పసిఫిక్‌లో రికార్డు స్థాయికి చేరిన ఉష్ణోగ్రతలు
2027 వరకు కొనసాగనున్న వేడి ప్రభావం
ఇప్పటికే వర్షపాత లోటుతో భారత్ ఇబ్బందులు
ఆహార ధరల పెరుగుదలపై ఆందోళన
న్యూఢిల్లీ : ఎల్‌నినో ప్రభావం తీవ్రమవుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలోని కీలక ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి చేరాయి. ఈ ప్రభావం 2027 వరకు కొనసాగవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వర్షపాత లోటుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత్‌లో వ్యవసాయం, ఆహార ధరలపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రపంచ వాతావరణంలో వేడి తీవ్రత పెరుగుతోంది. ఎల్‌నినో బలపడుతుండటంతో సముద్రాలు, భూభాగాల ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయిలో కొనసాగుతున్నాయి. యూరోపియన్ యూనియన్‌కు చెందిన కోపర్నికస్ వాతావరణ మార్పుల సేవ ప్రకారం.. ఎల్‌నినోను పర్యవేక్షించే పసిఫిక్ మహాసముద్రంలోని నినో 3.4 ప్రాంతంలో సెప్టెంబరులో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 29.70 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది.
1982-83, 1997-98, 2015-16 సంవత్సరాల్లో నమోదైన బలమైన ఎల్‌నినో పరిస్థితుల గరిష్ఠ స్థాయిలను ఇది అధిగమించింది. అయితే, ప్రస్తుత ఎల్‌నినోనే చరిత్రలో అత్యంత బలమైనదని ఇప్పుడే నిర్ధారించలేమని కోపర్నికస్ స్పష్టం చేసింది. సముద్రాలు దీర్ఘకాలంగా వేడెక్కుతుండటం వల్ల పాత రికార్డులతో పోల్చడం కష్టమని తెలిపింది.
ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) అక్టోబర్ 8న విడుదల చేసిన అంచనాల ప్రకారం.. ఎల్‌నినో డిసెంబరులో గరిష్ఠ స్థాయికి చేరవచ్చు. 2027 ఫిబ్రవరి వరకు కొనసాగేందుకు దాదాపు 100 శాతం అవకాశం ఉందని సంస్థ పేర్కొంది. 1950 తర్వాత నమోదైన అత్యంత బలమైన ఎల్‌నినో పరిస్థితుల్లో ఇది ఒకటిగా నిలవవచ్చని అంచనా వేసింది. సెప్టెంబరులో ప్రపంచ సగటు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 21.05 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. 2023లో నమోదైన 20.92 డిగ్రీల రికార్డును ఇది అధిగమించింది.
అదే నెలలో ప్రపంచ సగటు భూ ఉపరితల గాలి ఉష్ణోగ్రత 16.27 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది పారిశ్రామికీకరణకు ముందు 1850-1900 మధ్య నమోదైన సగటు కంటే 1.63 డిగ్రీలు ఎక్కువ. పారిస్ వాతావరణ ఒప్పందం నిర్దేశించిన దీర్ఘకాలిక 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత పరిమితిని అధిగమించే ప్రమాదం పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారత్‌పై ప్రభావం
ఎల్‌నినో సాధారణంగా భారత్‌లో రుతుపవన వర్షాలు తగ్గేందుకు దారితీస్తుంది. 2026 నైరుతి రుతుపవనాల కాలంలో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం కంటే 12.6 శాతం తక్కువ వర్షం నమోదైంది. సాధారణంగా 868.6 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. 759.4 మిల్లీమీటర్లే నమోదైంది. 2015 తర్వాత ఇదే అత్యల్ప వర్షపాతం. తూర్పు, ఈశాన్య భారతంలో వర్షాల లోటు సుమారు 25.6 శాతంగా ఉంది. అక్టోబరులోనూ సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఈ సమయంలో రబీ పంటల సాగు ప్రారంభమవుతుంది. వర్షాభావం కొనసాగితే పంటల దిగుబడిపై ప్రభావం పడటంతో పాటు ఆహార సరఫరాలో కొరత, ధరల పెరుగుదల వంటి సమస్యలు తలెత్తవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కూడా ద్రవ్యోల్బణానికి ఎల్‌నినో ఒక ప్రమాదంగా మారవచ్చని గతంలో హెచ్చరించింది.







కామెంట్‌లు (0)