ఎల్కేజీ విద్యార్థినిపై మూడో తరగతి విద్యార్థి దాడి
ఇటుక రాయి, పూలకుండీతో తలపై బాది.. కాలిబూటుతో తన్ని..
తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయిన చిన్నారి.. పరిస్థితి విషమం
స్కూల్ యాజమాన్యం పర్యవేక్షణ, నిర్లక్ష్యంపై పోలీసుల దర్యాప్తు
ఈ ఘటనపై హర్యానా విద్యాశాఖ మంత్రి కమిటీ ఏర్పాటు
చండీగఢ్: హర్యానాలోని పంచకులలో ఓ ప్రయివేట్ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. ఆ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేండ్ల బాలుడు, ఎల్కేజీ చదువుతున్న చిన్నారిపై దాడికి పాల్పడ్డాడు. ఇటుక రాయి, పూలకుండీతో విద్యార్థినిపై దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన బాలిక స్పృహ కోల్పయింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. పంచకులలోని ఓ పాఠశాలలో అక్టోబర్ 28న మూడో తరగతి చదువుతున్న ఎనిమిదేండ్ల బాలుడు, కిండర్ గార్టెన్ చదువుతున్న ఆరేండ్ల బాలికను మొదటి అంతస్తులోని ఖాళీగా ఉన్న తరగతి గదిలోకి ఈడ్చుకెళ్లాడు. ఆమె తలను బల్లపై రెండుసార్లు బలంగా బాదాడు. చిన్నారిని నేలపై పడేసి కాలి బూటుతో తన్నాడు. ఆ తర్వాత ఇటుక రాయి, పూలకుండీతో దాడి చేశాడు. దీంతో ఆ చిన్నారి స్పృహ కోల్పోయింది. రక్తపు మడుగులో పడి ఉన్నప్పటికీ ఆ బాలుడు ఆగకపోగా తలపై పలుమార్లు ఇటుక రాయితో దాడి చేశాడు. పాఠశాల ముగిసే సమయం కావడంతో ఆ చిన్నారిని ఇంటికి తీసుకువెళ్లడానికి వచ్చిన ఆమె తల్లిదండ్రులకు ఆ బాలుడే మొదటి అంతస్తులోని తరగతి గదికి వారిని తీసుకెళ్లాడు.
అక్కడ తీవ్ర గాయాలతో పడి ఉన్న కుమార్తెను చూసి బాలిక తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వెంటనే ఆమెను తొలుత సెక్టార్ 6లోని ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో చండీగఢ్‌లోని పీజీఐకి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాలకు చేరుకుని ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. ఎనిమిదేండ్ల బాలుడు ఇలాంటి దారుణానికి పాల్పడటంపై పోలీసులు ఖంగు తిన్నారు. ఆ బాలుడి ప్రవర్తనపై తల్లిదం డ్రులను ప్రశ్నిస్తున్నారు. అలాగే స్కూల్ యాజమాన్యం పర్యవేక్షణ, నిర్లక్ష్యంపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ క్లాస్‌రూమ్‌లోని సీసీటీవీలో రికార్డైన వీడియోను పరిశీలిస్తున్నారు.
ఈ ఘటనపై విచారణకు హర్యానా విద్యాశాఖ మంత్రి మహిపాల్ ధండా పై ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తోందని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబ సభ్యులకు ఆయన హామీ ఇచ్చారు.






కామెంట్లు (0)