కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ ముంబయి శివాజీ పార్క్‌లో భారీ నిరసన
ముంబయి: ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మహారాష్ట్ర రాజధాని ముంబయిలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ముంబయి శివాజీ పార్క్‌లో చేపట్టిన ఆందోళనకు వేలాది మంది యువకులు, విద్యార్థులు, పౌర సమాజ ప్రతినిధులు తరలివచ్చారు. గాంధీ కుటుంబానికి చెందిన తుషార్ గాంధీ, ప్రముఖ బాలీవుడ్ నటులు షబానా అజ్మీ, నసీరుద్దీన్ షా, సంగీత దర్శకుడు విశాల్ దద్లానీ పాల్గొని మద్దతు తెలిపారు. రాజకీయ పార్టీలు శివసేన (యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) పార్టీలు కూడా నిరసనకు తమ మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా నిరసనకారుల్ని ఉద్దేశించి సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే మాట్లాడుతూ మోడీ హయాంలో నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు జరిగిన రెండు నెలల వ్యవధిలోనే మరోసారి తాము నిరసన చేపట్టాల్సి వచ్చిందని అన్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను రద్దు చేయాలని, సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీజేపీ నాయకుడు అజింక్యా శిందే మాట్లాడుతూ సీఈసీ తప్పక రాజీనామా చేయాల్సిందేనని, నేర విచారణ ఎదుర్కోవాల్సిందేనని దాదర్‌లో జరిగిన నిరసనలో డిమాండ్ చేశారు. ఢిల్లీ పోలీసులు మళ్లీ క్రూరంగా ప్రవర్తించారని, మారండి లేకపోతే తామే మారుస్తామని సీజేపీ నాయకుడు సౌరవ్ దాస్ హెచ్చరించారు. ఈనెల 2న శివాజీ పార్క్‌లో ఆందోళనకు పోలీసుల అనుమతి లభించకపోయినప్పటికీ నిరసన తెలిపేందుకు పెద్ద సంఖ్యలో యువత తరలివచ్చింది. ఈ నిరసన నేపథ్యంలో శివాజీ పార్క్ పరిసరాల్లో భారీగా పోలీసులు, భద్రతా సిబ్బందిని మోహరించారు. సమీపంలోని దాదర్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చే మార్గాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ యువత నిరసన ప్రాంతానికి చేరుకుని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ త్రివర్ణ పతాకాలతో పాటు వివిధ ప్లకార్డులను ప్రదర్శించారు.







కామెంట్‌లు (0)