సస్పెండ్ చేసిన విద్యార్థి సంఘం నేతలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి
క్యాంపస్‌లో మౌలిక వసతులు మెరుగుపర్చాలి
లైంగిక వేధింపులు, కుల వివక్షపై సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల డిమాండ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభమైంది. ఆందోళనల్లో పాల్గొన్నందుకు సస్పెన్షన్‌కు గురైన విద్యార్థి సంఘం నాయకులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, క్యాంపస్‌లో మౌలిక వసతులు మెరుగుపర్చాలని, లైంగిక వేధింపులు, కుల వివక్షను అరికట్టేందుకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విశ్వవిద్యాలయంలో వెలుగుచూసిన నియామకాల వివాదంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని కోరారు. జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అతిథి మిశ్రా, ఉపాధ్యక్షురాలు కె. గోపిక బాబు, ప్రధాన కార్యదర్శి సునీల్ యాదవ్ నేతృత్వంలో మొత్తం 18 మంది విద్యార్థులు నిరాహార దీక్షలో కూర్చున్నారు. విద్యార్థి సంఘంలో భాగమైన ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఏ, డీఎస్ఎఫ్తో పాటు ఎఐఎస్ఎఫ్, దిశా తదితర విద్యార్థి సంఘాలు కూడా ఆందోళనలో పాల్గొంటున్నాయి.
కొనసాగుతున్న ప్రతీకార చర్యలు
విద్యార్థి సంఘం నేతలు నిరాహార దీక్షకు దిగినప్పటికీ, వారిపై విశ్వవిద్యాలయ యాజమాన్యం ప్రతీకార చర్యలు కొనసాగిస్తోందని విద్యార్థి సంఘం విమర్శించింది. దీక్షలో పాల్గొన్న విద్యార్థులను విశ్వవిద్యాలయం ఆదేశాల మేరకు వైద్యులు పరీక్షించారు. అయితే ఇప్పటికే సస్పెన్షన్‌కు గురైన అతిథి మిశ్రా, గోపిక బాబు, సునీల్ యాదవ్‌లకు మాత్రం వైద్య పరీక్షలు నిర్వహించలేదని విద్యార్థులు తెలిపారు. విద్యార్థుల ప్రధాన డిమాండ్లను పరిష్కరించే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామని విద్యార్థి సంఘం నేతలు స్పష్టం చేశారు. క్యాంపస్‌లో విద్యార్థుల హక్కులు, భద్రత, మౌలిక వసతుల సమస్యలపై యాజమాన్యం తక్షణం స్పందించాలని వారు డిమాండ్ చేశారు.
జేఎన్‌యూలో నిరవధిక నిరాహార దీక్ష
48 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)