Magazines

'గోడీ మీడియా'పై ప్రజాగ్రహం!

1 గంట క్రితం

Godi Media
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 3 నిమిషాల చదవడం

మోడీ పాలనలో ప్రశ్నించే మీడియాకు పోలీసు దెబ్బలు

ప్రభుత్వ అనుకూల ఛానళ్లకు మాత్రం రక్షణ

పాలకుల ప్రచారానికి వేదికలుగా ప్రధాన మీడియా సంస్థలు

స్వతంత్ర డిజిటల్‌ వేదికలకు పెరుగుతున్న ఆదరణ

సామాజిక మాధ్యమాల్లో బీజేపీ ప్రచారానికి ఎదురుదెబ్బ


న్యూఢిల్లీ: ప్రజల పక్షాన మాట్లాడి, అధికార పక్షాన్ని ప్రశ్నించాల్సిన మీడియా.. పాలకుల భజనలో మునిగితే ప్రజలు ఎలా స్పందిస్తారు? ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపాల్సిన వార్తా సంస్థలే అధికార పార్టీకి ప్రచార వేదికలుగా మారితే ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుందా? దేశంలో ఇప్పుడు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన మీడియా సంస్థలపై ప్రభుత్వ అనుకూల శక్తుల ప్రభావం పెరిగిందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించే జర్నలిస్టులు, నిరసనకారు లపై పోలీసు చర్యలు కొనసాగుతుండగా.. ప్రభుత్వా నికి అనుకూలంగా వ్యవహరిస్తున్న మీడియాపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. ఒకప్పుడు ప్రధాన మీడియా ద్వారా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసిన మోడీ, బీజేపీకి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో స్వతంత్ర జర్నలిస్టులు, డిజిటల్‌ వార్తా వేదికల నుంచి గట్టి సవాలు ఎదురవుతోంది.

ప్రశ్నిస్తే పోలీసు చర్యలు.. నిలదీస్తే ప్రజాగ్రహం

ఇటీవల ఢిల్లీలో ఎన్నికల అక్రమాలను నిరసిస్తూ జరిగిన ఆందోళనల సందర్భంగా నిరసనకారులతో పాటు వార్తల సేకరణకు వెళ్లిన పలువురు జర్నలిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరు జర్నలిస్టులపై దాడులు జరిగినట్టు కూడా వార్తలు వెలువడ్డాయి. అయితే, ప్రభుత్వ అనుకూల మీడియా ప్రతినిధులు ఇలాంటి చర్యలకు గురైన సందర్భాలు లేకపోవడం పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కుతో పాటు, ఆ నిరసనలను స్వేచ్ఛగా చిత్రీకరించి ప్రజలకు తెలియజేసే హక్కు కూడా కీలకమే. కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్న బీజేపీ ప్రభుత్వం.. ప్రజలకు వాస్తవాలను అందించాల్సిన మీడియా స్వేచ్ఛకు విలువ ఇవ్వడం లేదు. ఇటు ప్రభుత్వ అనుకూల ఛానళ్ల ప్రతినిధులను నిరసనకారులు నిలదీస్తున్నారు. జులైలో విద్యార్థుల ఆందోళనల సమయంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ప్రభుత్వ అనుకూల టీవీ ఛానళ్లకు చెందిన సీనియర్‌ జర్నలిస్టులు తమ సంస్థల పేర్లు కనిపించే మైకులు లేకుండానే వార్తలు సేకరించాల్సి వచ్చింది. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతకు ఇది నిదర్శనంగా విశ్లేషకులు చెప్తున్నారు.

