కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌కు ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్ ప్రదర్శన
భారీ జాతీయ జెండా ఎగురవేత పోలీసుల నిర్బంధంలో సీజేపీ నేతలు అభిజీత్ దీప్కే, నేహాబోరా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మోడీ సర్కార్ విధించిన ఆంక్షలను దాటుకుంటూ దేశరాజధాని ఢిల్లీలో శుక్రవారం చేపట్టిన లెహ్రా దో తిరంగా మార్చ్ విజయవంతమైంది. ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఫిరోజ్‌షా రోడ్డు నుంచి ప్రారంభమైన మార్చ్‌లో విద్యార్థులు, యువత జాతీయ జెండాలు చేబూని నినాదాల హోరెత్తించారు. భారీ జాతీయ జెండాను ప్రదర్శిస్తూ మార్చ్ ముందుకు సాగింది. ఈ క్రమంలో కేంద్రం భారీగా పోలీసు బలగాలను మోహరించి, భయానకరమైన వాతావరణాన్ని సృష్టించింది. కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్కుకు ‘తిరంగా‘ర్యాలీ’ చేరుకోకుండా ఉండేందుకు అధికార యంత్రాంగం అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. చివరికి సెంట్రల్ పార్కును సైతం మూసివేసింది. వీటన్నింటినీ అధిగమించి మార్చ్ శాంతియుతంగా కన్నాట్ ప్లేస్ ఇన్నర్ సర్కిల్ వద్దకు చేరుకుంది. అక్కడ జాతీయ జెండాను ఎగురవేసి, జాతీయ గీతం ఆలపించడతో ఈ కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నేతలు మాట్లాడుతూ ‘‘మేము అనుకున్నది సాధించాం. వేలాది మంది పోలీసు సిబ్బంది ఉన్నప్పటికీ, వారు మమ్మల్ని కన్నాట్ ప్లేస్‌లోకి ప్రవేశించకుండా అడ్డుకోలేకపోయారు’’ అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) ఎంపీలు జాన్ బ్రిట్టాస్, వి.శివదాసన్, ఎఎ రహీం, సీపీఐ ఎంపీ సంతోష్ కుమార్, ఎస్ఎఫ్ఐ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆదర్శ్ ఎం.సాజి, సృజన్ భట్టాచార్య, ఎస్ఎఫ్ఐ సహాయ కార్యదర్శి ఐషీఘోష్, డీవైఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి హిమాఘ్నరాజ్ భట్టాచార్య, డీవైఎఫ్ఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు జైక్ సి.థామస్, ఎఐవైఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రౌషన్ కుమార్ సిన్హా, సుఖ్జిందర్ మహేశ్వరి, ఎఐఎస్ఎఫ్ అధ్యక్షుడు విరాజ్ దేవాంగ్ తదితరులు పాల్గొన్నారు. ‘‘సెంట్రల్ పార్క్‌లో నిషేధాజ్ఞలను ధిక్కరిస్తూ, వామపక్ష సంఘాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు, యువ కార్యకర్తలు సెంట్రల్ పార్క్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇది మాది- ఎవరి ప్రయివేట్ ఆస్తి కాదు. మేము జాతీయ గీతం ఆలపించి, జాతీయ జెండాను సగర్వంగా ఎగురవేశాం. ఏది ఏమైనప్పటికీ, మేము మళ్ళీ ఇక్కడికి వస్తాం’’ అని జాన్ బ్రిట్టాస్ అన్నారు. కన్నాట్ ప్లేస్ ఇన్నర్ సర్కిల్లో కెవైఎస్, దిశా, పిఎస్ఎ, కలెక్టివ్ వంటి సంఘాలు కూడా మార్చ్ నిర్వహించాయి. తిరంగా మార్ఛ్ నేపథ్యంలో 6 వేల మంది పోలీసులు, 220 సీఎపీఎఫ్ కంపెనీలు మోహరించాయి. కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌కు వెళ్లే రహదారిని పోలీసు వాహనాలతో మూసివేశారు.
