రూ.7,395 కోట్లతో పీఎంవీజీఎస్‌వైకు ఆమోదం
రూ.10 వేల కోట్లతో కంటైనర్ తయారీ ప్రోత్సాహక పథకం
రూ.1,856 కోట్లతో క్రీడా వస్తువుల తయారీ స్కీం :
కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మూడు శాతం డీఏ, డీఆర్ పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నది. నేషనల్ మీడియా సెంటర్ (ఎన్ఎంసీ)లో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 60 శాతమున్న డీఏ, డీఆర్ మూడు శాతం పెంచడానికి మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని అన్నారు. ఈ పెంపు 2026 జులై 1 నుంచి వర్తిస్తుందని, ఈ నిర్ణయంతో 48.54 లక్షల మంది ఉద్యోగులు, 68.71 లక్షల మంది పెన్షనర్లకు లబ్ది చేకూరనుందని అన్నారు. దీంతో ఏడాదికి రూ.10,016.10 కోట్ల అదనపు భారం పడనుందని తెలిపారు.
పీఎంవీజీఎస్‌వైకు ఆమోదం
ప్రధానమంత్రి వికసిత్ గ్రామ స్వరాజ్ యోజన (పీఎంవీజీఎస్‌వై) పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదించినట్టు చెప్పారు. ఐదేండ్ల లో రూ.7,395.55 కోట్ల వ్యయంతో దీన్ని అమలు చేయనున్నారు. ఇందులో కేంద్ర వాటా రూ.4,869.48 కోట్లు కాగా, రాష్ట్ర వాటా 2,526.07 కోట్లు ఉన్నట్లు తెలిపారు. ఇది 2026-27 నుంచి 2030-31 వరకు అమలులో ఉంటుందని అన్నారు. దేశవ్యాప్తంగా 2.78 లక్షలకు పైగా గ్రామీణ స్థానిక సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తు న్నట్టు చెప్పారు.
ఈ పథకంతో 32 లక్షల మంది ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ప్రత్యక్ష ప్రయో జనం ఉండనుందని, గ్రామ పంచాయతీల ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యమిచ్చేలా ఈ పథకాన్ని రూపొందించామని అన్నారు.
కంటైనర్ తయారీ రంగానికి ప్రోత్సాహం
దేశీయ కంటైనర్ తయారీ పరిశ్రమ బలోపేతమయ్యే దిశగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ రంగం అభివృద్ధి కోసం రూ.10 వేల కోట్లతో ప్రత్యేక పథకాన్ని రూపొందించినట్టు పేర్కొన్నారు. 2039-40 వరకు 13 ఏండ్ల పాటు కంటైనర్ తయారీ ప్రోత్సాహక పథకం అమలు కానుందని అన్నారు. ఇందులో భాగంగా కంటైనర్ తయారీ సంస్థలకు రుణాలపై వడ్డీ రాయితీలు, తయారీ యూనిట్లకు భూమి లీజులో రాయితీలు ఇవ్వనున్నట్లు చెప్పారు. అలాగే తయారీ సంస్థలకు నిర్వహణ వ్యయాల కింద ఆర్థిక సహాయం అందిస్తామని, దేశీయ తయారీ యూనిట్లలో స్థానిక ఉత్పత్తుల వినియోగం పెంపునకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఈ పథకం 2026-27 బడ్జెట్‌లోనే ప్రకటించారు.
క్రీడా వస్తువుల తయారీకి ఊతం
రూ.1,856.67 కోట్లతో ఖేలో ఇండియా స్పోర్ట్స్ గూడ్స్ తయారీ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. 2026 నుంచి 2033-34 వరకు దేశంలో 300 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నాలుగు క్రీడా వస్తువుల తయారీ జోన్లు ఏర్పాటు చేయనున్నామని, అర్హత కలిగిన ప్రధాన పెట్టుబడిదారులకు 20 శాతం మూలధన వ్యయ ప్రోత్సాహకం అందించనున్నట్టు తెలిపారు. రూ.10 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టే తయారీదారులకు 15 శాతం వరకు ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్దంగా ఉన్నట్టు చెప్పారు. అర్హత కలిగిన స్పోర్ట్స్ స్టార్టప్‌లకు రూ.20 లక్షల వరకు గ్రాంట్లు ఇవ్వనుందని అన్నారు. ఈ పథకం 2026-27 బడ్జెట్‌లోనే ప్రకటించారు.



![We are not against restoration; we are against the plunder being carried out in the name of the Musi [project].](https://nvtg-prd.sgp1.digitaloceanspaces.com/Brs-1793216322963-0e75c4bf-e4c1-4722-876f-c497295fdc0d-360x240.webp)



కామెంట్‌లు (0)