'గోడీ మీడియా'కు గట్టి సవాలు

అయితే, మోడీ ప్రభుత్వం అనుకూల మీడియా ద్వారా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయాలన్న వ్యూహానికి ఇంటర్నెట్‌ సేవలు గండి కొట్టాయి. యూట్యూబ్‌ ఛానళ్లు, స్వతంత్ర జర్నలిస్టులు, చిన్న డిజిటల్‌ వార్తా సంస్థలు ప్రజలకు ప్రత్యామ్నాయ సమాచారాన్ని అందించడం మొదలుపెట్టాయి. ప్రధాన ఛానళ్లు పట్టించుకోని సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజల ఇబ్బందులు ఈ వేదికల ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వార్తలు, విశ్లేషణలకు ప్రజల నుంచి ఆదరణ పెరుగుతోంది. ప్రధాన మీడియాపై నమ్మకం తగ్గిన కొందరు వీక్షకులు స్వతంత్ర డిజిటల్‌ వేదికల వైపు మళ్లుతున్నారు. దీంతో గోడీ మీడియా ప్రతినిధులను ప్రజలు జర్నలిస్టులుగా కాకుండా ప్రభుత్వ ప్రచారకర్తలుగా చూస్తున్న పరిస్థితి ఏర్పడుతోంది. నిరసనకారులపై పోలీసు చర్యలు జరుగుతున్న సమయంలోనూ ప్రభుత్వ అనుకూల మీడియా అధికార పక్షానికి వంతపాడుతోందన్న భావన ప్రజాగ్రహాన్ని మరింత పెంచుతోంది.

ప్రజాభిప్రాయంపై పట్టు కోల్పోతున్న మోడీ?

సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌ వంటి వేదికలను నిషేధించి, దేశీయ వేదికలను ప్రోత్సహించాలన్న డిమాండ్లు కూడా కొన్ని ప్రభుత్వ అనుకూల వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. అయితే, అంతర్జాతీయ సామాజిక మాధ్యమాలకు దీటుగా పనిచేసే దేశీయ వేదికలు అందుబాటులో లేకపోవడం, వాటిపై ఆధారపడుతున్న కోట్లాది మంది వినియోగదారుల నేపథ్యంలో అలాంటి చర్యలు తీసుకోవడం అంత సులభం కాదు. మొత్తంగా, ప్రధాన మీడియా ద్వారా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయగలిగిన మోడీ ప్రభుత్వానికి ఇప్పుడు స్వతంత్ర మీడియా, డిజిటల్‌ వేదికల నుంచి సవాళ్లు పెరుగుతున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.


సామాజిక మాధ్యమాల్లో బీజేపీకి ఎదురుగాలి

గోడీ మీడియా ప్రతినిధులను నిరసనకారులు నిలదీస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. దీంతో ప్రధాన మీడియా సంస్థల ద్వారా రాజకీయ ప్రత్యర్థుల కంటే ఎక్కువ ప్రచార ప్రయోజనం పొందిన బీజేపీకి ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు. సామాజిక మాధ్యమాల్లో ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడం, ప్రభుత్వ వాదనలను ప్రశ్నించడం మోడీ ప్రచార వ్యూహానికి సవాలుగా మారింది. విద్యార్థుల ఆందోళనల సమయంలో మోడీ స్వయంగా సెల్ఫీ వీడియోల ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించడం, మంత్రులు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో చురుగ్గా ఉండాలని సూచించడం ఈ మార్పులకు సంకేతంగా రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.


2014 తర్వాత మారిన మీడియా స్వరూపం

2011 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై మీడియా తీవ్ర విమర్శలు చేసింది. అవినీతి ఆరోపణలు, ప్రభుత్వంలోని విభేదాలు, మధ్యతరగతి ప్రజల నిరసనలు ప్రధాన వార్తలుగా నిలిచాయి. అప్పటి పరిణామాలు మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి చెంది మోడీ అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి ప్రభుత్వంపై మీడియా విమర్శలు తగ్గించేందుకు, అధికార పార్టీకి అనుకూలంగా వార్తా వాతావరణాన్ని మార్చేందుకు బీజేపీ తీవ్రంగానే పని చేసింది. మోడీకి సన్నిహితులుగా భావించే సంపన్న వ్యాపారవేత్తల చేతుల్లో ప్రధాన మీడియా సంస్థల యాజమాన్యాలు కేంద్రీకృతమయ్యాయి. ప్రభుత్వాన్ని విమర్శించే మీడియా సంస్థల యజమానులపై ఒత్తిళ్లు పెరిగాయి. కొన్ని సందర్భాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థల చర్యలు కూడా మీడియా యాజమాన్యాలపై ఒత్తిడి పెంచేందుకు ఉపయోగపడ్డాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఫలితంగా ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు సంధించాల్సిన కొన్ని ప్రధాన మీడియా సంస్థలు అధికార పార్టీ వాదనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయన్న అభిప్రాయం ప్రజల్లో బలపడింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్