Magazines

సీఈసీ తక్షణమే రాజీనామా చేయాలి....

55 నిమిషాల క్రితం

CEC should resign immediately
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 2 నిమిషాల చదవడం

​సీపీఐ(ఎం) నాయకుల అరెస్టు దుర్మార్గం

​ఎన్నికల ప్రధాన కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలి : ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సీపీఐ(ఎం) నేతల నిరసన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలనీ, ఓటు సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సీపీఐ(ఎం) అఖిలభారత నాయకులతో పాటు తెలంగాణ, వివిధ రాష్ట్రాల నాయకులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఇదే అంశంపై శనివారం హైదరాబాద్‌‌లోని ఆర్టీసీ క్రాస్‌ ‌రోడ్స్‌‌లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి. నాగయ్య మాట్లాడుతూ.. ఢిల్లీలో శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిస్తున్న పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీతో సహా పోలిట్ బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు, ఆర్. అరుణకుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు టి. జ్యోతితో పాటు ఇతర కేంద్ర కమిటీ సభ్యులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయాలైన సూర్జీత్ భవన్, ఏకేజీ భవన్‌లపై పోలీసులు దాడి చేసి, పార్టీ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసి వివిధ స్టేషన్లలో నిర్బంధించటం అమానుషమని అత్యంత దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మోడీకి ఒక ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రాజ్యాంగం ప్రకారం 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలనే సూత్రాన్ని విస్మరించి, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారనే నెపంతో ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల ఓట్లను ఏరికోరి దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లను రద్దు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అత్యంత అప్రజాస్వామికమైన రాజ్యాంగ ఉల్లంఘన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుర్మార్గపు చర్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు, యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారని గుర్తు చేశారు. ప్రజలు, ప్రతిపక్షాలు, యువత ఆందోళనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తక్షణమే జ్ఞానేష్ కుమార్‌తో రాజీనామా చేయించాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొండివైఖరి వీడాలని సూచించారు. లేదంటే సీఈసీ రాజీనామాతో ఆగకుండా మోడీయే రాజీనామా చేయాలనే డిమాండ్‌ ‌వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ అబ్బాస్, టి సాగర్ ప్రసంగించారు. హైదరాబాద్ సెంట్రల్ కమిటీ కార్యదర్శి ఎం వెంకటేష్, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్