Magazines

వామ్మో ఎల్‌నినో..చక్కెర నుంచి రుణాల దాకా..

4 గంటల క్రితం

ELnino
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026 | 3 నిమిషాల చదవడం

- 12 శాతం వర్షపాతం లోటు
- ఆహార ద్రవ్యోల్బణం పెరిగే ముప్పు

- వాహనాల అమ్మకాలపై ప్రభావం..

- పలు రాష్ట్రాల్లో కరువు ఛాయలు

న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థను ఎల్‌ నినో తీవ్రంగా కలవరపెడుతోంది. పంటల దిగుబడి తగ్గడం, జలాశయాల్లో నీటి నిల్వలు సాధారణ స్థాయికంటే దిగువకు పడిపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి తగ్గడం వంటి పరిణామాలు వ్యవసాయంతో పాటు తయారీ, వినియోగ వస్తువులు, ఆటోమొబైల్‌, ఆర్థిక రంగాలపైనా ప్రభావం చూపే ప్రమాదం ఉంది. దేశవ్యాప్తంగా 12 శాతం వర్షపాత లోటు ఏర్పడటంతో పాటు రెండు ప్రధాన రాష్ట్రాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సైతం ద్రవ్యోల్బణ అంచనాలను పెంచిన నేపథ్యంలో ఈ ప్రభావం కేవలం వ్యవసాయ రంగానికే పరిమితం కాకుండా తయారీ, ఆర్థిక రంగాలపై కూడా తీవ్రంగా పడనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారని ఫైనాన్సీయల్‌ ‌ఎక్స్‌‌ప్రెస్‌ ఓ కథనంలో వెల్లడించింది. ఎల్‌నినో ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లు విసురుతోంది. ఇప్పటికే ఆహార ధరల పెరుగుదలపై ఆందోళనలు వ్యక్తమవుతుండగా, ఆర్బీఐ కూడా ద్రవ్యోల్బణ అంచనాలను పెంచింది. రసాయనాలు, ఎరువులు, వ్యవసాయ యంత్రాలు, ట్రాక్టర్లు, ఎఫ్‌ఎంసీజీ, రిటైల్‌, ద్విచక్ర వాహనాలు, ఆభరణాలు సహా పలు రంగాల డిమాండ్‌పై వర్షాభావ పరిస్థితులు ప్రతికూల ప్రభావం చూపవచ్చని కోటక్ నియో ఈక్విటీ రీసెర్చ్ విభాగం అధిపతి శ్రీకాంత్ చౌహాన్ హెచ్చరించారు. ఉత్తరాదిలో వరదలు, మహారాష్ట్ర, కర్నా టకలో కరువు పరిస్థితులు ఈ సమస్యను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి.

చక్కెర ఉత్పత్తి భారీగా తగ్గొచ్చు..

వర్షపాత లోటు ప్రభావంతో 2026–27 సీజన్‌లో భారత దేశ చక్కెర ఉత్పత్తి భారీగా తగ్గవచ్చని యుఎస్‌ ‌డిపార్ట్‌‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్స్‌ ‌ఫారిన్‌ అగ్రికల్చర్‌ ‌సర్వీస్‌ (‌యూఎస్‌ ఎఫ్‌ఏఎస్‌) అంచనా వేసింది. గతంలో 33.6 మిలియన్‌ టన్నులుగా అంచనా వేసిన ఉత్పత్తిని తాజాగా 29.5 మిలియన్‌ టన్నులకు తగ్గించింది. గత అంచనాతో పోలిస్తే 4.1 మిలియన్‌ టన్నుల కోత పడింది. చెరుకు ఉత్పత్తి అంచనాను కూడా గత సీజన్‌లోని 455 మిలియన్‌ టన్నుల నుంచి 434 మిలియన్‌ టన్నులకు తగ్గించింది. తీవ్రమైన వర్షాభావంతో చెరుకులో సుక్రోజ్‌ శాతం తగ్గడంతో పాటు కోతకు వచ్చే విస్తీర్ణం, మొత్తం దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని ‌యూఎస్‌ఎఫ్‌ఏఎస్‌ పేర్కొంది. నీటి కొరత కొనసాగితే 2027 ప్రారంభంలో చక్కెర మిల్లుల నిర్వహణ కూడా కష్టతరమవుతుందని హెచ్చరించింది.

