Magazines

వామపక్షాల ప్రదర్శన ఉద్రిక్తం

59 నిమిషాల క్రితం

The Left's demonstration is tense.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 4 నిమిషాల చదవడం

మింటో రోడ్డుకు చేరిన వామపక్ష శ్రేణులు

హరికిషన్‌ ‌సింగ్‌ సుర్జిత్‌ భవన్‌ నుంచి ఉజ్వల ప్రదర్శన

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామాకు డిమాండ్‌
పలువురికి గాయాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన ప్రదర్శన ఉద్రిక్తంగా మారింది. పోలీసుల నిర్బంధాలు, దాడులను ఎదుర్కొంటూ వందలాది మంది నాయకులు, కార్యకర్తలు మింటో రోడ్డుకు చేరుకున్నారు. ఈ క్రమంలో వారిని అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. సీపీఐ(ఎం) అధ్యయన కేంద్రం హ‌రికిష‌న్ సింగ్‌ సుర్జిత్‌ భవన్‌ నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శనలో సీపీఐ(ఎం), ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, సీపీఐ, ఎఐఎస్‌ఎఫ్‌ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ప్రదర్శనకు త్రిపుర మాజీ ముఖ్య‌మంత్రి, సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు మాణిక్‌ సర్కార్‌, సుభాషిణి అలీ, పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, అశోక్‌ ధావలే, తపన్‌ సేన్‌, జితేంద్ర చౌదరి, ఆర్‌. అరుణ్‌కుమార్‌, విజూ కృష్ణన్‌, కె.బాలకృష్ణన్‌, మరియం ధావలే, యు. వాసుకి, కేంద్ర కమిటీ సభ్యులు ఎళమరం కరీం, ఏఆర్‌ సింధు, మీనాక్షి ముఖర్జీ, లోకానందం, ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షుడు ఆదర్శ్‌ ఎం. సాజీ, సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు ప్రకాశ్‌ బాబు తదితరులు నాయకత్వం వహించారు. వీరి ప్రదర్శనను అడ్డుకునేందుకు సుర్జిత్‌ భవన్‌ ఎదుట ఉన్న ఇంద్రజిత్‌ గుప్తా మార్గ్‌లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది. పోలీసుల చర్యలను ముందే ఊహించిన కార్యకర్తలు ఇంద్రజిత్‌ గుప్తా మార్గ్‌ నుంచి దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ పార్క్‌ లేన్‌లోకి వెళ్లారు. దీంతో పోలీసులు, భద్రతా సిబ్బంది ప్రదర్శనకారుల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో కార్యకర్తలు పార్క్‌ లేన్‌ నుంచి పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ మార్గ్‌ వైపు పరుగులు తీశారు. ఈ సమయంలో ప్రదర్శన వెనుక ఉన్న కార్యకర్తలపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. మరోవైపు సుర్జిత్‌ భవన్‌లో ఉన్న నాయకులు, కార్యకర్తలపైనా పోలీసులు, భద్రతా సిబ్బంది లాఠీచార్జి చేశారు. ​పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ మార్గ్‌లోని బీజేపీ ప్ర‌ధాన‌ కార్యాలయం ఎదుట నుంచి ప్రదర్శన ముందుకు సాగుతుండగా పోలీసు ఉన్నతాధికారులు సహా పలువురు అధికారులు వాహనాల్లో అక్కడికి చేరుకున్నారు. అయినా నాయకులు, కార్యకర్తలు ముందుకు కదలగా వారిని నిలువరించేందుకు పోలీసులు బస్సుల‌ను రంగంలోకి దించారు. రంజిత్‌ సింగ్‌ ఫ్లైఓవర్‌ కింద పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ మార్గానికి అడ్డంగా బస్సును నిలిపారు. అయినా పోలీసుల ప్రయత్నం ఫలించలేదు. అడ్డంగా నిలిపిన బస్సును దాటుకుంటూ నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగారు. బారికేడ్లను సైతం అధిగమించి మింటో రోడ్డుకు చేరుకున్నారు. ఉదయం 10.35 గంటలకు మింటో బ్రిడ్జి కిందకు చేరుకున్న ప్రదర్శనకారులను పోలీసులు అడ్డుకున్నారు. వారిపై తీవ్రంగా దాడి చేశారు. కార్యకర్తలను చితకబాదేందుకు సరిహద్దు భద్రతా సిబ్బందిని సైతం పోలీసులు వినియోగించినట్టు సమాచారం. అనంతరం ఉదయం 10.50 గంటలకు నాయకులు, కార్యకర్తలందరినీ అరెస్టు చేసి వేర్వేరు నిర్బంధ కేంద్రాలకు తరలించారు. మాణిక్ స‌ర్కార్‌, జితేంద్ర చౌద‌రి, ఎల‌మ‌రం క‌రీం, అశోక్ దావ‌లే, యు.వాసుకీ, జి.రామ‌కృష్ణ‌న్‌ త‌దిత‌రుల‌ను రాజీవ్ గాంధీ స్టేడియంకు త‌ర‌లించారు.

నలుగురు మాజీ ముఖ్యమంత్రుల అరెస్టు

సీఈసీ రాజీనామా కోరుతూ నిరసన తెలిపిన నలుగురు మాజీ ముఖ్యమంత్రులను పోలీసులు అరెస్టు చేశారు. జంతర్ మంతర్ వద్ద సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు, కేరళం ప్రతిపక్ష నాయకుడు పినరయి విజయ‌న్‌‌ను పోలీసులు అరెస్టు చేశారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ వద్ద సీనియర్ సీపీఐ(ఎం) నాయకుడు మాణిక్ సర్కార్‌(త్రిపుర) ను అదుపులోకి తీసుకున్నారు. సుర్జిత్ భవన్ నుంచి జంతర్ మంతర్ వరకు సాగిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. సౌత్ అవెన్యూలోని బస్ స్టాప్ వద్ద నిరసన తెలుపుతున్న తృణమూల్ కాంగ్రెస్ ఛైర్‌పర్సన్ మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్)ని అరెస్టు చేశారు. లోధి హౌస్‌లోని తన నివాసం వెలుపల ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ)ను అరెస్టు చేశారు. వీరితో పాటు సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు, త్రిపుర ప్రతిపక్ష నేత‌ జితేంద్ర చౌదరి కూడా అరెస్టయ్యారు.