సీజేపీ నేత అభిజీత్ దీప్కే నిర్బంధం
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) జాతీయ కన్వీనర్ అభిజిత్ దీప్కేను ఢిల్లీ పోలీసులు ‘లెహ్రా దో తిరంగా’ మార్చ్‌కు ముందే అదుపులోకి తీసుకున్నారు. 20 మందికిపైగా పోలీసు సిబ్బంది, ఎన్సీపీ అధికార ప్రతినిధి అనీష్ గవాండే నివాసానికి వెళ్లి అభిజీత్ దీప్కే మార్చ్‌లో పాల్గొనవద్దని నోటీసు ఇచ్చారు. ర్యాలీకి వెళ్తే అరెస్టు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆయన ఇంటి సమీపంలో పోలీసులు ఆంక్షలు అమలు చేశారు. అయితే సాయంత్రం అభిజీత్ దీప్కే ఎన్సీపీ అధికార ప్రతినిధి అనీష్ గవాండే నివాసం నుంచి బయటకు రాగానే, ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను రహస్య ప్రదేశానికి తీసుకెళ్లారని సీజేపీ విమర్శించింది. అతనితో తమకు సంబంధాలు తెగిపోయాయని, న్యాయవాదులతో కూడా మాట్లాడనివ్వడం లేదని పేర్కొంది. అభిజీత్ దీప్కే అరెస్టును పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తీవ్రంగా ఖండించారు. అభిజీత్ దీప్కే, నేహాబోరాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మండిహౌస్ నుండి కన్నాట్ ప్లేస్‌కు ఎఐఎస్ఎ మార్చ్
ఎఐఎస్ఎ ఆధ్వర్యంలో జన్‌పథ్ రోడ్డులో మండిహౌస్ నుండి కన్నాట్ ప్లేస్‌కు మార్చ్ నిర్వహించారు. త్రివర్ణ పతాకాలు చేబూని ప్రదర్శన ప్రారంభించారు. ప్రదర్శన ముందుకు సాగగానే పోలీసులు నిరసనకారులను చుట్టుముట్టారు. మండిహౌస్ సర్కిల్లో ఎఐఎస్ఎ అఖిల భారత అధ్యక్షురాలు నేహా బోరాతో పాటు ఇతర నిరసన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులు నేహాబోరాను లక్ష్యంగా చేసుకుని అదుపులోకి తీసుకున్నారని, ఆమె వద్ద ఫోన్ కూడా లేదని ఎఐఎస్ఎ పేర్కొంది. ఆమె ఆచూకీని వెంటనే చెప్పాలని ఎఐఎస్ఎ డిమాండ్ చేసింది. నేహాను నిర్బంధించిన వ్యాన్‌లో సాధారణ దుస్తులతో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఉన్నారని, ఢిల్లీ పోలీసులు తమ పరిధికి వెలుపల ఉన్న వ్యక్తులను నియమించుకున్నారా? అని ప్రశ్నించింది. నేహా సురక్షితంగా ఉందా? అని ప్రశ్నించింది. చివరికి రాత్రి 8 గంటలకు నేహా బోరాను మంగళాపురిలో మాదకద్రవ్యాల నిరోధక టాస్క్‌ఫోర్స్ వద్ద ఒంటరిగా నిర్బంధించారని తెలిసింది. ఆమెతో ఎలాంటి కమ్యూనికేషన్ లేదని, ఆమెను వెంటనే విడుదల చేయాలని ఎఐఎస్ఎ డిమాండ్ చేసింది. నేహా ఎక్కడుంది? న్యాయవాదులను కవడానికి కూడా అనుమతించకుండా, నల్లటి అద్దాలున్న కారులో ఎందుకు హడావుడిగా తీసుకుకెళ్లారు? ‘ నేహా అక్రమ అపహరణను ఆపండి.. ఆమెను వెంటనే విడుదల చేయండి’అంటూ ఎఐఎస్ఎ డిమాండ్ చేసింది.
