Magazines

ఉపాధ్యాయుల కొరత.. 

1 గంట క్రితం

Teacher shortage..
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 2 నిమిషాల చదవడం

- అయినా విద్యార్థుల భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్ధ

  • దురదపాడు పాఠశాలలో 95 మంది విద్యార్థులు

  • డ్రాప్అవుట్లను తిరిగి బడికి రప్పించేందుకు ఉపాధ్యాయుల కృషి

  • రాత్రి వేళల్లోనూ ప్రత్యేక తరగతులు

నవతెలంగాణ – అశ్వారావుపేట

ఉపాధ్యాయుల కొరత.. విద్యార్థుల హాజరులో వెనుకబాటు.. వెరసి గిరిజన గ్రామాల్లోని పిల్లల చదువులకు ఆటంకంగా మారుతున్నాయి. అయినప్పటికీ విద్యార్థులను బడికి రప్పించి, వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న ప్రయత్నాలు ఆశాజనకంగా నిలుస్తున్నాయి. అశ్వారావుపేట మండలంలోని దురదపాడు మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల పరిస్థితి ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది.

Teacher shortage..

95 మంది విద్యార్థులు.. ముగ్గురే బోధన సిబ్బంది

దురదపాడు, రాళ్లవాగు, పాలగుంపు, దిబ్బిగూడెం ఆవాసాలకు చెందిన పిల్లలు ఈ పాఠశాలలో చదువుతున్నారు. ప్రీప్రైమరీ నుంచి ఏడో తరగతి వరకు మొత్తం 95 మంది విద్యార్థులు నమోదయ్యారు. అయితే పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడితో పాటు కనీసం ఐదుగురు ఉపాధ్యాయులు ఉండాల్సి ఉండగా, రెగ్యులర్ ఉపాధ్యాయులు లేకపోవడం గమనార్హం. 2008 డీఎస్సీకి చెందిన ఓ మహిళా ఉపాధ్యాయురాలు 2024 లో కాంట్రాక్టు పద్ధతిలో నియమితులై హెచ్ఎంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఎంఈఓ ప్రసాదరావు ఇద్దరు ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై నియమించారు. దీంతో బోధన సిబ్బంది కొరత స్పష్టంగా కనిపిస్తోంది.

హాజరుపై ప్రభావం

పాఠశాలలో 95 మంది విద్యార్థులు నమోదై ఉన్నప్పటికీ, రోజువారీ హాజరు 60 మందికి అటూఇటుగా ఉంటోంది. గిరిజన ఆవాసాలు కావడం, తల్లిదండ్రుల్లో అక్షరాస్యత తక్కువగా ఉండటం, పిల్లల చదువుపై తగినంత పర్యవేక్షణ లేకపోవడం ఇందుకు కారణాలై ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

Teacher shortage..

ఇంటింటికీ వెళ్లి.. రాత్రి వేళల్లోనూ బోధన

డిప్యుటేషన్‌పై వచ్చిన ఉపాధ్యాయుడు కచ్చర్ల శ్రీనివాస్ బడిమానేసిన పిల్లలను తిరిగి పాఠశాలకు రప్పించేందుకు ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులకు విద్య ప్రాధాన్యతను వివరిస్తున్నారు. పిల్లల చదువుపై అవగాహన కల్పిస్తూ బడికి పంపించాలని కోరుతున్నారు. స్థానిక విద్యా వాలంటీర్ సృజన, ప్రీప్రైమరీ టీచర్ సీత, ఆయా అనిత సహకారంతో విద్యార్థులకు రెమిడియల్ టీచింగ్‌తోపాటు రాత్రి వేళల్లో ట్యూషన్లు నిర్వహిస్తున్నట్లు శ్రీనివాస్ తెలిపారు.

పూర్తిస్థాయి ఉపాధ్యాయుల నియామకం అవసరం

విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతోపాటు డ్రాప్అవుట్ల సంఖ్యను తగ్గించేందుకు ఉపాధ్యాయుల కృషి కొనసాగుతోంది. అయితే 95 మంది విద్యార్థులున్న పాఠశాలలో బోధన సజావుగా సాగాలంటే పూర్తిస్థాయి ఉపాధ్యాయులను నియమించాల్సిన అవసరం ఉంది. సంబంధిత విద్యాశాఖ అధికారులు స్పందించి సిబ్బంది కొరతను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్