14 మంది మృతి..పలువురికి గాయాలు
గ్వాలియర్ : మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆలయానికి వెళ్తున్న భక్తులపై అదుపుతప్పిన ట్రక్కు దూసుకెళ్లడంతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. గ్వాలియర్లోని శీతలా మాత ఆలయం వద్ద శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ ప్రమాదం జరిగింది. వడ్ల లోడుతో వచ్చిన ట్రక్కు అదుపుతప్పి భక్తులను ఢీకొట్టడంతో పాటు ఆలయ ప్రధాన గేటు, బయటి గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. గ్వాలియర్ సీనియర్ పోలీసు అధికారి ధర్మవీర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఛినోర్ వైపు నుంచి వడ్ల లోడుతో ఒక ట్రక్కు శీతలా మాత ఆలయం వైపు వస్తోంది. ఆ మార్గంలో కొండ వాలు ఎక్కువగా ఉండటంతో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉన్నాయి. నవరాత్రుల సందర్భంగా అక్కడ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను నియంత్రిస్తున్నారు. అయితే, ఆ ట్రక్కు పోలీసుల బారికేడ్లను దాటుకుని ముందుకు వచ్చింది. ఆ తర్వాత డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. వేగంగా కిందికి దూసుకొచ్చిన ట్రక్కు రోడ్డుపై ఉన్న భక్తులపైకి వెళ్లింది. అనంతరం ఆలయ గేటు, బయటి గోడను ఢీకొట్టింది. ట్రక్కు కింద పలువురు చిక్కుకోవడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొందరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
39 మందిని ఆస్పత్రికి తరలింపు
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అధికారులు స్పందించారు. క్షతగాత్రులను అంబులెన్సుల్లో సమీప ఆస్పత్రులకు తరలించారు. గ్వాలియర్ పోలీసు అధికారి ధర్మవీర్ సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం, మొత్తం 39 మందిని ఆస్పత్రులకు తీసుకెళ్లారు. వారిలో పలువురు మరణించారు. మరో ఐదారు మంది పరిస్థితి విషమంగా ఉంది. కొందరికి ఎముకలు విరిగాయని, మిగిలిన వారు స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ ప్రమాదంలో విధుల్లో ఉన్న ఇద్దరు పోలీసు సిబ్బంది కూడా గాయపడ్డారు. వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. గ్వాలియర్ కలెక్టర్ రుచికా చౌహాన్ కూడా ప్రమాదంపై వివరాలు వెల్లడించారు.






కామెంట్లు (0)