ఓటు హక్కు పరిరక్షణకు 1న ఢిల్లీలో నిరసన : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
పీఎస్ఆర్ యువనేస్తం పేరిట నిరుద్యోగులకు ఉచిత ఆన్లైన్ కోచింగ్
తన జన్మదినం సందర్భంగా మంత్రి ప్రకటన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గతంలో నిరసనలు, ధర్నాలకు అవకాశం లేకుండా ఇందిరాపార్క్‌లో ధర్నాచౌక్‌ను ఎత్తేసిన బీఆర్ ఎస్ నేతలకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా? అని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ధర్నాచౌక్‌ను పునరుద్ధరించి, ప్రజలు వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసేందుకు అవకాశం కల్పించిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లటానికి సంబంధించి రైళ్ల కేటాయింపులో కేంద్రం ప్రభుత్వం వివక్షను చూపుతున్నదని ఆయన విమర్శించారు. నిరసనలకు ఆటంకం కల్పిస్తున్న బీజేపీ నాయకులే రాష్ట్రంలో పాదయాత్రలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కల్పించిన ప్రజల ఓటు హక్కు పరిరక్షణే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఢిల్లీలో సర్‌పై నిర్వహించే ఆందోళనలకు ఆటంకాలు కల్పిస్తూ వచ్చేనెల రెండున హైదరాబాద్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పాదయాత్ర చేయడమేంటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ అయినా అభిప్రాయాలను వ్యక్తం చేసుకోవచ్చనీ, పాదయాత్రలు నిర్వహించొచ్చని అన్నారు. అయితే అదే స్వేచ్ఛను ఇతర పార్టీలకు కూడా కల్పించాలన్నదే తమ అభిప్రాయమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు ఉండాలనీ, నిరసన తెలిపే హక్కును గౌరవించాలని కోరారు. దేశవ్యాప్తంగా అర్హులైన ఓటర్ల ఓటు హక్కును తొలగిస్తున్నారనే అంశంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. సర్ ప్రక్రియలో ఓటర్లకు ఎదురవుతున్న సమస్యలపై సమగ్ర పునఃపరిశీలన జరిపి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలనీ, ఆయన రాజీనామా చేసేలా చూడాలని లేదా చట్టప్రకారం పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని చెప్పారు.
ఓటు హక్కు పరిరక్షణ కోసం వచ్చేనెల ఒకటిన ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి పిలుపునిచ్చాయని మంత్రి గుర్తు చేశారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా లక్షలాది మంది తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో రైల్వే బోగీలు కేటాయించాలని కోరినా కేంద్రం అనుమతులు ఇవ్వడం లేదని విమర్శించారు.
గత పది రోజులుగా తెలంగాణతోపాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇండియా కూటమి నేతలు, కార్యకర్తలకు రైళ్ల కేటాయింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. రాజకీయ కార్యక్రమాలకు రైళ్లను కేటాయించే విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని సూచించారు. రైల్వేలు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సొత్తు కాదనీ, అవి భారత ప్రజల ఆస్తి అని మంత్రి స్పష్టం చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వాలనీ, ప్రజాస్వామ్యబద్ధమైన కార్యక్రమాలకు అవసరమైన రవాణా సదుపాయాలను కల్పించాలని కోరారు.
సర్ ప్రక్రియతోపాటు రైల్వే శాఖ వ్యవహారాలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్ణయాలపై తమ పార్టీ ప్రశ్నలు లేవనెత్తుతోందని అన్నారు. ప్రజలకు సంబంధించిన అంశాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఆధారాలతో ప్రజల ముందుంచుతామని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధమైన నిరసనలను అడ్డుకోవడం, రాజకీయ కార్యక్రమాలకు ఆటంకాలు కల్పించడం వంటి చర్యలపై ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం, నిరసన తెలిపే హక్కుల గురించి మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు గతంలో వారి పాలనలో అనుసరించిన విధానాలను గుర్తు చేసుకోవాలని సూచించారు. ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకునే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న తీరు, వారి భాష, హావభావాలు బాధాకరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగులకు పొంగులేటి జన్మదిన కానుకను అందించారు. పీఎస్ఆర్ యువ నేస్తం పేరిట ఉచిత ఆన్లైన్ కోచింగ్‌ను ప్రారంభించారు. ఇప్పటివరకు లక్ష మందికిపైగా పేర్లు నమోదు చేసుకున్నారని పొంగులేటి చెప్పారు. ఎంతమందికైనా ఉచితంగా ఆన్లైన్లో శిక్షణ ఇస్తామని స్పష్టం చేశారు. ఆర్సీ ఎగ్జామ్స్ సంస్థ ఆధ్వర్యంలో యువతకు అండగా పీఎస్ఆర్ యువ నేస్తం ఉంటుందని అన్నారు. ఏడాది పాటు ఉచిత శిక్షణను అందిస్తామనీ, అవసరమైతే గడువును పొడిగిస్తామని స్పష్టం చేశారు. గ్రూప్స్, పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ, బ్యాంకింగ్ ఉద్యోగాలకు సంబంధించిన కోచింగ్‌ను అనుభవజ్ఞులైన అధ్యాపకులతో ఆన్లైన్ కోచింగ్ ఇస్తామనీ, నాణ్యమైన మెటీరియల్‌ను అందజేస్తామని అన్నారు. తాను 2013లో రాజకీయాల్లోకి ప్రవేశించాననీ, 2014లో ఎంపీగా గెలిచానని చెప్పారు. 2016లో ఖమ్మం ప్రాంతంలో నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. 2,300 మంది నిరుద్యోగులకు ఆఫ్‌లైన్‌లో శిక్షణ అందిస్తే వారిలో 462 మంది వివిధ ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారని వివరించారు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఆన్లైన్ కోచింగ్‌ను ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
త్వరలో 15 వేల ఉద్యోగాల భర్తీ
రెండేండ్లలో 72 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని పొంగులేటి అన్నారు. త్వరలో మరో 15 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వివరించారు. రానున్న కాలంలో మరిన్ని ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు వెలువడనున్నాయని చెప్పారు.
దీపావళిలోగా జర్నలిస్టులకు ఇండ్ల స్ధలాలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బుధవారం కలిసిన సందర్బంలో పాత్రికేయుల ఇండ్ల స్ధలాల అంశం చర్చకు వచ్చిందని పొంగులేటి చెప్పారు. రానున్న దీపావళిలోగా జర్నలిస్టుల ఇండ్ల స్ధలాల సమస్య పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి సమ్మతించారని అన్నారు. దీనివల్ల దీర్ఘకాలిక సమస్య తీరుతుందన్నారు. దీనిపై పాత్రికేయుల స్పందిస్తూ మంత్రి పుట్టినరోజున తమకు శుభవార్త వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు.
నిరాడంబరంగా పుట్టినరోజు వేడుకలు
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం తన పుట్టినరోజు వేడుకలను అత్యంత నిరాడంబరంగా జరుపుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా సీఎం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొని మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.






కామెంట్లు (0)