Magazines

అమెరికా ఆంక్షల భయం..

1 గంట క్రితం

Fear of US sanctions..
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026 | 3 నిమిషాల చదవడం

ట్రంప్‌ ఒత్తిడికి తలొగ్గుతున్న మోడీ ప్రభుత్వం?
ఇరాన్‌కు మందుల రవాణా బ్రేక్‌

ఆగస్టు నుంచి ఇరాన్‌ విమానాలకు అనుమతులు నిలిపివేత

ప్రాణాలను కాపాడే మందులకూ యూఎస్‌ ఆంక్షల సెగ

నేరుగా విమానాల బదులు రోడ్డు మార్గంలో తరలించుకోవాలని భారత్‌ సూచన


న్యూఢిల్లీ: ప్రాణాలను కాపాడే మందుల రవాణాకు కూడా అమెరికా ఆంక్షలు అడ్డంకిగా మారుతున్నాయి. ఇరాన్‌కు మందులు తరలించేందుకు నేరుగా విమానాలను అనుమతిం చడంలో మోడీ ప్రభుత్వం వెనుకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికా ఆంక్షల భయంతోనే ఆగస్టు ప్రారంభం నుంచి ఇరాన్‌ విమానాలకు అనుమతులు ఇవ్వడం లేదని సమాచారం. మానవతా అవసరాల కంటే అమెరికా ఆంక్షల ప్రభావాలకే ప్రాధాన్యం ఇస్తున్నారా అన్న ప్రశ్నలు ఈ పరిణామంతో తలెత్తుతున్నాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరాన్‌కు మందుల రవాణా మరింత కష్టంగా మారింది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయిల్‌ ఇరాన్‌పై దాడులు ప్రారంభిం చడంతో ప్రాంతీయ విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

అంతకుముందు మహాన్‌ ఎయిర్‌ వారానికి రెండుసార్లు న్యూఢిల్లీకి, ఇరాన్‌ ఎయిర్‌ వారానికి ఒకసారి ముంబయికి విమానాలు నడిపేవి. యుద్ధం తర్వాత సాధారణ సర్వీసులు నిలిచిపోయినా, మందుల రవాణా కోసం మహాన్‌ ఎయిర్‌ ప్రత్యేక విమానాలకు తొలినాళ్లలో భారత్‌ అనుమతించింది. ఆ తర్వాత ఆ అనుమతులు నిలిచి పోయాయి. మార్చి 30న మందులు తీసుకెళ్లేందుకు భారత్‌కు రావాల్సిన మహాన్‌ ఎయిర్‌ విమానం అమెరికా దాడిలో దెబ్బతింది. దీంతో సుమారు 40 టన్నుల మందులు భారత్‌లోనే నిలిచిపోయాయి. భారతీయుల విరాళాలతో కొను గోలు చేసిన మందు ల రవాణాకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మరోవై పు భారత్‌ ఐదు టన్నుల మందులు, వైద్య పరిక రాలను ఇరాన్‌ రెడ్‌ క్రెసెంట్‌ సొసైటీ ద్వారా పంపింది. గతంలో మానవతా సహ కారం అందించిన భారత్‌.. ఇప్పుడు నేరుగా విమా నాల రాకపోకలకు అనుమతులు ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది.

అమెరికా ఆంక్షల కత్తి

ఇరాన్‌ విమానాలకు విమానాశ్రయాల్లో సేవలు అందించే సంస్థలపైనా చర్యలు తీసుకుంటామని అమెరికా హెచ్చరించింది. జులై 30న మహాన్‌ ఎయిర్‌కు సహకరిస్తున్న భారత సంస్థ స్కైజ్‌ ట్రావెల్స్‌ అండ్‌ లాజిస్టిక్స్‌తో పాటు పలు సంస్థలపై ఆంక్షలు విధించింది. సెప్టెంబరులో ఇరాన్‌ విమానయాన రంగంపై మరిన్ని ఆంక్షలు ప్రకటించింది.

ఇరాన్‌ విమానాలకు సేవలు అందించే విమానాశ్రయాలు, ఇంధన సరఫరాదారులు, ఇతర సంస్థలు అమెరికా ఆర్థిక వ్యవస్థతో సంబంధాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో నేరుగా ఇరాన్‌ విమానాలకు అనుమతి ఇవ్వడానికి భారత పౌర విమానయాన శాఖ వెనుకాడినట్టు భారత వర్గాలు తెలిపాయి. బదులుగా ఇతర దేశాల విమా నాల్లో మందులను అర్మేనియా లేదా అజర్‌బైజాన్‌కు చేర్చి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఇరాన్‌కు తరలించాలని భారత్‌ సూచించింది. అయితే, నేరుగా విమానాల ద్వారానే మందులు తీసుకెళ్లాలని ఇరాన్‌ పట్టుబడుతున్నట్టు సమాచారం.

ప్రాణాలను కాపాడే మందుల రవాణాకు భారత్‌ కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ తెలిపారు. యుద్ధం కారణంగా ఇరు దేశాల మధ్య విమాన సంబంధాలకు కొత్త అడ్డంకులు ఏర్పడ్డాయనీ, మందుల రవాణా కోసం ఇరాన్‌తో సంప్రదింపులు కొనసాగుతున్నాయని చెప్పారు.

బ్రిక్స్‌ సమావేశానికి ఇరాన్‌ స్పీకర్‌ గైర్హాజరు

విమానాల్లో మానవతా సాయం నిలిపివేత నేపథ్యంలో నిర్ణయం

ఇరాన్ ఇస్లామిక్ కన్సల్టేటివ్ అసెంబ్లీ స్పీకర్, మహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ ఈ నెల 26, 27 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం సమావేశంలో పాల్గొనడం లేదని ఇరాన్ రాయబార కార్యాలయం శనివారం ప్రకటించింది. ఇరాన్ ఎయిర్ ద్వారా టెహ్రాన్‌కు మందుల రవాణాను భారత్ నిరాకరించిందన్న వార్తల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో ఇరాన్ పార్లమెంటరీ ప్రతినిధి బృందం పాల్గొంటుందని ఇరాన్‌ ‌రాయబార కార్యాలయం పేర్కొంది. "బ్రిక్స్ సభ్య దేశాలలో ఒకటిగా, ఈ కూటమి శిఖరాగ్ర సమావేశాలలో అత్యున్నత స్థాయిలో చురుకైన, సమర్థవంతమైన భాగస్వామ్యానికి ఇరాన్ తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది," అని తెలిపింది. భారతదేశం, సింగపూర్ నుంచి మందులను విమానంలో రవాణా చేయడానికి తమ విమానయాన సంస్థ అనుమతి పొందడంలో విఫలమైందని ఇరాన్ ఎయిర్ మేనేజింగ్ డైరెక్టర్ తాహెర్ అబ్దుల్హే టెహ్రాన్‌లో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించడంతో ఈ సమస్య వెలుగులోకి వచ్చింది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్