- ఆదివాసుల హక్కులను కాలరాయొద్దు
- టీఏజీఎస్ రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రదం చేయాలి
- అశ్వారావుపేటలో వాల్ పోస్టర్ల ఆవిష్కరణ
నవతెలంగాణ - అశ్వారావుపేట:
తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం (టీఏజీఎస్) రాష్ట్ర నాలుగో మహాసభలు ఈ నెల 27 నుంచి 29 వరకు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నిర్వహించనున్నట్లు సంఘం నాయకులు తెలిపారు. ఈ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ అశ్వారావుపేట మండలంలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సాగులో ఉన్న పోడు భూములకు హక్కు పత్రాలు మంజూరు చేయాలని, అటవీ హక్కుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసులను అడవుల నుంచి వెళ్లగొట్టే విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలని కోరారు. జీవో నంబర్ 3ను పునరుద్ధరించాలని, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ రిజర్వ్ పేరుతో తీసుకొచ్చిన జీవో నంబర్ 49ను పూర్తిగా రద్దు చేయాలని, పీసా చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామసభల అనుమతి లేకుండా ఏజెన్సీ గ్రామాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదన్నారు. పెండింగ్‌లో ఉన్న తునికాకు బోనస్‌ను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో టీఏజీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు సోడెం ప్రసాద్, జిల్లా కమిటీ సభ్యుడు కారం వీరస్వామి, వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సభ్యుడు కారం సూరిబాబు, మాడి ముక్తేశ్వరరావు, సోయం రమణయ్య, మడివి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.





కామెంట్లు (0)