Magazines

అప్పుడు ఓటర్లు పెరిగారు..ఇప్పుడు తగ్గిపోయారు

1 గంట క్రితం

voters
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 3 నిమిషాల చదవడం

ఓటు హక్కు నిరూపించుకునే భారం ప్రజలపైనే
పేదలు, కూలీలు, గ్రామీణులకు పత్రాల సమర్పణ కష్టాలు

దేశ చరిత్రలో తొలిసారి ఓటర్ల సంఖ్యను తగ్గించిన 'సర్‌'
గత ఎనిమిది సమగ్ర సవరణల్లో పెరిగిన ఓటర్ల సంఖ్య
తాజా సర్‌లో 13.39 కోట్ల మంది పేర్లపై అనర్హత అనుమానాలు


ఓటర్ల జాబితాలను ప్రక్షాళన చేయడం పేరుతో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) దేశ ఎన్నికల చరిత్రలోనే భిన్నమైన పరిస్థితికి దారితీసింది. గతంలో ఎనిమిదిసార్లు నిర్వహించిన సమగ్ర సవరణల్లో ఓటర్ల సంఖ్య పెరగ్గా.. తాజా ప్రక్రియలో మాత్రం తగ్గిపోయింది. కోట్లాది మంది పేర్లను వివిధ కారణాలతో పక్కనపెట్టడం, అర్హతను నిరూపించుకునే బాధ్యతను ఓటర్లపైనే మోపడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా పేదలు, రోజువారీ కూలీలు, గ్రామీణ ప్రజలు అవసరమైన పత్రాలు సమర్పించలేక ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం నెలకొంది.


న్యూఢిల్లీ: దేశంలో ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ చరిత్రలో తొలిసారిగా ఓటర్ల సంఖ్య తగ్గిపోయింది. 1952 నుంచి ఇప్పటివరకు ఎనిమిదిసార్లు చేపట్టిన సవరణల్లో ప్రతిసారీ తొలగించిన వారి కంటే కొత్తగా చేరిన ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. 1952-56, 1958-61, 1965-66, 1983-84, 1987-88, 1993, 1995, 2002-04 మధ్య నిర్వహించిన సవరణల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. కానీ 2025-26లో చేపట్టిన తాజా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)లో మాత్రం ఓటర్ల సంఖ్య క్షీణించింది.

13.39 కోట్ల మంది పేర్లపై అనుమానాలు

తాజా సర్‌లో ఎన్నికల సంఘం మొత్తం 95.40 కోట్ల మంది ఓటర్ల వివరాలను పరిశీలించింది. వీరిలో 13.39 కోట్ల మందిని వివిధ కారణాలతో ముసాయిదా జాబితాల్లో ప్రత్యేక విభాగాల కింద చేర్చింది. వీరిలో ఆచూకీ లేనివారు 3.01 కోట్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు 6.30 కోట్లు, మరణించినవారు 2.80 కోట్లు, రెండుసార్లు నమోదైనవారు 1.02కోట్లు, ఇతర కారణాల తో 26లక్షల మంది ఉన్నారు. ఇవి ముసాయి దా జాబితాలకు సంబంధించిన గణాంకాలు మాత్రమే. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది వివరాలు వెలువడనున్నాయి. ఇప్పటికే సవర ణ ముగిసిన ప్రాంతాల్లోనూ జాబితాల్లో మిగిలి పోయిన అర్హుల పేర్లను చేర్చేందుకు ప్రత్యేక నమోదు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