ఆహార ధరలు పెరిగే ప్రమాదం

వర్షాభావ ప్రభావం ఆహార ధరలపై ఇప్పటికే కనిపిస్తోంది. వేసవిలో ధాన్యాలు, చక్కెర ధరలు పెరగగా, ప్రభుత్వ నిల్వలు గణనీయంగా ఉన్నప్పటికీ బియ్యం ధరలు 8.2 శాతం పెరిగాయి. సెప్టెంబరులో ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరగడం కూడా వినియోగదారులపై భారాన్ని పెంచింది. అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో ఆహార, పానీయాల ద్రవ్యోల్బణం వార్షిక ప్రాతిపదికన 8.5 నుంచి 9 శాతం మధ్య నమోదయ్యే అవకాశం ఉందని జపాన్‌ బ్రోకరేజ్‌ సంస్థ నోమురా అంచనా వేసింది. 2027 తొలి అర్ధభాగంలోనూ ద్రవ్యోల్బణం సుమారు 7 శాతం స్థాయిలో కొనసాగవచ్చని పేర్కొంది. ఆహార ధరలు ఎక్కువకాలం అధికంగా ఉంటే కుటుంబాల కొనుగోలు శక్తి తగ్గడంతో పాటు ఇతర వస్తువులు, సేవలపై చేసే ఖర్చులకూ కోత పడే ప్రమాదం ఉంది.

గ్రామీణ డిమాండ్‌కు దెబ్బ..

దేశంలోని 40 శాతానికి పైగా ప్రాంతాల్లో వర్షపాతం సాధారణ స్థాయికంటే తక్కువగా నమోదవడం ఖరీఫ్‌, రబీ పంటల దిగుబడిపై ఆందోళనలను పెంచుతోంది. జలాశయాల్లో నీటి నిల్వలు సాధారణం కంటే తక్కువగా ఉండటంతో నీటిపారుదలపై ఆధారపడే రబీ పంటలకు ముప్పు పొంచి ఉంది.

ఎల్‌నినో ప్రభావం 2027 మార్చి–మే వరకు కొనసాగవచ్చన్న అంచనాలు పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నాయి. పంటల ఉత్పత్తి మందగిస్తే వ్యవసాయ స్థూల విలువ జోడింపు (జీవీఏ) వృద్ధి తగ్గవచ్చని ఐడీఎఫ్‌‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ ముఖ్య ఆర్థికవేత్త గౌరా సేన్‌గుప్తా పేర్కొన్నారు. అయితే వ్యవసాయ జీవీఏలో అనుబంధ రంగాల వాటా దాదాపు 50 శాతానికి చేరడంతో గతేడాది పోలిస్తే వృద్ధి మందగమనం అంత తీవ్రంగా ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో సెప్టెంబరులో ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాల వృద్ధి మందగించడం గ్రామీణ డిమాండ్‌ పతనానికి సంకేతంగా కనిపిస్తోంది. ఉపాధి హామీ పథకం కింద పనుల కోసం డిమాండ్‌ పెరగడం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ ఒత్తిడికి సూచనగా ఉందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

బ్యాంకులకు సవాళ్లు

వర్షాభావ పరిస్థితుల ప్రభావం బ్యాంకింగ్‌, బ్యాంకింగేతర విత్త సంస్థల (ఎన్‌‌బీఎఫ్‌‌సీ) రంగానికీ విస్తరించే అవకాశం ఉంది. గత త్రైమాసికం చివరి వారంలో గ్రామీణ, సబ్‌ప్రైమ్‌ రుణ విభాగాల్లో బలహీనత కనిపించిందని కోటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ తెలిపింది. పంట ఆదాయాలు తగ్గి గ్రామీణ రుణగ్రహీతల చెల్లింపు సామర్థ్యం తగ్గితే ప్రభుత్వ రంగ బ్యాంకులు, గ్రామీణ ప్రాంతాలపై అధికంగా ఆధారపడిన ఎన్‌బీఎఫ్‌‌సీల రుణ వృద్ధి మందగించడంతో పాటు మొండి బకాయిలు పెరిగే ప్రమాదం ఉందని శ్రీకాంత్‌ చౌహాన్‌ హెచ్చరించారు. మొత్తంగా వర్షపాత లోటు, ఆహార ద్రవ్యోల్బణం, రబీ పంటలకు నీటి కొరత, గ్రామీణ కొనుగోళ్లలో మందగమనం రాబోయే రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థకు పరీక్షగా మారనున్నాయన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్