హిందూ రాష్ట్ర స్థాపనకు ఆయుధంగా మార్చే యత్నం
సంఘ్ రాజకీయాలకు అనుగుణంగా మార్పులు
ఏకరూప చరిత్రను, సంస్కృతిని ప్రజలపై రుద్దేలా చర్యలు
దేశంలోని వైవిధ్యాన్ని, బహు ళత్వాన్ని దెబ్బ తీస్తున్నారు : సీతారాం ఏచూరి స్మారకోపన్యాసంలో ప్రముఖ చరిత్రకారిణి రోమిలా థాపర్
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
చరిత్రను హిందూ రాష్ట్ర స్థాపనకు ఆయుధంగా మార్చే ప్రయత్నాలను అప్రమత్తంగా ప్రతిఘటిం చాలని ప్రముఖ చరిత్రకారిణి, ప్రొఫెసర్ రోమిలా థాపర్ పిలుపునిచ్చారు. అధికారంలోకి రావడానికి, అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సాగిస్తున్న ప్రయత్నా ల్లో భాగంగా సంఘ్‌పరివార్ తప్పుడు చరిత్రను సృష్టించి, దాన్ని దేశ అధికారిక చరిత్రగా చెలామణి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతు న్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం నాడిక్కడ హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్‌లో సీతారాం ఏచూరి రెండో స్మారకోపన్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా “చరిత్ర రచన-ప్రాచీన భారతదేశ చరిత్ర” అంశంపై ఆమె మాట్లాడారు. హిందూ మెజా రిటీ ప్రయోజనాలను కాపాడే హిందూత్వ సిద్ధాం తానికి పదునైన ఆయుధంగా చరిత్రను పునర్ని ర్మించేందుకు, వక్రీకరించేందుకు ప్రణాళి కాబద్ధమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. విశ్వసనీయమైన ఆధారాలు లేని కల్పిత చరిత్రను వ్యతిరేకించే చరిత్రకారులు, పరిశోధ కులను కమ్యూనిస్టులుగా ముద్ర వేస్తున్నారన్నారు. దేశంలోని వైవిధ్యాన్ని, బహుళత్వాన్ని దెబ్బతీసి, ఏకరూప చరిత్ర ను, సంస్కృతిని ప్రజలపై రుద్దేందుకు ప్రయత్ని స్తున్నారని దుయ్యబట్టారు.
భారత దేశ చరిత్రను హిందూ, ముస్లిం ఘర్షణల చరిత్రగా చిత్రీకరించిన జేమ్స్ మిల్ వంటి వలసవాద చరిత్రకారులు అనుసరించిన బాటలోనే తీవ్ర హిందూత్వవాదులు పయనిస్తున్నారని ఆమె విమర్శిం చారు. ముస్లిం పాలకులు భారతదేశానికి రాకముందు వరకు దేశం సుదీర్ఘ స్వర్ణయుగంలో ఉందని, ప్రపంచంలోని అన్ని రంగాల విజయాలు ఆ కాలంలో నే సాధ్య మయ్యాయని వంటి తప్పుడు చారిత్రక వ్యాఖ్యా నాలతో వారు సిలబస్‌లను, పాఠ్య ప్రణాళికలను నింపుతున్నారన్నారు. చరిత్రను తప్పుగా ప్రచారం చేస్తూ, ఇటువంటి తప్పుడు చరిత్ర ను విద్యార్థుల మెదళ్లలోకి చొప్పిస్తున్నారని మండి పడ్డారు. ఇటువంటి అసత్యాలను, వాదనలు తప్పని నిరూపించే అనేక చారిత్రక ఆధారాలు, ఉదాహరణలు అందు బాటులో ఉన్నప్పటికీ, వాటిలో దేనినీ అంగీకరిం చేందుకు సిద్ధంగా లేరని పేర్కొ న్నారు. తాము చరిత్ర కారులమని చెప్పుకుంటూ, కల్పిత చరిత్రను రచిస్తున్న వారే ఈ ప్రయత్నాల వెనుక ఉన్నారని, వారికి అన్ని రకాల ప్రోత్సాహకాలు లభిస్తున్నాయని అన్నారు.
శాస్త్రీయ ఆధారాలతో చరిత్ర రచన
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా చరిత్ర నిర్మాణంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని రోమిలా థాపర్ వివరించారు. పురావస్తు శాస్త్రం, భాషాశాస్త్రం, జన్యుశాస్త్రం వంటి వివిధ విజ్ఞాన శాస్త్రాల నుంచి లభిస్తున్న ప్రాథమిక ఆధారాలను ఉపయోగించి మరింత ప్రామాణికమైన చరిత్రను నిర్మించేందుకు పరిశోధనలు సాగుతున్నాయని వెల్లడించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అధికారంలో ఉన్న భావజాలానికి సంబంధించిన రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని పరిరక్షించేందుకు సాగించే విస్తృత పోరాటంలో భాగంగానే ఈ ప్రతిఘటనను చూడాలని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, సీతారాం ఏచూరి సతీమణి, ఏచూరి ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ సీమా చిస్తీ, ప్రొఫెసర్ సీపీ చంద్రశేఖరన్ పాల్గొన్నారు. ఢిల్లీలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో ప్రముఖంగా నిలిచిన మలయాళీ విద్యార్థిని, ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్త పి. పవిత్రతో పాటు, ఆమె నిరసన చిత్రాన్ని తీసిన మలయాళ మనోరమ పిక్చర్ ఎడిటర్ జోసుకుట్టి పనయికల్‌ను ఈ సందర్భంగా సత్కరించారు.






కామెంట్‌లు (0)