Magazines

సీఈసీపై జనాగ్రహం

1 గంట క్రితం

Public Outrage Against the CEC
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 4 నిమిషాల చదవడం

పోటెత్తిన యువతరం

ఢిల్లీలో ‘ఓట్‌ చోరీ’కి వ్యతిరేకంగా ఇండియా బ్లాక్‌ భారీ ప్రదర్శన

సుప్రీంకోర్టు వరకు ర్యాలీ..భారీ సంఖ్యలో కదిలివచ్చిన ప్రజానీకం

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ 
అడ్డుకున్న పోలీసులు..

తీవ్ర ఉద్రిక్తత

​నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో

​ఎన్నికల కమిషన్‌ ‌విశ్వసనీయతను దెబ్బతీసిన ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం దేశ రాజ‌ధానిలో నిర్వహించిన ప్రదర్శన విజయవంతమైంది. ‘ఓట్‌ చోరీ’కి వ్యతిరేకంగా ఇండియా బ్లాక్‌ నేతలు నినాదాలు చేస్తూ సుప్రీంకోర్టు దిశగా కదలగా, వారికి భారీ సంఖ్యలో ప్రజలు తోడయ్యారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును పరిరక్షించాలని, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత ను నిర్ధారించాలని డిమాండ్‌ చేశారు. ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీఎంసీ నేత మ‌మ‌తా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఐ(ఎంఎల్‌) ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, శివ‌సేన నేత‌ సంజ‌య్ రౌత్, జెఎంఎం ఎంపీ మ‌హువా మాంఝీ తదితరులు ఈ ప్రదర్శనకు నాయకత్వం వహించారు. అయితే ఈ ర్యాలీని అడ్డుకునేందుకు వేలాది మంది ఢిల్లీ పోలీసులు, పారామిలటరీ దళాలతో సహా కేంద్ర బలగాలు ప్రయత్నించాయి. అయినప్పటికీ బారికేడ్లను నెట్టుకుంటూ ప్రజలు కదంతొక్కారు.


బస్సుల్లో బయలుదేరి.. రోడ్లపై భారీ ప్రదర్శన

ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో ఇండియా బ్లాక్‌ నేతలు సమావేశమయ్యారు. అనంతరం నాలుగు బస్సుల్లో సుప్రీంకోర్టు వైపు బయలుదేరారు. అక్కడి నుంచి అశోక రోడ్డు, రైసినా రోడ్డు, ఫిరోజ్‌షా రోడ్డు మీదుగా సాగిన ప్రదర్శన మండీ హౌస్‌కు చేరుకుంది. అనంతరం బారాఖంబా రోడ్‌ మీదుగా కన్నాట్‌ ప్లేస్‌కు వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి బారాఖంబా రోడ్డు వ‌ద్దకు చేరుకోగా అక్క‌డ రాహుల్ గాంధీ త‌దిత‌రులు బ‌స్సు దిగి న‌డుచుకుంటూ ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. సుప్రీంకోర్టుకు కేవలం 200 మీటర్ల దూరంలో ఉన్న భగవాన్‌ దాస్‌ రోడ్డుపై పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు వీరి ప్రదర్శనను అడ్డుకున్నాయి. దీంతో అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను ఆందోళనకారులు తోసివేశారు. దీంతో పోలీసులు బలప్రయోగం చేసి నిరసనకారులను అక్కడి నుంచి తొలగించారు.


రాజ్యాంగ ప్రతితో ప్రదర్శన

​భారత రాజ్యాంగ ముఖచిత్రాన్ని చేతబూని నాయకులు, కార్యకర్తలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే బ్యాట్‌మ్యాన్ మాస్క్ ధరించారు. ఓటు హక్కును పరిరక్షించాల్సిన ఎన్నికల సంఘమే ఓటర్ల జాబితాల సవరణతో అర్హులైన పౌరుల హక్కులకు విఘాతం కలిగిస్తోందని ఇండియా బ్లాక్ నేతలు విమ‌ర్శించారు. అఖిలేశ్‌ యావ‌ద్ మాట్లాడుతూ ‌బీజేపీని తొల‌గిస్తేనే దేశం, ప్రజాస్వామ్యం నిలబడతాయని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో సీపీఐ(ఎం) రాజ్యసభా పక్ష నేత జాన్‌ బ్రిట్టాస్‌, ఎంపీలు వి.శివదాసన్‌, ఎ.ఎ.రహీం, కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ, సీపీఐ రాజ్యసభా పక్ష నేత పి.సంతోష్‌ కుమార్‌, కర్నాటక ముఖ్యమంత్రి డికె శివకుమార్‌, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి సుఖ్వీంద‌ర్ సింగ్ సుఖ్‌, మంత్రి ఓ.జె. జనీష్‌, ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత సంయుక్త కార్యదర్శి ఐషే ఘోష్‌, అఖిల భారత ఉపాధ్యక్షురాలు శిల్పా సురేంద్రన్‌, డీవైఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షుడు హిమాఘ్నరాజ్‌ భట్టాచార్య, ఎఐఎడ‌బ్ల్యూయూ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బి.వెంక‌ట్‌, సామాజిక కార్య‌క‌ర్త యోగేంద్ర యాద‌వ్‌, రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌, ఎఐఎస్ఎ అఖిల భారత అధ్యక్షురాలు నేహా బోరా తదితరులు ప్రదర్శనలో పాల్గొన్నారు.పోటెత్తిన పోరాట సముద్రం


