Magazines

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్రా జీనామా చేయాలి

1 గంట క్రితం

The CEC must resign.
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 3 నిమిషాల చదవడం

​ సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌర‌వ్ దాస్‌తో పాటు నిర్బంధించిన వారిని విడుద‌ల చేయాలి
పోలీసుల క్రూర‌త్వానికి ముగింపు ప‌ల‌కాలి: విద్యార్థి, సామాజిక వేత్తల డిమాండ్‌


‌నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సర్‌ ‌ప్రక్రియలో అవ‌క‌త‌వ‌క‌ల ఆరోప‌ణ‌ల‌పై ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌నర్ జ్ఞానేశ్‌ కుమార్ త‌క్ష‌ణ‌మే రాజీనామా చేయాలని విద్యార్థి, సామాజిక వేత్తలు డిమాండ్‌ ‌చేశారు. సీజేపీ నేతలు అశుతోష్ రంకా, సౌర‌వ్ దాస్‌తో పాటు నిర్బంధించిన నిర‌స‌న‌కారులంద‌రినీ విడుద‌ల చేయాలనీ, పోలీసుల క్రూర‌త్వానికి ముగింపు ప‌ల‌కాలనీ, జంత‌ర్ మంత‌ర్‌ను నిర్దేశిత నిర‌స‌న ప్ర‌దేశంగా పున‌రుద్ధ‌రించాలని అన్నారు. ఈ సందర్భంగా గురువారం విలేకరుల సమావేశంలో సీజేపీ జాతీయ కన్వీనర్‌ అభిజీత్‌ ‌దీప్కే మాట్లాడుతూ ప్రధాని ‌నరేంద్ర మోడీకి సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ ఎందుకంత ముఖ్యమని, ఆయనకు ఎందుకంత రక్షణ కల్పిస్తున్నారని ప్ర‌శ్నించారు. ప్ర‌ధాని మోడీ ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి జ్ఞానేశ్‌ కుమార్ స‌హాయం చేస్తున్నార‌ని మనమెందుకు న‌మ్మ‌కూడ‌ద‌ని అన్నారు. ‘‘త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం చట్ట ఉల్లంఘ‌న అని అంటున్నారు. ఎవ‌రి కోసం? జ్ఞానేశ్‌కుమార్ కోస‌మా? మీరు ఢిల్లీని స్తంభింప‌జేశారు. రై‌ల్వేలను మూసివేశారు. మెట్రోల‌ను నిలిపివేశారు. ఢిల్లీని భార‌త్‌-పాకిస్తాన్ స‌రిహ‌ద్దులా ఒక స‌రిహ‌ద్దుగా మార్చారు. ఢిల్లీకి అన్ని బ‌ల‌గాల‌ను ర‌ప్పించారు. విద్యార్థి సంఘాల‌ను, ప్ర‌తిప‌క్షాల‌ను, మాజీ ముఖ్య‌మంత్రుల‌ను వీధుల్లో ఈడ్చుకెళ్లారు’’ అని అన్నారు. స‌మావేశనంత‌రం న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ రాజ్‌ఘాట్‌ను సంద‌ర్శించారు. మ‌హాత్మా గాంధీ బోధించిన విధంగా ఓటు హ‌క్కు కోసం శాంతి యుతంగా పోరాటం కొన‌సాగుతుంద‌ని అన్నారు.

ఎన్నిక‌లు స‌క్ర‌మంగా జ‌రిగేందుకు 
పోరాడుతున్నాం : ప్ర‌శాంత్ భూష‌న్‌

ఎన్నిక‌లు స‌క్ర‌మంగా జ‌రిగేలా చూడటానికి పోరాడుతున్నామ‌ని సుప్రీంకోర్టు సీనియ‌ర్ న్యాయ‌వాది ప్రశాంత్ భూష‌న్ అన్నారు. ప్ర‌తిప‌క్షం పాల‌నా మార్పు కోరుకుంటుంద‌ని ప్ర‌భుత్వం ఆరోపిస్తోంద‌ని, అవును తామంతా ప్ర‌భుత్వ మార్పును కోరుకుంటున్నామ‌ని, అందులో త‌ప్పేముంద‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వం మార‌డం ప్ర‌తి పౌరుడి ప్రజాస్వామ్య హ‌క్కు అని అన్నారు. గ‌తంలో ప్ర‌భుత్వ మార్పు కోసం బీజేపీ ఎన్నో ఉద్య‌మాలు చేసింద‌ని, ఇప్పుడు ప్ర‌భుత్వ మార్పు కోసం కుట్ర జ‌రుగుతోందన‌డంలో హాస్యాస్ప‌దంగా ఉంద‌ని చెప్పారు. నిర‌స‌న‌ల‌ను అణ‌చివేయ‌డానికి అధికారులు ఎంతగా ప్ర‌య‌త్నిస్తే, ప్ర‌జ‌లు అంత‌గా వీధుల్లోకి వ‌స్తార‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌జా స్వామ్యంలో ప్ర‌భుత్వంపై అసంతృప్తిని వ్యాప్తి చేయ‌డం నేరం కాద‌ని, తాము ప్ర‌స్తుతం ఎన్నిక‌లు స‌క్ర‌మంగా జ‌రిగేందుకు పోరాడుతున్నామ‌ని అన్నారు. కానీ ఈ విధ‌మైన క్రూర‌త్వం కొన‌సాగితే, కచ్చితంగా పాల‌నా మార్పు వ‌స్తుంద‌ని పేర్కొన్నా రు. ప్ర‌భుత్వ మార్పు ఉద్యమానికి యువ‌త నాయ‌ క‌త్వం వ‌హిస్తుంద‌ని, పౌర స‌మాజ స‌మూహాలు, రాజ‌కీయ పార్టీలు కూడా భాగ‌స్వామ్యం అవుతున్నాయ‌ని తెలిపారు. శాంతియుత నిరసనకారులపై పోలీసుల చర్యను, లాఠీచార్జి వీడియోలను ఉటంకిస్తూ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఖండించారు. ఆయన ఈ పరిస్థితిని “గూండా రాజ్”గా అభివర్ణించారు.

