కేరళంలోని మలప్పురంలో సీపీఐ(ఎం) నైట్ మార్చ్
ప్రధాని మోడీ, జ్ఞానేశ్ కుమార్ కి వ్యతిరేకంగా నినాదాలు
బీజేపీ ప్రభుత్వ హయాంలో పెరుగుతున్న మతతత్వం
ఆర్‌ఎస్‌ఎస్ ప్రభావంతో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్న ఈసీ :
సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎ. విజయరాఘవన్
మలప్పురం : కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కేరళంలోని మలప్పురంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నైట్ మార్చ్ నిర్వహించారు. కాగడాలు, ప్లకార్డులు, బ్యానర్లు , పార్టీ జెండాలను పట్టుకుని పలువురు నేతలు సీఈసీ జ్ఞానేశ్ కుమార్, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కోట్లాది మంది పౌరులకు ఓటు హక్కును నిరాకరించటాన్ని సీపీఐ(ఎం) తప్పు పట్టింది. సంఘ్ పరివార్ ప్రయోజనాలకు అనుగుణంగా సీఈసీ వ్యవహరిస్తున్నారని విమర్శించింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనలకు మద్దతుగానూ ఈ ప్రదర్శన చేపట్టింది. ఈ ప్రదర్శనలో సాంప్రదాయ కళా ప్రదర్శనలతో పాటు ‘ఆజాదీ’ (స్వేచ్ఛ) నినాదాలు కూడా వినిపించాయి. సీపీఐ(ఎం) జిల్లా కమిటీ కార్యాలయమైన ‘ఈఎంఎస్ మందిరం’ వద్ద ప్రారంభమైన ప్రదర్శన పట్టణం గుండా సాగి ప్రభుత్వ తాలూకా ఆస్పత్రి వద్ద ముగిసింది. సీపీఐ(ఎం) జిల్లా సెక్రెటేరియట్ సభ్యులు కేపీ. అనిల్, ఇ. జయన్, వి. శశకుమార్, వి.ఎం. షౌకత్, కేపీ. సుమతి, బి. మహమ్మద్ రజాక్ తదితరులు ఈ మార్చ్‌కు నాయకత్వం వహించారు. ముగింపు సభను సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎ. విజయరాఘవన్ ప్రారంభించారు. జిల్లా కార్యదర్శి వి.పి. అనిల్ రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. మాజీ మంత్రి కె.టి. జలీల్ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గాయకులు పుష్పావతి , అతుల్ నరుకర ప్రదర్శనలు ఇచ్చారు.
మలప్పురంలో సీపీఐ(ఎం) నిర్వహించిన ప్రదర్శనలో రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎ. విజయరాఘవన్ , మాజీ మంత్రి కె.టి. జలీల్ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా విజయరాఘవన్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ బీజేపీ ప్రభుత్వ హయాంలో మతతత్వం పెరుగుతోందని, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్‌ఎస్) ప్రభావంతో భారత ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోందని విమర్శించారు. ఓటర్ల జాబితాలో చేపట్టిన ప్రత్యేక సవరణ ప్రక్రియ (సర్) వల్ల దాదాపు 13 కోట్ల మంది తమ ఓటు హక్కును కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఓటు హక్కును కల్పించిందని, ఈ హక్కును పొందేందుకు ప్రజలు గతంలో ఎప్పుడూ పోరాడాల్సిన అవసరం రాలేదని ఆయన గుర్తు చేశారు. అయితే, ప్రధాన ఎన్నికల కమిషనర్ , ప్రధాన మంత్రి కలిసి ఈ హక్కును ప్రజల నుంచి లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. ఢిల్లీలో జరుగుతున్న నిరసనలను అదుపు చేసేందుకు సుమారు 50 వేల మంది పోలీసు , పారామిలిటరీ సిబ్బందిని మోహరించారని, దీనివల్ల దేశ రాజధాని నగరం బారికేడ్లతో నిండిపోయిందని విజయరాఘ వన్ అన్నారు. బీజేపీ పాలనలో మైనారిటీలను అణచివేస్తున్నారని, ప్రజల హక్కులను కాలరాస్తున్నారని తెలిపారు. కేరళంలోని యూడీఎఫ్ ప్రభుత్వ తీరును తప్పుబట్టిన ఆయన, రాష్ట్రంలోని అధికార వర్గం బీజేపీతో రాజీ పడుతోందని ఆరోపించారు. వామపక్షాలను బలహీనపరచాలని ప్రయత్నించేవారు చివరికి విఫలమవుతారని విజయరాఘవన్ హెచ్చరించారు.







కామెంట్‌లు (0)