ప్రజలున్నాక రాజ్యమూ, రాజ్యమున్నాక రాజులూ, రాజులున్నాక అధికారమూ, అధికారమున్నాక దుర్వినియోగమూ వుంటాయి కదా!
అర్థరాత్రి ఇళ్లల్లోకి జొరబడే దొంగ నక్కినక్కి నడిచినట్టు, చంద్రుడు మబ్బుల చాటున కనిపించీ కనిపించకుండా కదుల్తున్నాడు. అర్థరాత్రి దాకా చేయరాని పనులు చేసి, కూయరాని కూతలు కూసి అలసిపోయిన రాజావారు మంచం మీద ఇలా కునుకు మొదలుపెట్టాడో లేదో గది తలుపు పటాలు మని, ఫటేలు మని, దడదడమని చప్పుడు చేసింది. ఉలిక్కిపడ్డ రాజు తలుపుతీశాడు. గది ముందు నిలుచున్నాడు కొత్వాలు. ‘క్షమించండి బాస్! తప్పనిసరై తలుపు బాదాను. ఒక్క సారి బాల్కనీలోకి వచ్చి చూడండి’ అంటూ రాజావారిని బాల్కనీలోకి తీసుకువచ్చాడు కొత్వాలు.
రాజావారు బాల్కనీలో నిలబడి చూస్తే మహల్లో వెలుగుతున్న లైట్ల కింద వందలాది చెట్లు, వేలాది కొమ్మల్ని మోసుకుంటూ గుంపులు గుంపులుగా నిలబడ్డయి. అర్థరాత్రి ఈ చెట్ల న్యూసెన్స్ ఏమిటి అంటూ విసుక్కున్నాడు రాజు.
చెట్లన్నిటికీ ముందు నిలబడున్న సీనియర్ మర్రిచెట్టు, ఊడల్ని గాలిలో చేతుల్లా ఊపుతూ ముందుకు వచ్చి ‘క్షమించాలి మహాప్రభూ! అర్థరాత్రి తప్ప తమరు చిక్కడు దొరకడు అని ఇప్పుడొచ్చాం. మనుషులకు తిండానికి తిండినీ, పీల్చడానికి గాలినీ, నిలబడ్డానికి నీడనూ ఇచ్చే చెట్లమే తప్పని పరిస్థితుల్లో ఇలా నడిచొచ్చాం’ అన్న మర్రి మాటలు వింటూ రాజు ముందుకు దృష్టి సారించాడు. రకరకాల చెట్లు.. గుబురుగా వున్నవి, పొడుగ్గా విన్నవి, పేర్లు తెలిసినవి, తెలీనివి ఎన్నో వున్నాయి.
‘మేం చెప్పేది కాస్త వినండి ప్రభూ’ అంది బాల్కనీలోకి వంగి ఓ కొబ్బరి చెట్టు.
‘ఏంటి మీరు చెప్పేది? మీకు హామీలు, గ్యారంటీలు ఏమీ ఇవ్వలేదే’ అన్నాడు రాజు చిరాగ్గా.
‘మేం ఓట్లు వేసేవాళ్లం కాదనే కదా’ అంది మామిడి చెట్టు కోపంగా.
‘నువ్వుండు నేను మాట్లాడతా కదా’ అంటూ మర్రిచెట్టు దాన్ని ఊరుకోమని, ‘ప్రభూ! పట్నంలో ఓ కొత్త రహదారి నిర్మించడానికి మా వృక్షజాతిని నరికి ముక్కలు చేయబోతున్నారని విని వచ్చాం. మమ్మల్ని నాశనం చేసి హంతక మహారాజుగా మారవద్దని మనవి. రాళ్లు కొడితే పళ్లు ఇచ్చే మేము, తిరుగుబాటు చెయ్యలేం. మీ గొడ్డళ్లనీ, రంపాలనీ ఎదుర్కోలేం. మమ్మల్ని బతికించుకోవడం అంటే మిమ్మలి, మీ రాబోయే తరాలని బతికించుకోవడమే. అందువల్ల సరైన నిర్ణయం తీసుకుంటారని మా ప్రాణాలతో చెలగాటం ఆడరని నమ్ముతూ వెళ్తున్నాం!’ అంటూ వెనక్కి తిరిగింది మర్రి. దాని వెనుక చింత, మామిడి, జామ, కొబ్బరి మరెన్నో రకాల చెట్లు వెళ్లిపోయాయి.
రాజు కొత్వాలు వైపు చూస్తూ ‘వందల చెట్లు నరికితే ఏంటిట? ఒక్కో చెట్టుకూ, ఆరో ఏడో కొత్త మొక్కలు నాటుతాం కదా’ అన్నాడు.
‘అవి పెరిగి పెద్దయ్యే లోపున మేకలు మేసేస్తయి’ అంటూ రాజు ముందుకు వచ్చి గోడ మీద నిలుచుంది ఆకుపచ్చ కోటు వేసుకున్న ఎర్రముక్కు రామచిలక. వెనుక కొంగలు, కాకులు, ఉడుతలు, పిట్టలు గోలగోలగా అరుస్తూ బంగళా చుట్టూ తిరగసాగాయి. కాకుల కావుకావులకు రాజావారికి చెవులు చిల్లులు పడతాయేమోనని భయం వేసింది.
