Magazines

ధరల మోత..

1 గంట క్రితం

Skyrocketing prices...
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 2 నిమిషాల చదవడం

సెప్టెంబర్‌లో 5.54 శాతానికి రిటైల్ ద్రవ్యోల్బణం

రెండేండ్ల గరిష్టానికి చేరిక 7.74 శాతానికి ఎగబాకిన ఆహార ధరలు

ఉల్లి 108 శాతం ప్రియం

తెలంగాణలో 6.64 శాతం..ఏపీలో 6.29 శాతం నమోదు

అక్టోబర్‌లో 6 శాతానికి చేరొచ్చని అంచనా
న్యూఢిల్లీ : దేశంలో ధరల మోత మోగుతోంది. ద్రవ్యోల్బణ కట్టడిలో మోడీ సర్కార్‌ ‌విఫలం కావడంతో నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. దీంతో ప్రజల జేబుకు చిల్లుపడుతోంది. ముఖ్యంగా ఆహార పదార్థాలు, ఇంధన సంబంధిత రవాణా వ్యయాలు పెరగడంతో రిటైల్ ద్రవ్యోల్బణం రెండేళ్ల గరిష్టానికి ఎగబాకింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 5.54 శాతానికి చేరింది. ఆగస్టులో ఇది 4.83 శాతంగా నమోదయ్యింది. 2024 అక్టోబర్‌లో నమోదైన 6.21 శాతం తర్వాత ఇదే అత్యధిక స్థాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నిర్దేశించుకున్న 4 శాతం లక్ష్యానికి మించి వరుసగా నాలుగో నెలలోనూ ద్రవ్యోల్బణం పెరగడం ఆందోళనకరం.

జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఒ) సోమవారం విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఆహార పదార్థాల ధరలు భారీగా పెరగడం ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఆగస్టులో 5.97 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో ఏకంగా 7.74 శాతానికి ఎగిసింది. ఇది 2024 డిసెంబర్ తర్వాత అత్యధిక స్థాయి. ముఖ్యంగా ఉల్లి ధరల పెరుగుదల తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆగస్టులో 48.78 శాతంగా ఉన్న ఉల్లి ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 108.09 శాతానికి ఎగబాకింది. వెల్లుల్లి ధరల్లో 54.62 శాతం, నిమ్మకాయల్లో 36.41 శాతం ద్రవ్యోల్బణం నమోదయ్యింది. అల్లం ధరల ద్రవ్యోల్బణం 62.85 శాతంగా ఉంది. మరోవైపు టమాటా, బంగాళాదుంపల ధరలు కొంత దిగివచ్చాయి.

ఆహారేతర విభాగాల్లోనూ ధరల ఒత్తిడి కొనసాగుతోంది. వెండి ఆభరణాల ధరల ద్రవ్యోల్బణం 87.80 శాతంగా నమోదయ్యింది. దీంతో వ్యక్తిగత సంరక్షణ, ఇతర వస్తువుల విభాగంలో ద్రవ్యోల్బణం 13.75 శాతానికి చేరింది. మొత్తం 12 ప్రధాన విభాగాల్లో ఇదే అత్యధికం. ఇంధన సంబంధిత వ్యయాల ప్రభావంతో రవాణా ద్రవ్యోల్బణం ఆగస్టులోని 4.60 శాతం నుంచి 5.01 శాతానికి పెరిగింది. రెస్టారెంట్లు, వసతి సేవల విభాగంలో ద్రవ్యోల్బణం 8.38 శాతం నుంచి 9.36 శాతానికి చేరింది.

తెలుగు రాష్ర్టాల్లోనూ తాండవం

పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ధరల భారం మరింత తీవ్రంగా ఉంది. గ్రామీణ ద్రవ్యోల్బణం ఆగస్టులోని 5.24 శాతం నుంచి సెప్టెంబర్‌లో 6.08 శాతానికి పెరిగింది. పట్టణాల్లో 4.31 శాతం నుంచి 4.88 శాతానికి చేరింది. 50 లక్షలకు పైగా జనాభా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు అత్యధికంగా 6.81 శాతం ద్రవ్యోల్బణంతో మొదటి స్థానంలో నిలిచింది. ఒడిస్సా 6.70 శాతం, మధ్యప్రదేశ్ 6.68 శాతం తర్వాత తెలంగాణ 6.64 శాతంతో నాలుగో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 6.29 శాతం ద్రవ్యోల్బణం నమోదయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ద్రవ్యోల్బణం ఆర్‌బిఐ గరిష్ట లక్ష్య పరిమితి 6 శాతాన్ని అధిగమించడం ఆందోళకరం. రానున్న నెలల్లో ఖరీఫ్ పంటల దిగుబడి, మార్కెట్లకు కొత్త పంటల రాకపై ధరల పరిస్థితి ఆధారపడి ఉంటుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. పాత నిల్వలు తగ్గిపోవడం, కొత్త పంటలు ఇంకా మార్కెట్లకు పూర్తిస్థాయిలో రాకపోవడం ధరల పెరుగుదలకు కారణమని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన ఆర్థికవేత్త మదన్ సబ్నవిస్ తెలిపారు. ప్రతికూల వాతావరణ ప్రభావంతో అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతానికి చేరే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ప్రధాన ఆర్థికవేత్త దేవేంద్ర పంత్ అంచనా వేశారు. ఇదే జరిగితే ద్రవ్యోల్బణం ఆర్‌బిఐ లక్ష్య పరిమితిని తాకనుందన్నారు. ద్రవ్యోల్బణ కట్టడికి ఆర్‌‌బిఐ వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే రుణ గ్రహీతలపై మరింత వడ్డీ భారం పడనుంది. ఇది అంతిమంగా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్