Magazines

అక్షరాల అవతల

1 గంట క్రితం

Beyond letters
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం



అక్షరం ఒక ప్రవేశద్వారం మాత్రమే -

ఆ ద్వారం దాటి సాగని దృష్టికి

గ్రంథాలయాలన్నీ మూసిన చీకటి గదులే!

లిపి పరిచయం ఉన్న వేళ్లు

సత్యమనుకుని దగా ముద్రలకూ సంతకాలు చేస్తాయి;

వినడం మాత్రమే తెలిసిన చెవులు

హాలాహలపు హోరునూ వేదఘోషగా భ్రమిస్తాయి!

సమాచారం -

అమృతంలా కురిసే మేఘం కాదు,

కళ్ల చూపులపై కమ్ముకునే మాయమబ్బు;

దాహార్తిని తీర్చే జలధిలోనే

మృగతృష్ణల విషాన్ని కలిపే కాలమిది!

వార్తను కేవలం వాచ్యంగా చదవడం కాదు -

దాని వెనక పడే నిశ్శబ్ద ఛాయలనూ ప్రశ్నించాలి;

వాక్యానికి దాసోహమవడం కాదు -

దాని అంతరంగంలో దాగిన స్వార్థ స్వరాన్ని ఛేదించాలి!

డిజిటల్ వెలుగుల మాయాజాలంలో

విచక్షణా భాస్కరుడు అస్తమిస్తే -

కోటి దివ్వెల అక్షరాలు వెలిగినా

మానవత్వం చీకటిలోనే మిగిలిపోతుంది!

పుస్తకాల పేజీలను తిరగేసిన కళ్లతో

తోటి మనిషి కంటిపాపలోని కన్నీటిని చదవలేకపోతే,

చరిత్ర పుటలను శోధించిన మేధస్సుతో

సమాజపు అన్యాయాల మూలాలను గుర్తించలేకపోతే -

ఆ విద్య నిశీధిలో దిశలేని అక్షర శవమే!

అక్షరజ్ఞానం అంటే కాగితాలపై నడిచే కంటిచూపు కాదు;

అధికార గర్వాన్ని నిలదీసే సాహసం,

అసత్యపు ముసుగును చీల్చే వివేచన,

భిన్న స్వరాన్ని గౌరవించే విశాల హృదయం!

పుటలలోని అక్షరాలను వల్లించేవాడు

విద్యావంతుడే కావచ్చు...

కానీ, సమాజపు గాయం నుంచి

ప్రవహించే అశ్రువును చదివి

దానికి మందు వేసేవాడే నిజమైన చైతన్యమూర్తి!

- యం.డి. ఉస్మాన్ ఖాన్


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్