మరోసారి మెట్రో సేవలపై ఆంక్షలు

సుప్రీం మార్చ్ ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. మరోసారి ఢిల్లీలో మెట్రో సేవలపై ఆంక్షలు విధించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆరు మెట్రో స్టేషన్ల గేట్లు మూసి వేస్తున్నట్లు డీఎమ్‌ఆర్‌సీ ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. పటేల్ చౌక్, జన్‌పథ్, రాజీవ్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, బరాఖంబా స్టేషన్ల గేట్లను సోమవారం మూసివేశారు. మ‌రోవైపు సుప్రీం కోర్టు సీనియ‌ర్ న్యాయ‌వాది అభిషేక్ మను సింఘ్వీ నేతృత్వంలో న్యాయవాదులు జ్ఞానేశ్‌కుమార్‌కు, న్యాయవాదులపై పోలీసుల క్రూరత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ సుప్రీంకోర్టు నుం‌చి మోడరన్ స్కూల్ వరకు మార్చ్ నిర్వ‌హించారు.

మేం ఎవరికీ భయపడం.. ఈ పోరాటం నుంచి వెనక్కి తగ్గం : లోక్‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌‌గాంధీ

​మేం ఎవరికీ భయపడబోమని... ఈ పోరాటం నుంచి వెనక్కి తగ్గేది లేదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ఢిల్లీలో భయానక వాతావరణం సృష్టించారు. ఢిల్లీ రోడ్లపై 30 వేల మంది పోలీసులను మోహరించారు. జ్ఞానేశ్‌‌కుమార్‌‌ను ప్రధాని మోడీ ఎందుకు కాపాడుతున్నారు? ఆర్‌ఎస్‌ఎస్ వారికి ఉన్న స్వేచ్ఛ.. యువతకు ఎందుకు లేదు? ‌సీఈసీ చరిత్ర మాకు తెలుసు.. బయటపెడతాం. జ్ఞానేశ్‌ కుమార్ భయంతో ఉన్నారు. ఆయన నిద్రపోలేకపోతున్నారు’ అని పేర్కొన్నారు. ‘పోలీసులు కూడా ప్రతిపక్షాల నిరసన పట్ల సానుకూ లంగానే ఉన్నారు. మీరు చేస్తున్నది సరైనదేనని సగం మందికి పైగా పోలీసులు మాకు చెప్పారు. జ్ఞానేశ్‌ కుమార్ లాంటి దొంగను ఎందుకు కాపాడుతున్నాం? అని పోలీసులు కూడా బాధపడుతున్నారు. ఈపోరాటం నుంచి వెనుదిరిగేది లేదు. దీనికి రోజులు, వారాలు, నెలలు లేదా సంవత్సరాలు పట్టినా మాకు ఫరవాలేదు’ అని రాహుల్‌ పేర్కొన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చెందిన 200 మంది అధికారులు తమకు సమాచారం అందిస్తున్నారని, తమకు సమాచారం అందిస్తున్న వారిలో ఈడీ, సీబీఐ, విదేశాంగ శాఖలో పని చేస్తున్నారని అన్నారు. వారందరూ ఎన్నికల సంఘం అక్రమాలపై అసంతృప్తితో ఉన్నారని, అందుకే తమకు సహకరిస్తున్నారని పేర్కొన్నారు. ‘ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని సీజేఐకి చెప్పాల నుకున్నాం. అందుకే ఆయన అపోటెత్తిన పోరాట సము ద్రంపాయింట్‌మెంట్ కోరాం. మా విజ్ఞప్తిని ఆయన తిరస్క రించారు. మేం ఎక్కడికి వెళ్లాలనుకున్నా పోలీసులు అడ్డుకుంటున్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుకోవాలని సీజేఐ తెలిపారు. అందుకే సుప్రీంకోర్టుకు ర్యాలీగా వెళ్లాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకునేవారు మాతో కలిసి రండి’ అని రాహుల్‌ పిలుపునిచ్చారు. ప్రజలందరూ ఓ వైపు ఉంటే, ప్రధాని మోడీ, అమిత్‌ షా, జ్ఞానే‌శ్‌ కుమార్ మరో వైపు ‌నిలిచారని అన్నారు. తప్పుచేసినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్‌ను ప్రక్షాళన చేసేవరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇండియా బ్లాక్, సీజేపీ ఎవరు నిరసన తెలిపినా.. అందరి లక్ష్యం ఒకటేనని పేర్కొన్నారు. పౌర సమాజ సంస్థలు, ఉద్యోగులు, సాధారణ ప్రజలు ఈ ఉద్యమంలో తమతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్