బీడీఎల్ మాజీ చీఫ్ కుటుంబ సంస్థకు రూ.56.8 కోట్ల క్షిపణి పరికరాల టెండర్!
అత్యవసరమంటూ బీడీఎల్ నిర్ణయం
మాజీ చైర్మెన్ సిద్ధార్థ్ మిశ్రా భార్యకు 95 శాతం వాటా
న్యూఢిల్లీ : దేశ రక్షణకు సంబంధించిన కీలక పరికరాల కొనుగోళ్లలో పారదర్శకత ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాం టిది క్షిపణుల లక్ష్య నిర్ధారణకు ఉపయోగించే ఆప్టికల్ సైట్స్ కొనుగోలు విషయంలో పోటీ లేకుండా ప్రయివేటు సంస్థకు అవకాశం కల్పించడం వివాదానికి దారితీసింది. హైదరా బాద్‌కు చెందిన ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) రూ.56.8 కోట్ల విలువైన ఈ టెండర్‌ను మాజీ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ్ మిశ్రా కుటుంబానికి చెందిన ఐంద్రి డిఫెన్స్ అడ్వైజరీ ప్రయివేట్ లిమిటెడ్‌కు కేటాయించే దిశగా ముందుకెళ్తోంది. ఈ వ్యవహారంలో ప్రయోజనాల సంఘర్షణకు అవకాశం ఉందా? పోటీ టెండర్‌ను ఎందుకు పక్కనపెట్టారు? అత్యవసర పరిస్థితి ఏమిటి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అసలేం జరిగింది?
ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. ఈ ఏడాది మేలో బీడీఎల్ 300 ఆప్టికల్ సైట్స్ కొనుగోలు కోసం ఐంద్రి డిఫెన్స్ అడ్వైజరీకి సింగిల్ టెండర్ జారీ చేసింది. అంటే ఇతర సంస్థల నుంచి పోటీ బిడ్లు ఆహ్వానించకుండా ఒక్క సంస్థకే అవకాశం కల్పించింది. ఏడు నెలల్లో 300 పరికరాలను సరఫరా చేయాల్సి ఉండగా, కొనుగోలు ఆర్డర్ ఇచ్చిన నెలలోపు ఐదు నమూనా పరికరాలను అందించాలి. వాటిపై పరీక్షలు నిర్వహించి, ఆమోదించిన తర్వాత మిగిలిన సరఫరా ప్రక్రియ కొనసాగుతుంది. ఈ టెండర్లో ఐంద్రి సంస్థ సాంకేతిక పరిశీలన దశను దాటింది. రూ.56.8 కోట్ల ధరను పేర్కొంది. ప్రస్తుతం ఆ సంస్థ బిడ్‌పై ఆర్థిక పరిశీలన జరుగుతోంది. అంటే టెండర్ ఇంకా తుది దశకు చేరలేదు. ఆర్డర్ ఖరారైనట్టు కూడా ప్రకటించలేదు.
మాజీ అధికారి కుటుంబ సంస్థ
సిద్ధార్థ్ మిశ్రా 2019 నుంచి మార్చి 2023 వరకు బీడీఎల్ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. అంతకుముందు ఆయన భారత నౌకాదళంలో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించారు. అనంతరం ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో మూడేండ్లు జనరల్ మేనేజర్‌గా పనిచేశారు. ఆయన పదవీ విరమణ చేసిన ఏడాదికి పైగా కాలం తర్వాత, 2024 మేలో మిశ్రా, ఆయన భార్య శంభవి కలిసి ఐంద్రి డిఫెన్స్ అడ్వైజరీ సంస్థను స్థాపించారు. తొలుత ఇద్దరికీ చెరో 50 శాతం వాటా ఉండేది. 2025 జనవరిలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), కోల్‌కతాలో సాంకేతిక సభ్యుడిగా నియమితులైన సంద ర్భంగా మిశ్రా ఆ సంస్థ డైరెక్టర్, వాటాదారు పదవుల నుంచి వైదొలిగారు. ప్రస్తుతం ఆయన భార్య శంభవి సంస్థలో 95 శాతం వాటా కలిగి డైరెక్టర్‌గా ఉన్నారు. కౌశికి నందన్ వాత్సా యనకు మిగిలిన ఐదు శాతం వాటా ఉంది.
మూడేండ్లలో తొలిసారి ప్రయివేటు సంస్థకు!
బీడీఎల్ ఇదే తరహా ఆప్టికల్ సైట్స్‌ను 2024, 2025లోనూ కొనుగోలు చేసింది. అయితే ఆ రెండు సందర్భాల్లోనూ పోటీ టెండర్లు నిర్వహించింది. 2024లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకే అవకాశం కల్పించగా, 2025లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలు కూడా పాల్గొనేలా నిబంధనలు రూపొందించారు.
