సెప్టెంబర్‌లో
6.7 శాతానికి పతనం
మైనింగ్ ఉత్పత్తిలో
6.2 శాతం క్షీణత
తయారీ రంగం డీలా
న్యూఢిల్లీ : దేశ పారిశ్రామిక రంగం వృద్ధికి మైనింగ్, తయారీ రంగాలు గండికొట్టాయి. కీలకమైన తయారీ రంగం మందగించడంతో సెప్టెంబర్‌లో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 6.7 శాతానికి క్షీణించింది. ఇంతక్రితం ఆగస్టులో 8 శాతంగా నమోదయ్యింది. బుధవారం కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం.. సెప్టెంబర్‌లో ఐఐపీ సూచీ 124.3 పాయింట్లకు పరిమితం కాగా, గతేడాది ఇదే నెలలో 116.5 పాయింట్లుగా చోటు చేసుకుంది. సెప్టెంబర్‌లో మైనింగ్, క్వారీయింగ్ ఉత్పత్తి 6.2 శాతానికి పతనమయ్యింది. ఆగస్టులోని 4.6 శాతం క్షీణతతో పోలిస్తే మరింత దిగజారింది. మరోవైపు పారిశ్రామికోత్పత్తి సూచీలో అత్యధికంగా 76.06 శాతం వాటా కలిగిన తయారీ రంగం వృద్ధి 7.6 శాతానికి పడిపోయింది. ఇది ఆగస్టులోని 8.6 శాతంగా చోటు చేసుకుంది. అయితే విద్యుత్, గ్యాస్ సరఫరా రంగాలు 11.2 శాతం వృద్ధితో మద్దతును అందించాయి. నీటి సరఫరా, మురుగునీటి, వ్యర్థాల నిర్వహణ రంగాలు 5.8 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
ఎలక్ట్రికల్ పరికరాల జోరు..
తయారీ రంగంలోని మొత్తం 23 పరిశ్రమల విభాగాల్లో 17 విభాగాలు సానుకూల వృద్ధిని సాధించాయి. ముఖ్యంగా ఎలక్ట్రికల్ పరికరాల తయారీ 33.9 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలిచింది. రబ్బరు, ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ 19.9 శాతం, మోటారు వాహనాలు, ట్రైలర్లు, సెమీ ట్రైలర్ల తయారీ 19 శాతం వృద్ధి చెందాయి. ప్రయాణికుల కార్లు, వాణిజ్య వాహనాలు, ఆటో విడిభాగాల ఉత్పత్తి పెరగడం ఆటోమొబైల్ రంగానికి మద్దతును అందించాయి.
వినియోగ వస్తువుల్లో బలహీనత..
వినియోగ ఆధారిత వర్గీకరణలో మధ్యంతర వస్తువుల ఉత్పత్తి 12.2 శాతం వృద్ధితో ముందంజలో నిలిచింది. పరిశ్రమల విస్తరణ, పెట్టుబడి కార్యకలాపాలకు కీలకమైన మూలధన వస్తువుల ఉత్పత్తి 10.4 శాతం పెరిగింది. మౌలిక సదుపాయాలు, నిర్మాణ సామగ్రి ఉత్పత్తి 7.2 శాతం, వినియోగదారుల మన్నికైన వస్తువుల ఉత్పత్తి 6 శాతం వృద్ధి చెందాయి. అయితే నిత్య వినియోగానికి సంబంధించిన మన్నికలేని వస్తువుల ఉత్పత్తి కేవలం 1.4 శాతానికే పరిమితమైంది. మూలధన, మధ్యంతర వస్తువుల తయారీలో రెండంకెల వృద్ధి నమోదవుతున్నప్పటికీ, రోజువారి వినియోగ వస్తువుల విభాగంలో బలహీనత కొనసాగుతుండటం పారిశ్రామిక రంగంలో ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. అక్టోబర్ నెల పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలను నవంబర్ 30న విడుదల చేయనుంది.



![We are not against restoration; we are against the plunder being carried out in the name of the Musi [project].](https://nvtg-prd.sgp1.digitaloceanspaces.com/Brs-1793216322963-0e75c4bf-e4c1-4722-876f-c497295fdc0d-360x240.webp)


కామెంట్‌లు (0)