​బీజేపీ గెలుపునకు సీఈసీ స‌హాయం :ఐషీఘోష్‌

​దేశ‌వ్యాప్తంగా బీజేపీ గెల‌వడానికి సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్ స‌హాయం చేశార‌ని ఎస్ఎఫ్ఐ అఖిల భార‌త స‌హాయ కార్య‌ద‌ర్శి ఐషీఘోష్ విమ‌ర్శించారు. త‌మ‌కు అధికారంలో ఉన్న ‌బీజేపీపై కాకుండా ప్ర‌జ‌ల‌పైనే న‌మ్మ‌కం ఉంద‌ని, ప్ర‌జా స్వామ్యాన్ని ప‌రిర‌క్షించుకోవ‌డానికి పౌరులంద‌రూ ఏకం కావాల‌ని పిలుపునిచ్చారు. ‘‘మాకు బీజేపీపై ఆశ‌లు లేవు. మాకు ప్ర‌జ‌ల‌పైనే ఆశ‌లు ఉన్నాయి. అంద‌రం ఐక్యం అవ్వాల్సిన స‌మ‌యం ఇది. భ‌గ‌త్ సింగ్ పోరాడి, గాంధీ త్యాగం చేసిన ఈ దేశాన్ని మ‌నం కాపాడుకోవాలి’’ అని అన్నారు. దేశంలో లైంగికదాడులకు పాల్పడిన వారిని పూలమాలలతో సత్కరిస్తున్నారని, దేశం కోసం పోరాడిన వారిపై లాఠీలు ఝుళిపిస్తున్నారని విమర్శించారు.

జర్నలిస్టులనూ వేధిస్తున్నారు : నేహాబోరా

​నిరసనలను కవర్ చేస్తున్న జర్నలిస్టులనూ అధికారులు వేధిస్తున్నారని ఎఐఎస్ఎ అధ్యక్షురాలు నేహా బోరా విమర్శించారు. ‘‘జర్నలిస్టుల నుంచి కెమెరాలను ఎలా లాక్కున్నారో మేము చూశాం. ఈ నిరసనలను కవర్ చేస్తే కెమెరాలు తిరిగి ఇవ్వబడవని కూడా వారికి చెప్పారు’’ అని అన్నారు. ఢిల్లీ ఏసీపీ వివేక్ భగత్ ఒక మహిళా జర్నలిస్టును లైంగికంగా వేధించారని, ఆమె ఫిర్యాదుతో పోలీసులను ఆశ్రయించిన తర్వాత కులతత్వ వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఆ జర్నలిస్టుపై కౌంటర్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారని కూడా విమర్శించారు. ‘‘సామాన్య ప్రజలు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినప్పుడు, పోలీసులు శాంతిభద్రతలను కాపాడటానికి బదులుగా, ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీకి మద్దతిస్తూ ప్రజలనే అణచి వేస్తున్నారు. మన దేశంలో ఎంతో కాలంగా మనం చూస్తున్న దానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ" అని ఆమె అన్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో అక్ర‌మాల సాక్ష్యాల‌ను 
తుడిచివేయ‌డ‌మే సర్‌ ల‌క్ష్యం :సినీనటుడు ప్ర‌కాశ్‌రాజ్‌

గ‌త ఎన్నిక‌ల్లోని అక్ర‌మాల సాక్ష్యాల‌ను తుడిచివేయ‌డ‌మే సర్‌ ల‌క్ష్య‌మ‌ని సినీ న‌టుడు ప్ర‌కా‌శ్‌రాజ్ విమ‌ర్శించారు. ఇది కేవ‌లం ఓట‌ర్ల‌ను ఓట‌రు జాబితా నుం‌చి తొల‌గించే ప్ర‌య‌త్నం మాత్ర‌మే కాద‌ని, గ‌త ఎన్నిక‌ల్లో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల‌కు సంబంధించిన సాక్ష్యాల‌ను తుడిచిపెట్టే ప్ర‌య‌త్నమని అన్నారు. ఈ చ‌ర్య‌ ఒక కుట్ర‌లో భాగంగా క‌నిపిస్తోంద‌ని, దానిని నిరూపించ‌డానికి సాక్ష్యాధారాలు సేక‌రించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. ‘‘అక్రమంగా గెలిచిన ఈ ఎన్నిక‌ల్లో కొంత కుట్ర ఉంది. సర్‌ కేవ‌లం ఓట‌ర్ల‌ను తొల‌గించే కుట్ర మాత్ర‌మే కాదు. 2024 ఎన్నిక‌ల త‌రువాత వారు చేసిన ప‌నుల‌కు సంబంధించిన పాత సాక్ష్యాధారాల‌ను తొల‌గించ‌డం కూడా దీని ఉద్దేశం’’ అని అన్నారు. ఓటర్ల జాబితాలో ఒక వ్యక్తి పేరు చేర్చడాన్ని వ్యతిరేకించడానికి ఉపయోగించే ఫారం 7ను, ముస్లిం ఓటర్లను ‘‘నిశ్శబ్దంగా తొలగించడానికి’’ వాడుతున్నారని విమర్శించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్