- ఈ నెల 25న ఇందిరాపార్క్ ధర్నాను విజయవంతం చేయండి
- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ పిలుపు
నవతెలంగాణ - అశ్వారావుపేట
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన జీవో నంబర్ 6 ప్రకారం అన్ని రంగాల్లోని యాజమాన్యాలు కనీస వేతనాలను అమలు చేయాలని, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ పిలుపునిచ్చారు. బుధవారం అశ్వారావుపేటలోని స్థానిక హమాలీ అడ్డా వద్ద ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యల పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని ఆరోపించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మిక సంక్షేమం విషయంలో బీజేపీ విధానాలనే అనుసరిస్తోందని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాలు అశాస్త్రీయంగా ఉన్నాయని, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వాటిని పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. కార్మికుల జీవన ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని కనీస వేతనాన్ని రూ.42 వేలకు పెంచాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం నిర్వహించే ధర్నాలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు మురహరి, రఘు, రమేష్, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)