- సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి దయానంద్
- ద్వారకాపురిలో ఇందిరమ్మ గృహప్రవేశం చేయించిన ఎమ్మెల్యే
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ద్వారకాపురి రోడ్డు నెంబరు-6 లో బూరుగు లలిత నిర్మించుకున్న ఇందిరమ్మ గృహాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గురువారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే స్వయంగా పాలు పొంగించారు. గృహప్రవేశం జరిగిన సందర్భంగా ఇందిరమ్మ గృహ లబ్ధిదారు బూరుగు లత దంపతులను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి దయానంద్ మాట్లాడుతూ... ఎన్నో ఏళ్లుగా వేయి కనులతో ఎదురుచూస్తున్న ఇండ్లు లేని పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో నిరుపేదలకు ఆశ చూపించి మోసం చేశారని ఆమె విమర్శించారు. ఆచరణలో ఎక్కడో అక్కడ మాత్రమే నాసిరకంగా ఇండ్లు నిర్మించారని, అవి మౌలిక వసతులు లేక నిరుపయోగంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు, డ్రైనేజీలు, రోడ్లు వంటి కనీస సదుపాయాలు లేకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర అవస్థలు పడ్డారన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో సత్తుపల్లి నియోజకవర్గంలో కనీసం వెయ్యి ఇండ్లు కూడా నిర్మించలేకపోయారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా గృహాలు నిర్మించి ఇస్తున్నామని తెలిపారు.
నియోజకవర్గంలో ప్రతిఏటా 3,500 ఇండ్ల చొప్పున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అవుతున్నాయని ఆమె వెల్లడించారు. మొత్తంగా రానున్న కాలంలో సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 20వేల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించడమే లక్ష్యమని చెప్పారు.
పేదల సొంతింటి కలను నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఈ సందర్భంగా ఆమె పునరుద్ఘాటించారు.
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె చెన్నకేశవరావు, నాయకులు చల్లగుళ్ల నరసింహారావు, మొహమ్మద్ కమల్ పాషా, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి దామెర రమేష్, తన్నీరు జమలయ్య పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)