Magazines

పునరుద్ధరణకు కాదు.. మూసీ పేరుతో దోపిడీకి మేం‌ వ్యతిరేకం

1 గంట క్రితం

We are not against restoration; we are against the plunder being carried out in the name of the Musi [project].
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 2 నిమిషాల చదవడం

ఎమ్మెల్యే సుధీర్‌‌రెడ్డి

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌

మూసీ పునరుద్ధరణకు తాము వ్యతిరేకం కాదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌‌రెడ్డి అన్నారు. మూసీ పేరుతో దోపిడీని, సీఎం రేవంత్‌‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మూసీ ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణను ఏర్పాటు చేసి ప్రజల మాట వినకుండా నిరంకుశంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించిందని అన్నారు. మూసీ ప్రాజెక్టులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ ప్రభుత్వమే పొంతన లేకుండా మాట్లాడుతోందని చెప్పారు. 50 మీటర్ల బఫర్ జోన్‌ను 500 మీటర్లకు ఎలా పెంచారని ప్రశ్నించారు. డీపీఆర్ లేకుండా టెండర్లు ఎలా పిలుస్తారని నిలదీశారు. ప్రభుత్వం డీపీఆర్ బయటపెట్టి ప్రజలకు అన్ని వివరించాలని డిమాండ్‌ ‌చేశారు. మూసీ ప్రాజెక్టులో పేదల ఇండ్లు నష్టపోతే ఎంతటి పోరాటానికైనా సిద్దమని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు బొల్లం మల్లయ్య యాదవ్, ఉపేంద్రచారి, కురువ విజయ్ కుమార్, మహేష్ యాదవ్ పాల్గొన్నారు.

మూసీ పేరుతో మెగా లూటీ : దాసోజు శ్రవణ్‌

మూసీ పేరుతో మెగా లూటీ చేసేందుకు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. కరువుతో ప్రజలు అల్లాడుతుంటే మూసీ నదికి రంగులు అద్దడం అవసరమా?అని ‌బుధవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు.

డీపీఆర్ లేకుండా, ఎలాంటి పారదర్శకత లేకుండా నిబంధనలను గాలికొదిలేసి ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ద్వారా రూ.7,345 కోట్ల అప్పు తెచ్చి గ్లోబల్ టెండర్లు పిలవడం పాలకుల దివాలాకోరుతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలను గాలికొదిలిన ప్రభుత్వం : ఎర్రోళ్ల శ్రీనివాస్‌

కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రజలను గాలికొదిలేసిందని కార్పొరేషన్ మాజీ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌‌లో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు ఓట్ల కోసం అశోక్ నగర్‌లో నిరుద్యోగుల చుట్టూ, పాదయాత్రల పేరుతో రైతుల చుట్టూ తిరిగిన బల్మూరి వెంకట్, చామల కిరణ్, అద్దంకి దయాకర్.. ఇవాళ పదవులు రాగానే రేవంత్ రెడ్డి నుంచి వచ్చే స్క్రిప్టులు చదివే పెయిడ్ ఆర్టిస్టులుగా మారారని ఎద్దేవా చేశారు. సీఎంవో రాసిచ్చే స్క్రిప్టులు చదవడానికి ప్రజాప్రతినిధులా? లేక రేవంత్ రెడ్డి ప్రయివేట్ భజన బృందమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు డైవర్షన్ రాజకీయాలు మానుకుని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని డిమాండ్‌ ‌చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్