సీపీఐ(ఎం) ఎంపీ రహీం, ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తల నిరాహార దీక్ష

సీపీఐ(ఎం) కేంద్ర కార్యాల‌యం (ఎకెజి భవన్) నుంచి జంతర్ మంతర్ వరకు మార్చ్ కు ఎంపీ ఎఎ ర‌హీం, డీవైఎఫ్ఐ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హిమఘ్నరాజ్ భట్టాచార్య, ఎస్ఎఫ్ఐ అఖిల భార‌త ఉపాధ్యక్షురాలు ఐషీఘోష్ నాయ‌క‌త్వంలో విద్యార్థి, యువ‌త ఒక్క‌సారిగా క‌దంతొక్కారు. విద్యార్థి, యువ‌తను అడ్డుకునేందుకు వంద‌లాది మంది ఢిల్లీ పోలీసులు, భ‌ద్ర‌తా సిబ్బంది మోహ‌రించారు. దీంతో పోలీసులకు, విద్యార్థి, యువ‌జ‌న నేత‌ల‌కు వాగ్వాదం చోటు చేసుకుంది. రాజ్య‌స‌భ ఎంపీ ఎఎ రహీం, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. నిరసనకారులను నిర్బంధించడానికి నాంగ్లోయ్ స్టేడియంను నిర్బంధ కేంద్రంగా మార్చారు. వారిని అదుపులోకి తీసుకున్న తరువాత‌ కూడా పోలీసులు విద్యార్థులపై దాడి చేశారు. దీంతో ఢిల్లీ పోలీసుల అకృత్యాలకు నిరసనగా సీపీఐ(ఎం) రాజ్య‌స‌భ ఎంపీ ఎఎ రహీం నేతృత్వంలో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఢిల్లీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ పవన్ తోమర్ విద్యార్థినులతో దురుసుగా ప్రవర్తించడమే కాక, అరెస్టు చేసిన విద్యార్థుల నుంచి లాక్కున్న ఫోన్లను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నాంగ్లోయ్ స్టేడియంలోనే నిరాహార దీక్ష ప్రారంభించారు. దీంతో ఫోన్లను తిరిగి ఇచ్చేందుకు పోలీసులు అంగీకరించారు. అలాగే వారి పట్ల దురుసు ప్రవర్తనపై విచారణ జరుపుతామని హామీ ఇవ్వడంతో దీక్షను విరమించారు. ఉన్నతాధికారుల ప్రత్యక్ష జోక్యంతో ఈ సమస్య పరిష్కారమైంది. అనంతరం రహీం, విద్యార్థులు జాతీయ గీతం ఆలపించారు. ఈ ప్రదర్శనలో అరెస్టైన వారిలో సీపీఐ(ఎం), డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు.... ఎంఎ బేబీ, పినరయి విజయన్, మాణిక్ సర్కార్, బృందా కరత్, సుభాషిణి అలీ, బీవీ. రాఘవులు, అశోక్ ధావ‌లే, ఎంవి గోవిందన్, ఎ. విజయరాఘవన్, జితేంద్ర చౌదరి, కె. బాలకృష్ణన్, యు. వాసుకి, ఆర్. అరుణ్ కుమార్, విజు కృష్ణన్, మరియం ధావ‌లే, జి. రామకృష్ణన్, ఈపి జయరాజన్, పుతలత్ దినేశన్, సిఎస్ సుజాత, పి. సతీదేవి, పికె శ్రీమతి టీచ‌ర్‌, ఎలమరం కరీం, కెకె శైలజ, థామస్ ఐజాక్, ​కెఎన్ బాలగోపాల్, టిపి.రామకృష్ణన్, పి. రాజీవ్, ఏఆర్ సింధు, అవధేష్ కుమార్, సుదీప్ దత్తా, పి. షణ్ముగం, జాన్ బ్రిట్టాస్, అనురాగ్ సక్సేనా, మీనాక్షి ముఖర్జీ, వి శివదాసన్, ఎఎ రహీం, హిమఘ్నరాజ్ భట్టాచార్య, సంజీవ్ కుమార్, ఆదర్శ్ ఎం సాజి, సృజన్ భట్టాచార్య, ఐషీ ఘోష్, శిల్పా సురేంద్రన్, సూరజ్ ఇలామాన్, గోపీనాథ్ రవీంద్రన్ ఉన్నారు. అలాగే సీజేపీ నాయకులు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ ర్యాంక్, రత్న సింగ్, సీపీఐ, ప్రకాష్ బాబు, రామకృష్ణ పాండే, నిషా సింధు, సుఖ్జిందర్ మహేసరి (ఎఐవైఎఫ్), దినేష్ శ్రీరంగరాజ్ (ఎఐఎస్ఎఫ్‌), విరాజ్ దేవాంక్ (ఎఐఎస్ఎఫ్), సీపీఐ (ఎంఎల్‌), దీపాంకర్ భట్టాచార్య, నేహా బోరా (ఎఐఎస్ఎ), ఆప్ నేతలు అరవింద్ కేజ్రీవాల్‌, తదితరులు ఉన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్