ఈ రెండు టెండర్లలోనూ ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ విజయం సాధిం చింది. కానీ 2026లో మాత్రం పోటీని పక్కనపెట్టి ఐంద్రి సంస్థకే టెండర్ జారీ చేశారు. ఈ కొనుగోళ్లలో మూడేండ్లలో తొలిసారిగా ఓ ప్రయివేటు సంస్థకు ఆర్డర్ వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఈ మార్పునకు కారణాలేమిటన్నది కీలకంగా మారింది.
స్పష్టత అవసరం : నిపుణులు
రక్షణ రంగంలో కీలకమైన పరికరాల కొనుగోళ్లలో వేగం ఎంత అవసరమో, పారదర్శకత కూడా అంతే అవసరం. అత్యవసర కొనుగోళ్లకు నిబంధనలు అనుమతిస్తున్నప్పటికీ.. పోటీని ఎందుకు పక్కనపెట్టారో స్పష్టమైన వివరణ ఉండాలి. ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారి కుటుంబానికి చెందిన సంస్థకు అవకాశం దక్కుతున్న నేపథ్యంలో, టెండర్ ప్రక్రియలో నిబంధనలు పూర్తిగా పాటించారా? నిర్ణయానికి తగిన ఆధారాలున్నాయా? అనే అంశాలపై స్పష్టత అవసరమనే అభిప్రాయాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
టెండర్ ప్రక్రియ, పారదర్శకతపై తలెత్తుతున్న అనేక ప్రశ్నలు
దేశ రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ సంస్థలో టెండర్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. గతంలో పోటీ పద్ధతిలో, ప్రభుత్వ రంగ సంస్థలకే పరిమితమైన కొనుగోళ్లకు భిన్నంగా.. ఈసారి పోటీ లేకుండా ఓ ప్రయివేటు సంస్థకు అవకాశం కల్పించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆ సంస్థను గతంలో అదే ప్రభుత్వ సంస్థకు నాయకత్వం వహించిన అధికారి, ఆయన భార్య కలిసి స్థాపించడం ఈ వ్యవహారంలో మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది.
అత్యవసరం.. కానీ కారణాలేవీ?
టెండర్లో పోటీని నివారించడానికి బీడీఎల్ ‘అత్యవసరం’ అనే కారణాన్ని చూపింది. నిబంధనల ప్రకారం.. అత్యవసర కొనుగోళ్లలో సింగిల్ టెండర్ విధానాన్ని అనుసరించవచ్చు. అయితే దానికి సరైన కారణాలు ఉండాలి. పోటీ టెండర్ ద్వారా కొనుగోలు చేయకపోవడం వల్ల అదనపు వ్యయం జరిగినా, అత్యవసర పరిస్థితి దృష్ట్యా అది సమర్థనీయమని సంబంధిత అధికార యంత్రాంగం ధ్రువీకరించాలి. అత్యవసరం ఎందుకు ఏర్పడింది? ముందుగా ఎందుకు అంచనా వేయలేకపోయారు? అనే వివరాలను కూడా నమోదు చేయాలి. ఈ టెండర్లో అత్యవసర పరిస్థితి ఉన్నట్టు ధ్రువీకరించినట్టు పేర్కొన్నప్పటికీ, ఆ అత్యవసరానికి సంబంధించిన నిర్దిష్ట కారణాలు బహిరంగంగా వెల్లడించలేదు. ఇదే ఇప్పుడు చర్చకు కారణమవుతోంది.
చిన్న సంస్థలకు అవకాశం ఉన్నా..
సూక్ష్మ, చిన్న తరహా సంస్థలకు (ఎంఎస్ఈ) ప్రాధాన్యం కల్పించే నిబంధన కూడా ఈసారి వర్తిస్తోంది. అర్హత కలిగిన ఎంఎస్ఈలు, అసలు పరికరాల తయారీదారులు అత్యల్ప ధరకు 15 శాతం పరిధిలో ధర కోట్ చేస్తే, ఆ ధరకు సరఫరా చేయడానికి అవకాశం ఇవ్వవచ్చు. అలా అంగీకరించిన సంస్థలకు మొత్తం ఆర్డర్లో గరిష్ఠంగా 25 శాతం వరకు కేటాయించే వీలుంటుంది. గత రెండు టెండర్లలో ఈ ప్రాధాన్య నిబంధన నుంచి మినహాయింపు ఉండగా, 2026 టెండర్లో దాన్ని వర్తింపజేశారు. అయినప్పటికీ, ఒక్క సంస్థకే ఆహ్వానం పలికిన నిర్ణయంపై ప్రశ్నలు కొనసాగుతున్నాయి. కాగా ఈ టెండర్‌పై ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పంపిన ప్రశ్నలకు బీడీఎల్ స్పందించలేదు. సిద్ధార్థ్ మిశ్రా, శంభవి కూడా ఫోన్ కాల్స్, సందేశాలకు సమాధానం ఇవ్వలేదు. సంస్థకు పంపిన ఈమెయిల్‌కు స్పందనా రాలేదు. మరో డైరెక్టర్ వాత్సాయన టెండర్ వివరాలను వెల్లడించలేనని తెలపడం గమనార్హం.






కామెంట్లు (0)