ఓటర్లపైనే అర్హత నిరూపణ భారం

ఓటర్ల సంఖ్య తగ్గడానికి జననాల రేటు తగ్గడం కొంతవరకు కారణమైనప్పటికీ, ప్రధాన కారణం ఎన్నికల సంఘం అనుసరిస్తున్న విధానమేనని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఓపీ రావత్‌ అభిప్రాయపడ్డారు. గతంలో బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి, ఓటర్ల జాబితాల్లో మార్పులు చేసేవారని తెలిపారు. ఇప్పుడు మాత్రం 2002 లేదా 2003 నాటి ఓటర్ల జాబితాలతో తమ వివరాలను సరిపోల్చుకోలేని వారు పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు నిర్దేశించిన 11 పత్రాల్లో ఒకదాన్ని సమర్పించాల్సి వస్తోందన్నారు. ఈ విధానం పేదలు, వ్యవసాయ కూలీలు, రోజువారీ కార్మికులు, గ్రామీణ ప్రజలకు ఇబ్బందికరంగా మారిందని రావత్‌ వివరించారు. పాత జాబితాలతో వివరాలను సరిపోల్చుకోవడానికి తగిన సహాయం కూడా అందలేదన్నారు. బీఎల్‌ఓలకు తప్పుడు సమాచారం ఇస్తే ఏడాది వరకు జైలు శిక్ష పడవచ్చన్న హెచ్చరికలు ప్రజల్లో భయాన్ని పెంచాయని తెలిపారు. అర్హులైన అనేకమంది ఓటర్ల పేర్లు జాబితాల్లో లేకుండా పోయే పరిస్థితి ఏర్పడటంతోనే ఎన్నికల సంఘం ప్రత్యేక నమోదు కార్యక్రమాలు చేపట్టిందని అభిప్రాయపడ్డారు.

రాజ్యాంగం కల్పించిన అధికారం

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324, ప్రజాప్రాతినిధ్య చట్టం-1950 ప్రకారం ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితాల పర్యవేక్షణకు ఎన్నికల సంఘానికి అధికారం ఉంది. ఓటర్ల నమోదు నిబంధనలు-1960లోని రూల్‌ 25 ప్రకారం సమగ్ర సవరణ, సంక్షిప్త సవరణ లేదా ఈ రెండింటినీ కలిపి చేపట్టవచ్చు. సమగ్ర సవరణలో ఇంటింటికీ వెళ్లి వివరాలను పరిశీలిస్తారు. సంక్షిప్త సవరణలో ఇంటింటి తనిఖీ లేకుండా జాబితాను సమీక్షించి ముసాయిదాను విడుదల చేస్తారు. ముసాయిదా విడుదలైన తరువాత అభ్యంతరాలు, కొత్త దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ మాత్రం ఒకే విధంగా ఉంటుంది. కాగా అన్ని ప్రాంతాల్లో ప్రక్రియ పూర్తయి తుది గణాంకాలు వెలువడిన తర్వాతే ఓటర్ల సంఖ్యలో వచ్చిన మార్పులపై పూర్తి స్పష్టత రానుంది.


పాత జాబితాల్లోనూ తప్పులు

2002-03లో చేపట్టిన సవరణలో అధికారులు పాత ఓటర్ల జాబితాలతో ఇంటింటికీ వెళ్లి వివరాలను పరిశీలించేవారు. ఉన్న ఓటర్ల సమాచారాన్ని సరిచేయడంతోపాటు కొత్తగా అర్హత పొందినవారి వివరాలను నమోదు చేసేవారు. ఈ ప్రక్రియను మొదట 20 రాష్ట్రాల్లో, ఆ తరువాత మరో ఏడు రాష్ట్రాల్లో నిర్వహించారు. ఇరవై ఏండ్ల తరువాత ఇప్పుడు భారీ స్థాయిలో ఓటర్ల జాబితాలను ప్రక్షాళన చేస్తున్నారు. గతంలో మరణాలు, వలసల వివరాలు సకాలంలో నమోదు కాకపోవడంతో జాబితాల్లో తప్పులు పేరుకుపోయాయని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ టీఎస్‌ కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. అయితే అధికారులు ఇంటింటికీ వెళ్లి పరిశీలించకపోతే అర్హులైన ఓటర్ల పేర్లు కూడా పొరపాటున తొలగిపోయే ప్రమాదం ఉందన్నారు. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేశారనే ఆరోపణలకు బలమైన ఆధారాలు అవసరమని స్పష్టం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్