- మూడు రోజుల శిక్షణలో పాల్గొన్న ఇద్దరు మహిళా సర్పంచులు
- అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి ఇద్దరికి అవకాశం
నవతెలంగాణ - అశ్వారావుపేట
మహిళా ప్రజాప్రతినిధుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతోపాటు, గ్రామ పాలన, రాజ్యాంగబద్ధ బాధ్యతలు, పారదర్శక పాలనపై అవగాహన కల్పించే లక్ష్యంతో నిర్వహించిన మూడు రోజుల మహిళా సర్పంచుల శిక్షణా కార్యక్రమం శనివారంతో ముగిసింది. ఈ నెల 22 నుంచి 24 వరకు హైదరాబాద్లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ) ఆధ్వర్యంలో ఈ శిక్షణ నిర్వహించారు.
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి ఒకరు లేదా ఇద్దరు మహిళా సర్పంచులను ఎంపిక చేయగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి ఇద్దరికి అవకాశం లభించింది. అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామ సర్పంచ్ మడకం కుమారి, దమ్మపేట మండల కేంద్రం సర్పంచ్ పగడాల రమాదేవి శిక్షణకు హాజరయ్యారు. శిక్షణలో భాగంగా సమాచార హక్కు చట్టం, గ్రామసభల నిర్వహణ, పంచాయతీరాజ్ వ్యవస్థలో మహిళల పాత్ర, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన, ఆర్థిక నిర్వహణ, ప్రభుత్వ పథకాల అమలు, గ్రామీణ సమస్యల పరిష్కారం తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
మహిళా సర్పంచులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించేలా నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి సారించారు. ఈ శిక్షణ ద్వారా గ్రామాభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంతోపాటు, గ్రామసభల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించి పారదర్శక పాలన అందించేందుకు మహిళా సర్పంచులకు అవసరమైన అవగాహన లభించనుంది.






కామెంట్లు (0)