Magazines

జ్ఞానేశ్‌ కుమార్‌పై దేశద్రోహం కేసు పెట్టాలి

1 గంట క్రితం

Gyanesh Kumar.
avatar
balaji

ప్రచురించబడింది నవం 01, 2026 | 4 నిమిషాల చదవడం

ఇండియా బ్లాక్‌ ఆధ్వర్యంలో అభిశంసన

సీఈసీపై ఆరు అభియోగాలు చదివిన ఖర్గే

2024 ఎన్నికల్లో అక్రమాలు, 13.2 కోట్ల మంది ఓటర్ల తొలగింపు
ఓటు హక్కును హరించిన వారిని వదిలిపెట్టం : రాహుల్ గాంధీ

​నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌పై దేశద్రోహం కేసు నమోదు చేసి విచారణ జరపాలని రాజ్య‌స‌భ ప్ర‌తిప‌క్ష‌ నేత‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్‌ చేశారు. ఇండియా బ్లాక్‌ ఆధ్వర్యంలో శనివారం నాడిక్క‌డ‌ ఖర్గే నివాసంలో ప్రజా అభిశంసన కార్యక్రమం నిర్వహించారు. లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమారి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఎన్నికల ప్రక్రియను దెబ్బతీయ డం, ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడటం, ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరచడం వంటి ఆరు అభియోగాల ను ఖర్గే చదివి వినిపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదేశాల మేరకు జ్ఞానేశ్‌కుమార్‌ ఎన్నికల కమిషన్‌ను నడుపుతున్నారని ఆయన విమ‌ర్శించారు. ఎన్నికల అక్రమాలకు సహకరించడం ద్వారా రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీశారని ‌తెలిపారు. దేశ, రాష్ట్రాల ఎన్నికలను ప్రభావితం చేసే కుట్రలో భాగస్వామిగా వ్యవహరించారని ధ్వ‌జ‌మెత్తారు.జ్ఞానేశ్‌కుమార్‌పై ఖర్గే చదివి వినిపించిన ఆరు అభియోగాల్లో ప్రధానంగా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే కుట్రకు సహకరించడం, ‌

సర్‌ ప్రక్రియలో 13.2 కోట్ల మంది ఓటర్లను ఉద్దేశపూర్వకంగా ఓటర్ల జాబితా నుంచి తొలగించడం ‌వంటివి ఉన్నాయి. పార్లమెంటు ఆమోదం లేకుండా ఓటరు నమోదు నిబంధనల్లోని ఫారం-6ను మార్చడం, ఇఆర్‌ఓనెట్‌/ఇసిఐనెట్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఓటర్ల జాబితాపై కేంద్రీకృత నియం త్రణ సాధించడం కూడా అభియోగాలుగా పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌లోని మిగిలిన ఇద్దరు కమిషనర్లను నిర్ణయాల ప్రక్రియకు దూరంగా ఉంచడం, స్వతంత్రంగా వ్యవహ రించాల్సిన రాజ్యాంగ బాధ్యతను విస్మరించి అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిం చడం మిగిలిన అభియోగాలుగా ఉన్నాయి. ఈ చర్యలు దేశానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగిన నేరపూరిత చర్యలని ఖర్గే ఆరోపించారు. తమకు సీఈసీపై వ్యక్తిగత కక్ష లేదని, ఎన్నికల కమిషన్‌ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నిష్పక్షపాతంగా పని చేయాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు.

ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తున్నారు..

దేశ ప్రజల ఓటు హక్కును హరించి, ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నా లకు పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. ‘సర్‌ ’పేరుతో కోట్లాది మంది ఓటర్ల హక్కులను తొలగిస్తున్నారని విమర్శించారు. ఈ పరిణామం భారత సమాఖ్య ఐక్యతకు, భారతీయ ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఎదురైన పరీక్షగా అభివర్ణించారు. ప్రజలే తమ బలమని, దేశ భవిష్యత్తు కోసం అందరం కలిసి పోరాడుతున్నామని అన్నారు. పరిస్థితులు మారుతున్నాయని, ప్రజల గొంతుకను వినిపించే కొత్త రాజకీయ అస్త్రం సిద్ధమవుతోందని హెచ్చరించారు. మోడీ, అమిత్‌షాలు తమను రక్షిస్తారని ఎవరూ భావించవద్దన్నారు. ఓటర్ల జాబితాల నుంచి 3.3 కోట్ల మంది పేర్లను తొలగించారని రాహుల్ గాంధీ వివరించారు. ఇది మొత్తం ఓటర్లలో సుమారు 15 శాతానికి సమానమని అన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో వీరంతా ఓటు హక్కును వినియోగించుకున్నారని, అప్పటి గెలుపు ఓటముల మధ్య తేడా కేవలం మూడు శాతమేనని గుర్తుచేశారు. జ్ఞానేశ్‌కుమార్ పదవిలో కొనసాగేందుకు అర్హత లేదని. ప్రజల ఓటు హక్కును దెబ్బతీసిన ప్రతి ఒక్కరినీ బాధ్యులుగా నిలబెట్టాలన్నదే ఈ బహిరంగ అభిశంసన లక్ష్యమని వివరించారు.

