అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్
రంకాను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఢిల్లీ విమానాశ్రయం నుంచి బస్సులో తరలింపు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను ఢిల్లీ పోలీసులు విమానంలోకి చొరబడి మరీ నిర్బంధించారు. శనివారం ఉదయం 10.30 గంటలకు ముంబయి నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను, మరో ఇద్దరు ప్రతినిధులను విమానం దిగకముందే అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 10.45 గంటల సమయంలో టెర్మినల్-3లో ఎయిరిండియా విమానం దిగిన వెంటనే అక్కడ వేచి ఉన్న పోలీసులు ఒక్కసారిగా విమానంలోకి చొరబడ్డారు. అభిజీత్ దీప్కేతో పాటు సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాను మహిళా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పురుష పోలీసు అధికారులు ముందుకు రావాలని దీప్కే కోరినా వారు స్పందిం చలేదు. తాను అరెస్టు కావడానికే వచ్చానని ఈ సందర్భంగా దీప్కే పోలీసులకు తెలిపారు. ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితి సమయంలోనూ ఇలాంటి ఘటనలు జరగలేదని విమానంలోని తోటి ప్రయాణికులతో ఆయన అన్నారు. దేశం ఎటువైపు వెళ్తోందో గమనించాలని కోరారు. ప్రధాని భయమే ఈ చర్యల వెనుక ఉందని ఆయన వీడియో aసందేశంలో పేర్కొన్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ కొందరు ప్రయాణికులు విమానంలోనే ‘ఇంక్విలాబ్’, ‘వందేమాతరం’ నినాదాలు చేశారు. అయినప్పటికీ పోలీసులు ముగ్గురినీ నిర్బంధించి బయటకు తీసుకెళ్లారు. అనంతరం బస్సులో ఎక్కించి గుర్తుతెలియని ప్రాంతానికి తరలిం చారు. మరోపక్క సీజేపీ నేతల పట్ల పోలీసులు ఉగ్రవాదుల పట్ల వ్యవహరించినట్లుగా ప్రవర్తించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విమానయాన నిబంధనల ప్రకారం విమా నాల్లోకి ప్రవేశంపై కఠిన ఆంక్షలు అమల్లో ఉండగా, పోలీసులు విమానంలోకి చొరబడి నిర్బంధ చర్యలకు పాల్పడటం గమనార్హం.






కామెంట్‌లు (0)