Magazines

అరుణాచల్‌లో బీజేపీ సర్కారుకు నిరసన సెగ

1 గంట క్రితం

BJP government
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 26, 2026 | 2 నిమిషాల చదవడం

జలవిద్యుత్‌ ప్రాజెక్టుపై భగ్గుమన్న ప్రజాగ్రహం

ఎన్‌హెచ్‌పీసీ కార్యాలయం, పోలీస్‌ స్టేషన్‌కు నిప్పు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కళింగ్‌ మొయోంగ్‌ ఇంటిపై దాడి

స్థానికుల ఆందోళనలను పట్టించుకోని బీజేపీ ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష‍ాల విమర్శలు

ప్రాజెక్టు సర్వే నిలిపివేసి, గిరిజనుల అభిప్రాయాలు తీసుకోవాలని డిమాండ్‌


ఇటానగర్‌ : ప్రజల భూములు, అడవులు, నదులపై ప్రభావం చూపే భారీ ప్రాజెక్టుల విషయంలో స్థానికుల అభిప్రాయాలను పక్కనపెడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అరుణాచల్‌ప్రదేశ్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. 11,200 మెగావాట్ల సియాంగ్‌ అప్పర్‌ మల్టీపర్పస్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. తూర్పు సియాంగ్‌ జిల్లా పసీఘాట్‌లో ఆందోళనకారులు నేషనల్‌ హైడ్రోఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) కార్యాలయానికి, పోలీస్‌ స్టేషన్‌కు నిప్పంటించగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కళింగ్‌ మొయోంగ్‌, ఎమ్మెల్యే నినోంగ్‌ ఎరింగ్‌ నివాసాలపై దాడులు జరిగాయి. ఈ ఘటనల్లో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. మరోవైపు, ప్రాజెక్టుపై స్థానికుల ఆందోళనలను పరిష్కరించ డంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు గుప్పించింది. శుక్రవారం మూడు జిల్లాల్లో ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 12 గంటల బంద్‌ జరిగింది. సియాంగ్‌ జిల్లాలో నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడం తో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. రాత్రి 11 గంటల సమయంలో పసీఘాట్‌లో హింస చెలరేగి శనివారం తెల్లవారుజామున 3.30 గంటల వరకు కొనసాగింది.

ఆది బానే కేబాంగ్‌ అనే గిరిజన సంస్థ కార్యాలయాన్ని కూడా ధ్వంసం చేశారు. అరెస్టు చేసిన పది మంది కార్యకర్తలను విడుదల చేయాలని, సస్పెండ్‌ చేసిన గ్రామ పెద్దలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక సర్వేలను నిలిపివేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో మోహరించిన కేంద్ర బలగాలను వెనక్కి పంపాలని కోరుతున్నారు. ప్రాజెక్టుపై స్థానికుల అభ్యంతరాలను పరిష్కరించకుండా ముందుకు వెళ్లడం సరికాదని కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరా విమర్శించారు. జాతీయ, అంతర్గత భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సర్వేను నిలిపివేసి, ప్రజల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు, ముఖ్యమంత్రి పెమా ఖండూ హింసను ఖండిస్తూ శాంతిని పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుపై చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే, సియాంగ్‌ నదీ పరివాహక ప్రాంతం, గిరిజనుల భూములు, సంస్కృతిపై ప్రాజెక్టు ప్రభావం ఎలా ఉంటుందన్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రజల సమ్మతి, హక్కులకు ప్రాధాన్యం ఇవ్వకుండా అభివృద్ధి పేరుతో ముందుకు వెళ్లడం సమస్యను మరింత జటిలం చేసే ప్రమాదం ఉందనే ఆందోళనలు నెలకొన్నాయి.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్