Magazines

‘అర్నాబ్‌’ను ఎదుర్కొనేందుకు 
వంద బృందాలు

1 గంట క్రితం

TSNPDCL
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 3 నిమిషాల చదవడం

ఎల్‌నినోతో వంద శాతం పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌
యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు క్ష‍ేత్రస్థాయిలో ప్రచారం

‘నవతెలంగాణ’తో టీఎస్‌ఎన్‌‌పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి

నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి

అర్నాబ్‌ తుఫానును ఎదుర్కొనేందుకు వంద బృందాలను రంగంలోకి దించినట్టు తెలంగాణ స్టేట్‌ నార్త్‌ పవర్‌ డ్రిస్టిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ ‌(‌టీఎస్‌ఎన్‌‌పీడీసీఎల్‌) చైర్మెన్‌ అండ్‌ మేనేజింగ్ డైరెక్టర్‌ కర్నాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో విద్యుత్‌ డిమాండ్‌ గ‌తేడాది అక్టోబర్‌తో పోలిస్తే వంద శాతం పెరిగిందన్నారు. అర్నాబ్‌ తుఫాన్‌, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ‌రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలపై టీఎస్‌ఎన్‌‌పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డితో బుధవారం ‘నవతెలంగాణ’ ముఖాముఖి చేపట్టింది. ఆ వివరాలు మీ కోసం..

ఎల్‌నినో ప్రభావం ఎదుర్కొనేందుకు ఎలాంటి కార్యచరణను రూపొందించారు ?

ఎల్‌ నినో ప్రభావంతో కంపెనీ పరిధిలో తీవ్ర ప్రభావం ఉంది.

వంద శాతం విద్యుత్‌ డిమాండ్‌ అదనంగా పెరగడం గమనార్హం. ప్రతి యేటా ఫిబ్రవరి, మార్చిలో అత్యధికంగా విద్యుత్‌ డిమాండ్‌ ఉండేది. ఎల్‌ నినో ప్రభావంతో ఈసారి ఈ ఏడాది సెప్టెంబర్‌లో విద్యుత్‌ డిమాండ్‌ తీవ్రంగా పెరిగింది. ఈ సెప్టెంబర్‌ 9వ తేదీన 6,948 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ నమోదవడం గమనార్హం. ఇదే సమయంలో గతేడాది 4,750 మెగావాట్లుంది. గతేడాది అక్టోబర్‌లో విద్యుత్‌ డిమాండ్‌ 3,642 మెగావాట్లుంటే, ఈ అక్టోబర్‌లో విద్యుత్‌ డిమాండ్‌ 6,708 మెగావాట్లకు పెరిగింది.

​విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతుండటంతో డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్ల (డీటీఆర్‌) ఫెయిల్యూర్‌ ఎలా ఉన్నాయి?

విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతుండటంతో డీటీఆర్‌లు ఫెయిలవుతుంటాయి. రెండు నెలలకు సరిపోను రోలింగ్‌ స్టాక్‌ను ముందే సిద్ధం చేసుకున్నాం. ఎక్కడ డీటీఆర్‌లు ఫెయిలైనా వెంటనే వాటి స్థానంలో వేరే డీటీఆర్‌లను బిగించి విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. గతేడాదిలో 1,000 డీటీఆర్‌లు ఫెయిలైతే, ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికే 2,600-2,700 ఫెయిలయ్యాయి.

అర్నాబ్‌ తుఫాన్‌ను ఎదుర్కోవడానికి కంపెనీ పరిధిలో ఎలాంటి చర్యలు చేపట్టారు?

మన కంపెనీ పరిధిలో 12 జిల్లాల్లో అర్నాబ్‌ తుఫాన్‌ ప్రభావం ఉండే అవకాశముంది. ప్రధానంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్‌, భూపాలపల్లి, పెద్దపల్లి తదితర జిల్లాల్లో అధిక ప్రభావం ఉంటుంది. తుఫానుతో ఎలాంటి నష్టం వాటిల్లినా వెంటనే విద్యుత్‌ను పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాం. క్ష‍ేత్ర స్థాయిలో వంద బృందాలను రంగంలోకి దింపాం. వారికి అందుబాటులో అంబులెన్స్‌లు, పోల్స్‌, ఇన్సూలేటర్లు, కండక్టర్‌ తదితర సామగ్రిని అందుబాటులో ఉంచాం. ఖమ్మం, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయి. బుధవారం సాయంత్రానికి తుఫాను ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మరిన్ని చర్యలు తీసుకునే అవకాశముంది. తుఫాను ముప్పు మనకు లేకున్నా పక్క రాష్ట్రాలకు మన బృందాలను పంపించి సాయమం దించడానికి సిద్ధంగా ఉన్నాం.


రానున్న కాలంలో విద్యుత్‌ డిమాండ్‌ మరింత పెరగనున్న నేపథ్యంలో ఈ సమస్యను ఎలా అధిగమిస్తారు?

మన కంపెనీ పరిధిలో ఇప్పటికే ఆదిలాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్‌ జిల్లాల్లో భూగర్భ జలాలు 3 మీటర్ల లోతుకు పడిపోయాయి. దీంతో నీటిని తోడటానికి విద్యుత్‌ వినియోగం పతాకస్థాయికి పెరిగింది. ఈ ఏడాది మార్చిలో భూగర్భ జలాలు 3 మీటర్లకు పైకి ఉంటే, ఇప్పుడు 3.3 మీటర్ల కిందకు పడిపోయాయి. వరి కోతలు ముమ్మరం కావడంతో విద్యుత్‌ వినియోగం కాస్తా తగ్గుముఖం పడుతుంది. విద్యుత్‌ అధిక భారాన్ని ఎప్పటికప్పుడు సమీక్ష‍ిస్తూ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. రానున్న మాసాల్లో విద్యుత్‌ డిమాండ్‌కనుగుణంగా మౌళిక వసతులు పెంచుతున్నాం. ఎల్‌నినో నేపథ్యంలో వర్షాలు లేక రిజర్వాయర్లలో నీరు లేకపోవడం, భూగర్భజలాలు పడిపోవడంతో యాసంగిలో వరి సాగు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే రైతులకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో యాసంగిలో వరి సాగు తగ్గితే విద్యుత్‌ డిమాండ్‌ వ్యవసాయ రంగంలో తగ్గుతుంది. గృహ వినియోగం, వాణిజ్య వినియోగం మాత్రం పెరుగుతాయి. ఈ పరిస్థితులను అధిగమించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్