నైతిక, చట్టపరమైన అధికారాన్ని కోల్పోయిన సీఈసీ : జాన్ బ్రిట్టాస్
దశంలో కోట్లాది మంది ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించిన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ తన నైతిక, చట్టపరమైన అధికారాన్ని కోల్పోయారని సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యులు జాన్ బ్రిట్టాస్ విమర్శించారు. తాను అర్హతగల ఓటరునని నిరూపించుకోవడానికి ఒక ఎంపిగా తానే రెండు విచారణలను ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇక సామాన్య పౌరుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చన్నారు. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి ‌సీపీఐ(ఎం) తరపున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఓటర్ల జాబితాల నుంచి పేర్ల తొలగింపు ద్వారా ప్రజలను తమ ఓటు హక్కుకు దూరం చేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిధిని కుదించి, అధికారాన్ని కేంద్రీకరించి, శాశ్వత నియంత్రణకు మార్గం సుగమం చేసే దిశగా మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి చర్యలోనూ ఒక పద్ధతి కనిపిస్తోందని ఆయన విమ‌ర్శించారు.

కార్మికులు, ప్రజలు తమ హక్కుల కోసం నిరసనలు తెలుపుతుంటే వారిని అణచివేసే ధోరణులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలను దేశ ప్రజలు, చరిత్ర గమనిస్తున్నాయని పేర్కొంటూ, అంబేద్క‌ర్ ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగ హక్కులను, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జాన్ బ్రిట్టాస్ పిలుపునిచ్చారు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాజీవ్ రాయ్ మాట్లాడుతూ ఓట్ల దొంగతనం వ్యవస్థీకృత నేరంగా మారిందన్నారు. చట్టంలో మార్పులు చేసి జ్ఞానేశ్‌కుమార్‌ను ఈ వ్యవస్థకు సూత్రధారిగా మార్చారని ఆరోపించారు. ‌టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా మాట్లాడుతూ జ్ఞానేశ్‌కుమార్ ప్రజాస్వామ్యాన్ని క్రమపద్ధతిలో నిర్వీర్యం చేశారని విమర్శించారు. ‌పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ పార్లమెంటులో చర్చించాల్సిన అంశాలను బయట చర్చించాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. శివసేన ఎంపీ అరవింద్ సావంత్ మాట్లాడుతూ మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో తమ కూటమి నుంచి 31 మంది ఎంపీలు గెలిచారని గుర్తుచేశారు. నాలుగు నెలల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు గంటల వ్యవధిలో 40 లక్షల ఓట్లు పోలైనట్లు గణాంకాలు వెల్లడయ్యాయని తెలిపారు.

ఎన్‌సీపీ ఎంపీ బజరంగ్ మనోహర్ సోనావానే మాట్లాడుతూ ఓటు హక్కును పరిరక్షించాల్సిన ఎన్నికల సంఘం తన బాధ్యతకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి జి. దేవరాజన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, భారత గణతంత్రాన్ని పరిరక్షించాలంటే జ్ఞానేశ్‌కుమార్‌ను ‌సీఈసీ పదవి నుంచి తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపీ కపిల్ సిబల్, జెఎంఎం ఎంపీ బైద్యనాథ్ రామ్, ఆర్‌టీఐ కార్యకర్త అంజలి భరద్వాజ్, స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్, విసికె ఎంపీ తిరుమావ‌ళ‌వ‌న్, ఐయుఎంఎల్ ఎంపీ ఈటి మ‌హ్మద్ బ‌షీర్, నేష‌న‌ల్ కాన్ఫరెన్స్ నేత నాసిర్ అస్లాం, సీపీఐ(ఎంఎల్‌) లిబ‌రేష‌న్ ఎంపీ సుదామా ప్ర‌సాద్ , కేర‌ళ కాంగ్రెస్ అధ్య‌క్షుడు జోస్ కె.మ‌ణి, సీపీఐ ఎంపీ పి.సంతోష్ కుమార్‌‌లు మాట్లాడుతూ ఈ అభిశంసనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అలాగే, విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారు. ఓటర్ల జాబితాల నుంచి పేర్లు తొలగించబడిన బాధితులు కూడా తమ అనుభవాలను వివరించారు. అనంతరం ఈ అభిశంసన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ కార్య‌క్ర‌మంలో సోనియాగాంధీ, సీపీఐ(ఎం) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంఎ బేబీ, తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, జార్ఖండ్ ముఖ్య‌మంత్రి హేమంత్ సోరెన్‌, కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంకాగాంధీ, ఆర్‌‌జెడి నేత తేజస్వీ యాదవ్‌, ఐసా అధ్యక్షురాలు నేహా బోరా త‌దిత‌రులు పాల్గొన్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్