Magazines

హైదరాబాద్‌లో కార్ల తయారీ ప్లాంట్ పెట్టండి

58 నిమిషాల క్రితం

car manufacturing
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 3 నిమిషాల చదవడం

హ్యుందాయ్ యాజమాన్యానికి సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు

జహీరాబాద్‌లో రూ.8,528 కోట్లతో గ్లోబల్ ఆర్‌అండ్‌డీ కేంద్రం

త్వరలోనే భూమిపూజకు సిద్ధం
పెండింగ్ అనుమతులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం

రాష్ట్రంలో తయారీ రంగానికి అన్ని విధాలా సహకరిస్తామంటూ హామీ


న‌వ‌తెలంగాణ బ్యూరో - హైద‌రాబాద్
తెలంగాణను కార్ల తయారీకి అనువైన ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో హ్యుందాయ్ కార్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఆ సంస్థ యాజమాన్యాన్ని ఆయ‌న కోరారు. రాష్ట్రంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. జహీరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న హ్యుందాయ్ గ్లోబల్ ఆర్‌అండ్‌డీ కేంద్రానికి సంబంధించిన పెండింగ్ అనుమతులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైద‌రాబాద్‌లోని మ‌ర్రి చెన్నారెడ్డి మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి కేంద్రంలోని బోధి పెవిలియన్‌లో హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ మేనేజింగ్ డైరెక్టర్ చాంగ్యాన్ చో నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, జహీరాబాద్‌లో ప్రతిపాదిత ప్రాజెక్టు పురోగతిపై చర్చించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మ్యానుఫాక్చరింగ్ జోన్ (నిమ్జ్‌)లో రూ.8,528 కోట్ల పెట్టుబడితో హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ ఆర్‌అండ్‌డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. 678 ఎకరాల్లో విడతలవారీగా అభివృద్ధి చేయనున్న ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 4,276 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ప్రాజెక్టు పురోగతిని హ్యుందాయ్ ప్రతినిధులు ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. రాబోయే కొద్ది నెలల్లోనే ఆర్‌ అండ్‌ డీ కేంద్రం నిర్మాణానికి భూమిపూజ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి... అవసరమైన అనుమతుల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణ భౌగోళికంగా దేశం మధ్యలో ఉందని, హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కలిగిన నగరమని సీఎం తెలిపారు. దేశంలోని ఆరు ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలతో పోలిస్తే హైదరాబాద్ సురక్షితమైన, జీవించడానికి అనుకూలమైన కాస్మోపాలిటన్ నగరంగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. కార్ల తయారీ పరిశ్రమకు అవసరమైన రవాణా, మౌలిక సదుపాయాలు తెలంగాణలో అందుబాటులో ఉన్నాయని వివరించారు. రహదారులు, రైలు మార్గాలు, విమానాశ్రయాలతోపాటు భవిష్యత్తులో ఓడరేవులకు హైస్పీడ్ కనెక్టివిటీ కల్పించే ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. ప్రత్యేక మొబిలిటీ క్లస్టర్ల అభివృద్ధితో వాహన తయారీ రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు. పెరి-అర్బన్ రీజియన్ (ప్యూర్‌) వంటి ప్రణాళికల ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక విస్తరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, తయారీ రంగంలో పెట్టుబడులకు తెలంగాణ అనువైన వేదికగా నిలుస్తుందని సీఎం వివరించారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో నిర్వ‌హించిన 2024 ప్రపంచ ఆర్థిక వేదిక (డ‌బ్ల్యూఈఎఫ్‌) సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం హ్యుందాయ్ ప్రతినిధులతో చర్చలు జరిపింది. అనంతరం 2025 జూన్‌లో ఆ సంస్థ ఆర్‌అండ్‌డీ కేంద్రం ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది.

ప్రపంచ స్థాయి సౌకర్యాలతో భారీ శాటిలైట్ నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సీఎం హ్యుందాయ్ ప్రతినిధి బృందానికి వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను తెలియజేస్తూ, రాబోయే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026కు హాజరుకావాలని సంస్థ యాజమాన్యాన్ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను అంతర్జాతీయ సాంకేతిక, అధునాతన ఇంజినీరింగ్ కేంద్రంగా మరింత బలోపేతం చేయాలన్న హ్యుందాయ్ లక్ష్యం తెలంగాణ రైజింగ్–2047 విజన్‌కు అనుగుణంగా ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ చాంగ్యాన్ చో తెలిపారు. తెలంగాణ అభివృద్ధి ప్రస్థానంలో తమ సంస్థ భాగస్వామిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు, ఎక్స్‌-ఆఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ కె. రామకృష్ణారావు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా హ్యుందాయ్ సంస్థకు హైదరాబాద్‌తో రెండు దశాబ్దాల అనుబంధం ఉంది. హైటెక్ సిటీలోని కేంద్రం అధునాతన వాహన ఇంజినీరింగ్‌కు మద్దతునిస్తూ కీలక ఆర్‌అండ్‌డీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ సామర్థ్యాలను మరింత విస్తరించేలా జహీరాబాద్‌లో గ్లోబల్ ఆర్‌అండ్‌డీ, మెగా టెస్టింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రం ద్వారా వాహనాల రూపకల్పన, పరీక్షలు, పనితీరు, ధ్రువీకరణ, నాణ్యతా ప్రమాణాల పరిశీలనతోపాటు ఇంజినీరింగ్ ప్రక్రియలను మరింత మెరుగుపరిచేందుకు అవకాశం కలగనుంది. హ్యుందాయ్ అధునాతన సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్