల స్పీడ్‌తో ప్రయాణిస్తుంది. శుద్ధ ఇంధన పరిజ్ఞానంతో నడిచే ఈ రైలులో ధ్వని కూడా తక్కువే.
హైడ్రోజన్ రైలులో నాన్‌స్టాప్ వెంటిలేషన్ వ్యవస్థ ఉంటుంది. ఇది ఎప్పటికప్పుడు గాలి బయటకు వెళ్లేలా చూస్తుంది. అనుకోకుండా ఏదైనా లీకేజీ తలెత్తినా అది గాల్లోకి వెళ్లి, పలుచబడిపోతుంది. ప్రమాదాన్ని గుర్తిస్తే, ఆటోమేటిక్ షట్ఆఫ్ వ్యవస్థ తనంతట తాను హైడ్రోజన్ సప్లైను ఆపేస్తుంది. ఇక ఈ ట్రైన్లో బహుళ అంచెల భద్రతా వ్యవస్థలున్నాయి. అవి హైడ్రోజన్ లీకేజీలు, వేడి, మంటలు, పొగ వంటి ముప్పులపై ఎప్పటికప్పుడు కన్నేసి ఉంచుతాయి. ఏదైనా ప్రాబ్లమ్ ఉత్పన్నమైతే సెకన్లలోనే అలర్ట్ చేస్తాయి. సేఫ్టీకి ప్రాధాన్యమిస్తూ ఇందులో లోకోపైలట్ క్యాబిన్‌ను స్పెషల్‌గా డిజైన్ చేశారు. లోకో పైలట్ ఎదుట ఉండే ఒక స్క్రీన్, ఎప్పటికప్పుడు అన్ని అంశాలను తెలియజేస్తుంది.
గుజరాత్‌లోని సబర్మతి నుంచి ఈ ఏడాది సెప్టెంబరు 27న డీజిల్‌తో పాటు ఎల్ఎన్జీతో(లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) నడిచే రైలు ప్రారంభమైంది. 1,400 హార్స్పవర్ సామర్థ్యం ఉన్న రెండు పవర్ కార్లను మార్పులు చేసి డీజిల్, ఎల్ఎన్జీతో నడిచేలా చేశారు. ఇది పూర్తిగా ఎల్ఎన్జీతో నడవదు. కాకపోతే డీజిల్‌పై ఆధారపడటం తగ్గుతుంది. డీజిల్ వినియోగంలో 40 శాతం వరకు ఎల్ఎన్జీతో భర్తీ చేస్తారు. రెండు పవర్ కార్లు, 8 బోగీల ఎల్ఎన్జీ రైలుతో ఏడాదికి రూ.23.90 లక్షల ఇంధన వ్యయం ఆదా కావచ్చన్నది రైల్వేశాఖ అంచనా. అయితే ఇది పూర్తిగా పొగరహిత రైలు కాదని గుర్తుంచుకోవాలి. డీజిల్ రైళ్లు ప్రస్తుత అవసరాలకు ఉపయోగపడుతున్నా ఇంధన వినియోగంతో కాలుష్య ఉద్గారాలు ఉంటాయి. ఖరీదైన డీజిల్ ఇంజిన్లను నిరుపయోగం చేయాల్సిన అవసరం లేకుండానే ఎల్ఎన్జీ ద్వారా ఉపయోగించుకోవచ్చు.





కామెంట్లు (0)