Magazines

క్షణక్షణం.. భయం భయం!

57 నిమిషాల క్రితం

Every moment... sheer terror!
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 3 నిమిషాల చదవడం

కుటుంబాలకు దూరంగా నెలల తరబడి సంద్రంలో ఒంటరి జీవనం
అనునిత్యం అప్రమత్తత తప్పనిసరి దెబ్బతింటున్న మానసిక ఆరోగ్యం
యూఎస్‌ఎస్‌ జార్జ్‌ వాషింగ్టన్‌ నావికుల దుస్థితి

న్యూఢిల్లీ : మధ్యప్రాచ్యంలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు ఇంకా విడిపోలేదు. అవి ఎప్పుడు విడిపోతాయో కూడా తెలియని పరిస్థితి. యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌ స్థానంలో పశ్చిమాసియా జలాల్లో అమెరికా మోహరించిన యూఎస్‌ఎస్‌ జార్జ్‌ వాషింగ్టన్‌ యుద్ధ విమాన వాహక నౌకలోని సిబ్బంది, నావికులు ఈ క్లిష్ట పరిస్థితులలో ఎలా సర్దుకుపోతున్నారనే విషయంపై అంతర్జాతీయ మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నాయి. శత్రువుల కదలికలను నిరంతరం కనిపెడుతూ, అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఈ నౌకలోని నావికులు రాత్రింబవళ్లూ అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది. అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ విమానాల మోహరింపుతో ఈ నౌక ఓ రణరంగాన్ని గుర్తు చేస్తుంటుంది. కాబట్టి దీనిలో పనిచేయడం సవాలుతో కూడుకున్న పనే. సుదీర్ఘకాలం కుటుంబాలకు దూరంగా సముద్రంలో గడుపుతూ, మానసిక ఒత్తిడులను తట్టుకుంటూ నావికులు, సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉంటారు. ఇటీవల తమ నౌకలపై జరిగిన దాడులకు ప్రతీకారంగా అమెరికా సైన్యం ఇరాన్‌ చమురు ట్యాంకర్లను ధ్వంసం చేయడంతో ఇక్కడ యుద్ధ వాతావరణం మరింత వేడెక్కింది.

నీటిపై తేలియాడే నగరం
రాయిటర్స్‌ వార్తా సంస్థ ప్రతినిధి ఈ యుద్ధ విమాన వాహక నౌకను గత నెలలో సందర్శించారు. అనేక మంది నావికులతో ముచ్చటించారు. వారిలో 27 ఏండ్ల డెన్మార్ట్‌ ఒకరు. లౌడ్‌స్పీకర్లలో అత్యవసర హెచ్చరికలు వినిపించగానే నౌక డెక్‌పై ఉన్న డెన్మార్ట్‌ సహా నావికులందరూ హడావిడిగా రంగంలోకి దిగారు. డెన్మార్ట్‌ యుద్ధ విమానాల్లోకి బాంబులను చేరవేస్తుండగా ఆయన సిబ్బంది తమకు నిర్దేశించిన స్థానాలకు చేరుకున్నారు. ఈ ప్రక్రియ అంతా సిబ్బందిని జాగృతులను చేసేందుకు నిర్వహించిన ట్రయల్‌ మాత్రమే. హార్ముజ్‌ జలసంధి సమీపంలో జార్జ్‌ వాషింగ్టన్‌ చేపట్టిన మిషన్‌ ఇంకా ముగియలేదు. అది ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియదు. నౌకలోని సిబ్బందిని ఆగస్ట్‌ చివరలో జపాన్‌ నుంచి పశ్చిమాసియా జలాలకు తరలించారు. వాస్తవానికి విమాన వాహక నౌక సుమారు ఐదు వేల మంది సిబ్బందితో కూడిన ఓ తేలియాడే నగరం వంటిది. ఇందులో ప్రతి ఒక్కరికీ నిర్దేశిత లక్ష్యాలు ఉంటాయి. 19-25 ఏండ్ల మధ్య వయసున్న నావికులు కేవలం యుద్ధ విధులే కాకుండా నగదు రిజిస్టర్ల నిర్వహణ, వంట చేయడం, నౌక నిర్వహణ వంటి రోజువారీ పనులు కూడా చేయాల్సి ఉంటుంది.

తప్పని సవాళ్లు
అణ్వాయుధాలతో కూడిన ఈ యుద్ధ నౌక వర్జీనియాలోని న్యూపోర్ట్‌ న్యూస్‌ షిప్‌యార్డులో సుదీర్ఘకాలం మరమ్మతులకు గురైంది. ఈ కాలంలో 11 మంది యువ నావికులు ఆత్మహత్య చేసుకున్నారు. ముఖ్యంగా 2022 ఏప్రిల్‌లో కేవలం ఓ వారం వ్యవధిలోనే ముగ్గురు జూనియర్‌ నావికులు బలవన్మరణానికి పాల్పడడం సంచలనం సృష్టించింది. మరమ్మతులు పూర్తి చేసుకొని తిరిగి సముద్రంలో ప్రవేశించిన తర్వాత కూడా యూఎస్‌ఎస్‌ జార్జ్‌ వాషింగ్టన్‌లోని యువ నావికులకు సవాళ్లు తప్పడం లేదు. ప్రస్తుతం వారు సరికొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇరాన్‌ నుంచి ఎప్పుడు క్షిపణి, డ్రోన్‌ దాడులు జరుగుతాయోనన్న భయం వారిని నిత్యం వెంటాడుతోంది. దీంతో నిరంతర అప్రమత్తత తప్పనిసరి అవుతోంది. నెలల తరబడి సముద్రంలో గడపాల్సి రావడం, కుటుంబాలకు దూరంగా ఉండడం, సరిహద్దులలో ఉద్రిక్తతలు వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.

నౌక చుట్టూనే బతుకులు '
మా బతుకులన్నీ నౌక చుట్టూనే తిరుగుతుంటాయి. అందులోనే తింటాం.. పడుకుంటాం.. ఎక్సర్‌సైజులు చేస్తాం.. పనిచేస్తాం. మధ్యప్రాచ్యంలో మమ్మల్ని ఉంచినా లేక ఇతర సముద్రాలకు పంపినా పరిస్థితిలో పెద్దగా మార్పేమీ ఉండదు' అని ఓ నావికుడు వాపోయాడు. కుటుంబసభ్యులు, స్నేహితులకు దూరంగా ఉంటున్న నావికులకు తోటి వారే ఆప్తులు. వారితోనే కష్టసుఖాలు పంచుకుంటారు. నౌక డెక్‌ పైకి వెళదామంటే అది కూడా అత్యంత ప్రమాదకరమైన ప్రదేశమే. నౌకాదళంలో అనూహ్యమైన దానినే ఊహించాల్సి ఉంటుంది. గుండె నిబ్బరం చాలా ముఖ్యం. కుటుంబసభ్యులతో అప్పుడప్పుడూ వీడియో కాల్‌లో మాట్లాడుకునే అవకాశం ఉండడమే వారికి పెద్ద సంతోషం కలిగించే విషయం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్