రాష్ట్రపతి భవన్ సమీపంలో ఆప్ తిరంగా మార్చ్
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాష్ట్రపతి భవన్ సమీపంలోని నార్త్ అవెన్యూలో తిరంగా మార్చ్ నిర్వహించింది. ఢిల్లీ ఆప్ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్ నేతృత్వంలో జరిగిన ఈ యాత్రలో పోలీసుల పహారా నడుమ పార్టీ కార్యకర్తలు జాతీయ జెండాను పట్టుకుని ముందుకు సాగారు. పౌరులు జాతీయ జెండాను ఎక్కడ ఎగురవేయాలో ప్రభుత్వం, పోలీసులు నిర్దేశించలేరని భరద్వాజ్ అన్నారు. మరోవైపు ఆప్ సెంట్రల్ ఢిల్లీలోని తమ పార్టీ ప్రధాన కార్యాలయం నుండి కన్నాట్ ప్లేస్‌కు తిరంగా మార్చ్ నిర్వహించారు. వారిని మార్గమధ్యలోనే భద్రతా దళాలు అడ్డుకున్నాయి.
నిరసనలు ప్రజాస్వామ్య హక్కులే... కానీ అరాచకం కాదు : అభిజీత్ దీప్కే
శాంతియుత నిరసనలు ప్రజాస్వామ్య హక్కులేనని, అరాచకం కాదని సీజేపీ జాతీయ కన్వీనర్ అభిజీత్ దీప్కే అన్నారు. ప్రభుత్వం నుంచి సమాధానాలు కోరడం, వీధుల్లో అన్యాయానికి వ్యతిరేకంగా నిరసన తెలపడం, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని ప్రశ్నించడం అరాచకత్వానికి ఉదాహరణలు కావని తెలిపారు. ఇవి ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రాథమిక వ్యక్తీకరణలని పేర్కొన్నారు. ‘‘జైపూర్‌లో నాపై దాడి జరిగింది. అయినప్పటికీ నేను ప్రతీకారం తీర్చుకోకూడదని నిర్ణయించు కున్నా. హింసకు హింసతో ప్రతిస్పందించడం అనేది మనం విశ్వసించే ప్రతిదానికీ విరుద్ధం. శారీరక బలాన్ని ప్రయోగించడం కంటే, బి.ఆర్ అంబేద్కర్ నాయకత్వంలో రూపొందించిన రాజ్యాంగం మాకు హామీ ఇచ్చిన హక్కులను వినియోగించుకోవడానికే మేము ప్రాధాన్యత ఇస్తాం’’ అని అన్నారు. ‘‘మేము మౌనంగా ఉండటానికి నిరాకరిస్తున్నామనే కారణంతో మమ్మల్ని అరాచకవాదులుగా చిత్రీకరించడానికి నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజు అధికారంలో ఉన్న పార్టీయే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దశాబ్దాల పాటు నిరసనలు నిర్వహిస్తూ వీధుల్లోకి వచ్చి నాటి ప్రభుత్వాలను ప్రశ్నించింది. ఒకవేళ అవే ఆంక్షలు, బెదిరింపులు, పోలీసు అణచివేతలు వారిపై ప్రయోగించి ఉంటే, ఈ రోజు అధికార పదవుల్లో ఉన్నవారిలో చాలామంది బహుశా ఈ స్థాయికి చేరుకొని ఉండేవారు కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరసనలను ఒక ప్రజాస్వామ్య హక్కుగా కీర్తించి, అధికారంలోకి వచ్చాక అదే చర్యను ప్రజాశాంతికి ముప్పుగా పరిగణించడం తీవ్రమైన కపటత్వం’’ అని అన్నారు.
ముంబయిలో ‘‘లెహ్రా దో తిరంగా’’ మార్చ్
ముంబయిలోని ఆజాద్ మైదాన్‌లో సీజేపీ ఆధ్వర్యంలో ‘లెహ్రా దో తిరంగా’ మార్చ్ జరిగింది. ఈ మార్చ్‌లో సామాజిక కార్యకర్త అంజలి దమానియా మాట్లాడుతూ దేశ రాజధానిలోని నిరసనకారుల పట్ల ఢిల్లీ పోలీసులు క్రూరంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఎంఎన్ఎస్ నేత సందీప్ దేశ్‌పాండే మాట్లాడుతూ ద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిరుద్యోగం వంటి తీవ్రమైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు .






కామెంట్లు (0)