- నారంవారిగూడెం - గుర్రాలచెర్వు బీటీ రోడ్డు, కేసప్పగూడెంలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రణాళిక
నవతెలంగాణ - అశ్వారావుపేట
అశ్వారావుపేట మండలంలో వరదలు, భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు ఎఫ్‌డీఆర్ నిధులతో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నారంవారిగూడెం నుంచి గుర్రాలచెర్వు వరకు బీటీ రహదారి అభివృద్ధి పనులకు రూ.70 లక్షలతో ప్రతిపాదనలు రూపొందించారు.
ఈ పనుల్లో ఆర్‌సీసీ స్లాబ్ కల్వర్టు నిర్మాణానికి రూ.35 లక్షలు, రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.15 లక్షలు, వెట్‌మిక్స్‌తో బీటీ రోడ్డు పనులకు రూ.20 లక్షలు కేటాయించాలని ప్రతిపాదించారు. మొత్తం రూ.70 లక్షల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నారు.
అదేవిధంగా అశ్వారావుపేట మండలం కేసప్పగూడెంలోని డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమీపంలో 80 మీటర్ల పొడవున రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.80 లక్షల అంచనా వ్యయంతో మరో ప్రతిపాదన సిద్ధం చేశారు.
ఈ రెండు పనులకు కలిపి మొత్తం రూ.1.50 కోట్ల విలువైన ఎఫ్‌డీఆర్ ప్రతిపాదనలు రూపొందించారు. ప్రతిపాదనలకు ఆమోదం లభించి పనులు చేపడితే వర్షాకాలంలో రహదారి దెబ్బతినడం, నీటి ప్రవాహంతో ఏర్పడే ప్రమాదాలను నివారించడంతో పాటు ఆయా ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా, రక్షణ సదుపాయాలు అందనున్నాయి.






కామెంట్‌లు (0)