‘ఆపండ్రా! మీ కాకి గోల’ అని ఓ సీనియర్ కాకి అరవడంతో పక్షులు చప్పుడు చేయడం మానాయి.
‘మహాప్రభూ! ఇంతకు ముందు తమరిముందు తమ గోడు చెప్పుకున్న చెట్లే మా అందరికీ ఇళ్లు. తమరేదో రహదారి కట్టడానికి చెట్లన్నింటినీ నరికేస్తామన్నారట. వందలాది చెట్లల్లో వేలాదిగా పిల్లాపాపల్తో బతుకుతున్న మా పక్షుల ఉసురు పోసుకోవద్దు. మాకు నిలువ నీడ లేకుండా చేయొద్దు. మహారాజా! చెట్లే లేకుండా చేస్తే రేపు మనుషులు తమ పూర్వీకుల కోసం పెట్టే పిండాలు తినడానికి ఒక్క కాకి కూడా వుండదు సుమా. అందువల్ల చెట్లని బతకనివ్వండి, మా గూళ్లల్లో మమ్మల్ని వుండనివ్వండి. సరైన నిర్ణయం తీసుకుంటారని వృక్షాల, పక్షుల ప్రాణాలతో చెలగాటం ఆడరని నమ్ముతూ వెళ్తున్నాం’ అంటూ వెనక్కి తిరిగింది కాకి. దాని వెనుక చిలకలూ, పావురాలూ, కొంగలూ మరెన్నో పక్షులూ వెళ్లిపోయాయి.
పక్షుల్ని, చెట్లనీ తిట్టుకుంటూ నేను మోనార్కుని, నన్నెవరూ ఏమీ చెయ్యలేరు అనుకుంటూ వెనుదిరగబోయిన రాజావారికి చెవులు వాచిపోయేలా ఏడ్పులు, పెడబొబ్బలు వినపడ్డాయి. ఎవరా అని చూస్తే మనుషులు... చిరిగిన చొక్కాలు, మాసిన తలలు.
‘మారాజా! మా కొంపలు కూల్చకండి, మా గుడిసెలు కాల్చకండి. రెక్కాడితే కాని డొక్కాడని వాళ్లం. శ్రమనూ చెమటనూ నమ్ముకున్నవాళ్లం. మిద్దెలూ, మేడలూ లేవు. మావి రేకుల కప్పులు, గోనెసంచుల గోడలు. మాకు ఉండడానికి ఆ చోటు కూడా లేకుండా చెయ్యకండి. మమ్మల్ని దిక్కులేని వాళ్లను చెయ్యకండి మారాజా!’ అని కేకలు అరుపులు వినలేక ఉలిక్కిపడి మంచంలో లేచి కూచున్నాడు రాజు. చెట్లు నడచి రావడం, పక్షులు గోల చెయ్యడం, మనుషులు అరచి గీ పెట్టడం అంతా కలేనన్నమాట అనుకున్నాడు.
మంత్రితో సమావేశమైన రాజు అడిగాడు... రహదారి నిర్మాణం గురించి.
‘వందలాది చెట్లు నరికేయించాం. పెంకుటిళ్లు, పూరి గుడిసెలు కనపడకుండా చేయించాం. కానీ..’
‘కానీ ఏమిటి చెప్పండి! నేను మోనార్కుని, నన్నెవరూ ఏమీ చేయలేరు’ అన్నాడు రాజు.
మంత్రి.. ‘రాజావారూ! తవ్వకాలు మొదలుపెట్టాక తెలిసింది, దారిలో మీ అల్లుడి ఇల్లు, వారి తోడల్లుడి ఇల్లు, మీ వేలు విడిచిన మేమమామ బంగ్లా, రాజగురువుగారి బావమరిది ప్యాలెసూ వున్నాయని. వాటిని పడగొట్టాల్సి వస్తుందని ఇంజనీర్లు అంటున్నారు’ అన్నాడు.
క్షణం కూడా ఆలోచించలేదు రాజావారు. ‘వద్దు.. వద్దు.. అక్కడ రహదారి వద్దేవద్దు. అసలుకే ఎసరొస్తుంది. కొంప కొల్లేరవుతుంది. ఈ పట్నాన్ని ఏలే రాజుని కదా. పట్నంలో భూమంతా మనదే కదా. మరోచోటులో తవ్వకం మొదలెట్టండి. ముందు చెట్లు నరకండి. గుడిసెలు కూల్చండి. అక్కడయినా మనవాళ్ల భూములూ, బంగళాలు అడ్డురాకుండా చూసుకోండి’ అన్నాడు రాజు.
‘రాజు తల్చుకుంటే నరకడాలూ, కూల్చడాలూ ఓ లెక్కా! తమరెవరు? తమరు మోనార్కులు. అనగా సర్వం స్వాహా చక్రవర్తులు’ అన్నాడు మంత్రి.
చింతపట్ల సుదర్శన్, 9299809212







కామెంట్లు (0)