- సిండికేట్‌గా మారిన రైస్ మిల్లర్లు.. బియ్యం ధరలకు రెక్కలు
నవతెలంగాణ – కోటగిరి: రైతు రాజు అంటూ గొప్పలు చెప్పుకునే రాజకీయ పార్టీలు రైతుల సమస్యలపై స్పందించడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో పంట దిగుబడులు తగ్గిన నేపథ్యంలో, పండిన ధాన్యానికి తొలిసారిగా ఆశించిన దానికంటే ఎక్కువ ధర లభించడంతో కొందరు వ్యాపారులు అసహనం వ్యక్తం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్వింటాల్ ధాన్యానికి రూ.3,700 అంతకంటే ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేసిన వ్యాపారులను అడ్డుకునేందుకు కొందరు సిండికేట్‌గా ఏర్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యే వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి సైతం లారీలను అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
తాజాగా రైస్ మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి, బయట ప్రాంతాల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు వచ్చే వ్యాపారులతో ఒప్పందాలు చేసుకుంటూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారనే సమాచారం ఉంది. దీంతో బయటి కొనుగోలుదారులు రావడం తగ్గిపోయి, స్థానిక మిల్లుల యాజమాన్యాలు నిర్ణయించిన ధరలకే ధాన్యం విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. తమ కమిషన్ల కోసం ధరలు తగ్గించి రైతుల శ్రమను దోచుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కృత్రిమ కొరతతో.. కొండెక్కిన బియ్యం ధరలు
ధాన్యం ధరలు పెరిగాయనే సాకుతో రైస్ మిల్లర్లు బియ్యం ధరలను భారీగా పెంచుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. క్వింటాల్ బియ్యాన్ని రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు విక్రయిస్తూ సామాన్య ప్రజలపై భారం మోపుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సీజన్‌లో క్వింటాల్ ధాన్యాన్ని రూ.2,200కు కొనుగోలు చేసిన వ్యాపారులు, ప్రస్తుతం ధరలు పెరిగాయనే పేరుతో కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు బియ్యం విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు మౌనం వహించడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధరతోపాటు వినియోగదారులకు అందుబాటు ధరలో బియ్యం లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






కామెంట్‌లు (0)